ఐపీఎల్​ రద్దు.?.మరో మార్గం లేదు

వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు ఐపీఎల్​ కూడా రద్దు దిశగా వెళ్తోంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్​వచ్చే ఏడాదికి వాయిదా పడగా, ఇండియాలోనూ ఐపీఎల్​ను నిర్వహించే పరిస్థితి కనబడటం లేదు. నిన్న మొన్నటి వరకు పాజిటివ్​ కేసులు నమోదుకాని ఈశాన్య రాష్ట్రాలలో ఈ లీగ్​ను నిర్వహించాలని కొన్ని ఫ్రాంచైజీలు భావించాయి. కానీ ఇప్పుడు అక్కడ కూడా పాజిటివ్​ కేసులు నమోదు కావడంతో చివరి ఆశలు కూడా ఆవిరయ్యాయి. దీనికి తోడు దేశం మొత్తం లాక్​డౌన్​ చేసేశారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలన్న ఆంక్షల మధ్య కనీసం గ్రౌండ్​లో పిచ్​ను తడిపే పరిస్థితులు కూడా లేవు. ప్లేయర్లతో పాటు మైదానం సిబ్బంది మొత్తం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక అంతర్జాతీయ విమానాలతో పాటు దేశీయ విమానాలను కూడా రద్దు చేయడంతో రాష్ట్రాల మధ్య సంబంధాలు కూడా తెగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో లీగ్​ను రద్దు మినహా బోర్డు  ముందు మరో అప్షన్​ లేదు.

మీటింగ్​ రద్దు!

ఐపీఎల్​ ఫ్యూచర్​పై చర్చించేందుకు మంగళవారం బీసీసీఐ, ఐపీఎల్​ పాలకమండలి, ఫ్రాంచైజీల ఓనర్ల మధ్య సమావేశం జరగాల్సి ఉంది. కానీ  దేశం ఎదుర్కొంటున్న సమస్యల మధ్య ఇప్పుడు ఐపీఎల్​ గురించి మాట్లాడటం సరైంది కాదనే ఉద్దేశంతో ఈ మీటింగ్​ను పూర్తిగా రద్దు చేశారు. లీగ్​ గురించి మాట్లాడటానికి ఈ టైమ్​లో మీటింగ్​ పెట్టడం సరైంది కాదని ఐపీఎల్​ చైర్మన్​ బ్రిజేశ్​ పటేల్​ కరాఖండీగా చెప్పేశారు. ‘ఐపీఎల్​ను నిర్వహించే ఆలోచన ప్రస్తుతానికైతే లేదు. గత నెలలో ఉన్న పరిస్థితుల ప్రకారం లీగ్​ను ఏప్రిల్ 15కు వాయిదా వేశాం. కానీ ఇప్పుడు దేశంలో  సమస్య రెట్టింపైంది. రాష్ట్రాల మధ్య సంబంధాలే తెగిపోతున్నాయి. ఒక రాష్ట్రం వ్యక్తులను మరో రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా కంచెలు వేస్తున్నారు. ఇక విదేశీయులు వచ్చే విమానాలను రానిస్తారా? ప్రతి రాష్ట్రంలో రాత్రయితే కర్ఫ్యూ విధిస్తున్నారు. వాహనాలను సీజ్​ చేసే కఠిన చట్టాలు తీసుకొచ్చారు. ఇలాంటి టైమ్​లో మైదానం సిబ్బంది వర్క్​ ఎలా చేస్తారు. స్టేడియాలను ఎలా మెయింటేన్​ చేస్తారు?  మనకు టైమ్​ కూడా లేదు. కరోనా నేపథ్యంలో దేశంలో ఏ ఆటలూ సాగడం లేదు. సాగే పరిస్థితి కూడా లేదు. ప్రజల ఆరోగ్యం కంటే దేనికి ప్రాధాన్యత లేదు. వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందని ప్రభుత్వంతో చర్చలు జరిపే పరిస్థితి కూడా లేదు’ అని పటేల్​ కుండబద్దలు కొట్టాడు.

రెండు, మూడు రాష్ట్రాలకే పరిమితమా?

ఒకవేళ ఐపీఎల్​ జరిగినా దేశం మొత్తం నిర్వహించే పరిస్థితులైతే లేవు. కరోనా కట్టడికి చాలా రాష్ట్రాలు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నాయి. మళ్లీ  ఫారిన్‌‌ ఆటగాళ్ల రాకతో వైరస్​ తిరిగి పుంజుకుంటే ఆపడం కష్టం. కాబట్టి ఈసారి లీగ్​ను రెండు, మూడు రాష్ట్రాలకే పరిమితం చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. అంటే మహారాష్ట్రలో మూడు ఇంటర్నేషనల్​ స్టేడియాలు అందుబాటులో ఉన్నాయి. వాటి మధ్య ప్రయాణ దూరం కూడా చాలా తక్కువ. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే చాలా మ్యాచ్​లు అక్కడే నిర్వహించే చాన్స్​ ఉంటుంది. ఇలా దేశంలో ఇలాంటి సౌకర్యాలు ఉన్న రెండు, మూడు రాష్ట్రాలకే పరిమితం చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఉంది. కానీ, ఏప్రిల్14వ తేదీ వరకూ లాక్‌‌డౌన్‌‌ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత కూడా ఆంక్షలు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో  ఈ ఆలోచనకు కూడా ఓకే చెప్పే చాన్స్‌‌ లేదు.

కరోనా పై పోరులో నేను సైతం

Latest Updates