కరోనా ఎఫెక్ట్​తో భారీగా తగ్గిన మక్కల ధర

ఖరీఫ్​లో క్వింటాల్​ 2,500..ఇప్పుడు రూ. 1,400
కరోనా ఎఫెక్ట్​తో కొనని పౌల్ట్రీ వ్యాపారులు
కరోనా వైరస్‌‌ ఎఫెక్టే కారణమంటున్నారు

మక్కలు కొనేందుకు ఆసక్తి చూపని వ్యాపారులు

కరోనా ఎఫెక్ట్​తో ఇప్పటికే చికెన్​అమ్మకాలు పడిపోయినయ్. కోళ్లు అమ్ముడుపోక.. వాటిని పెంచలేక.. ఫ్రీగా పంచిపెడుతున్నరు. ఈ ప్రభావం ఇప్పుడు మక్కల రైతులపైనా పడుతున్నది. ఖరీఫ్​లో క్వింటాల్​ మక్కలు రూ. 2500 రేట్​పలికినయ్. ఇప్పుడు రూ. 1400 కూడా ఇస్తలేరు. పౌల్ట్రీ బిజినెస్​చేసేటోళ్లు మక్కలు కొనకపోవుడుతో రేట్లు తగ్గినయ్.

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: వరంగల్‌‌ ఎనుమాముల మార్కెట్‌‌కు ప్రస్తుతం రోజుకు 500 బస్తాల వరకు మక్కలు వస్తున్నాయి. మరో నెల రోజులు గడిస్తే రోజుకు 6 వేల బస్తాలకు మించి మార్కెట్‌‌కు వస్తాయి. వీటిని కొనడానికి వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. క్వింటాల్‌‌కు రూ.1100 నుంచి రూ.1400లోపే కొంటున్నారు. కరోనా ఎఫెక్ట్‌‌ వల్ల పౌల్ట్రీ రంగం దెబ్బతింది. వ్యాపారులు మక్కలు కొనడానికి ఆసక్తి చూపకపోవడంతో మక్కల ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఖరీఫ్‌‌లో పత్తి పంటకు గులాబి పురుగు ఆశించి దిగుబడి సరిగా రాలేదు. పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే సమయంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు క్వింటాల్‌‌కు రూ.2 వేల నుంచి రూ. 2500 వరకు ధర అందింది.

దీంతో పత్తి వేసిన రైతులు రెండో క్రాప్​ కోసం చూడకుండా ఆ పంటను తొలగించి రబీలో మొక్కజొన్న వేశారు. వరంగల్‌‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రబీలో మొక్కజొన్న పంట సాధారణ సాగు విస్తీర్ణం 25 వేల హెక్టార్లు కాగా ఈసారి నాలుగింతల సాగు పెరిగింది. ఆరు జిల్లాల్లో కలిపి లక్ష హెక్టార్ల వరకు పంట సాగు చేసినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ముందుగా వేసిన రైతులకు మక్కలు చేతికి రాగా ఆలస్యంగా వేసిన వాళ్ల పంట మరో 15 రోజుల తర్వాత చేతికొస్తుంది. హెక్టార్‌‌కు 100 క్వింటాళ్ల చొప్పున 10 వేల టన్నుల వరకు మక్కల దిగుబడి వస్తుందని అంచనా.

కంటతడి పెడుతున్న రైతన్న

మొక్కజొన్న పంట చేతికి రావడంతో పలువురు మక్కలను ఎనుమాముల మార్కెట్‌‌కు తీసుకొస్తున్నారు. రోజుకు 500 బస్తాలలోపే వస్తున్నాయి. కరోనా వైరస్‌‌ ఎఫెక్ట్‌‌ వల్ల ధరలు మాత్రం రోజురోజుకు పతనమవుతున్నాయి. గురువారం మార్కెట్‌‌లో మక్కలు గరిష్ఠంగా రూ.1,362, కనిష్ఠంగా రూ.1,100 ధర పలికినట్లు రైతన్నలు చెబుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండిస్తే ఇంత తక్కువ ధరకు కొంటున్నారని పలువురు రైతులు కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాల్‌‌ రూ.1,760కి కూడా కొనడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్​ వల్ల మక్కల ధర భారీ తగ్గినట్లుగా మార్కెటింగ్‌‌ శాఖ అధికారులు చెబుతున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి మక్కలు కొని ఎగుమతి చేసే వ్యాపారులు పౌల్ట్రీ రంగం కుదేలవడంతో మార్కెట్‌‌కు రావడం లేదని అంటున్నారు.

వ్యవసాయ మార్కెట్లలో మక్కల ధరలు పడిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మక్కల కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతులు కోరుతున్నారు. ప్రతి యేటా రబీలో ప్రభుత్వం మార్క్‌‌ఫెడ్‌‌ ద్వారా మక్కలు కొంటుంది. వరంగల్‌‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత రబీలో 15 కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెరిచారు. ఈసారి పంట ఎక్కువగా సాగవడం వల్ల ప్రతి మండలానికి రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌‌ చేస్తున్నారు.

భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది

Latest Updates