డ్రైవర్‌ కొడుకు.. ఇండియా కెప్టెన్‌

ఆ కుర్రాడు ఊహ తెలిసినప్పటి నుంచి సచిన్‌‌ టెండూల్కర్‌‌ను ఆరాధిస్తూ.. టీవీలో అతని ఆట చూస్తూ.. లెజెండరీ క్రికెటర్‌‌ స్టయిల్లోనే బ్యాటింగ్‌‌ ప్రాక్టీస్‌‌ చేస్తూ పెరిగాడు. బుక్స్‌‌ బదులు బ్యాట్‌‌ పట్టినందుకు తండ్రి చేతిలో దెబ్బలు తిన్నాడు. లెధర్‌‌ బాల్‌‌తో ఆడితే గాయపడతానని భయపడ్డాడు. నాలుగు రోటీలు టిఫిన్‌‌ బాక్స్‌‌లో పెట్టుకొని.. రోజూ నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆరేడు గంటలు ప్రాక్టీస్‌‌ చేశాడు. పదకొండేళ్లకే తల్లిని కోల్పోయిన బాధను దిగమింగి ఆటపై దృష్టి పెట్టాడు. తన కొడుకు టీమిండియాకు ఆడాలన్న ఆమె కోరికను నెరవేర్చేందుకు చేరువయ్యాడు. అన్నింటికి మించి అత్యంత పేదరికంలో మరో నలుగురిని పోషిస్తూ… స్కూల్‌‌ వ్యాన్‌‌ నడిపి, పాలు అమ్మి, బరువులు మోసి సంపాదించిన డబ్బుతో తాను ఆటలో ముందుకెళ్లేందుకు ప్రతీక్షణం అండగా నిలిచిన తండ్రి కష్టానికి ప్రతిఫలం ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. అతను మరెవరో కాదు అండర్‌‌-19 వరల్డ్‌‌కప్‌‌లో పాల్గొనే ఇండియా కెప్టెన్‌‌ ప్రియమ్‌‌ గార్గ్‌‌.

ప్రియమ్‌‌ గార్గ్‌‌. ఇప్పుడు నేషనల్‌‌ వైడ్‌‌గా మార్మోగుతున్న పేరు. జనవరిలో జరిగే అండర్‌‌–19 వరల్డ్‌‌ కప్‌‌లో ఇండియాకు కెప్టెన్‌‌గా ఎంపికైన ఉత్తర్‌‌ప్రదేశ్‌‌కు చెందిన 19 ఏళ్ల మిడిలార్డర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌కు ఫ్యూచర్‌‌లో విరాట్‌‌ కోహ్లీ, పృథ్వీ షా మాదిరిగా సీనియర్‌‌ టీమ్‌‌కు ఆడే సత్తా ఉందని అంతా భావిస్తున్నారు. అయితే చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్న ప్రియమ్‌‌ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు.  ఓ డ్రైవర్​ కుటుంబంలో పుట్టి.. ఎన్నో కష్టాలను దాటుకొని ముందుకొచ్చాడతను.

మీరట్‌‌కు దగ్గర్లోని చిన్న టౌన్‌‌కు చెందిన  ప్రియమ్‌‌ ఏడేళ్ల వయసులో సచిన్​ టెండూల్కర్‌‌ ఆటను టీవీలో తొలిసారి చూసి.. తాను కూడా క్రికెటర్‌‌ అవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఫ్రెండ్స్​తో కలిసి గల్లీ క్రికెట్‌‌ ఆడడం మొదలెట్టాడు. మీరట్‌‌లోని విక్టోరియా పార్క్‌‌ క్రికెట్‌‌ స్టేడియంలో ప్రాక్టీస్‌‌కు తీసుకెళ్లాలని అంటే.. ఇది డబ్బున్నోళ్ల ఆట.. మనకెందుకు అని తండ్రి నరేశ్‌‌ గార్గ్‌‌ వారించాడు. చదువుపై దృష్టి పెట్టమని చెప్పాడు. కానీ, నేను క్రికెట్టే ఆడుతా అని మారాం చేసి తండ్రి చేతిలో దెబ్బలు తిన్నాడు. అయినా.. ప్రియమ్‌‌ పట్టు వీడలేదు. ఓ రోజు అతను గల్లీ క్రికెట్‌‌ ఆడుతూ మామ సునీల్‌‌ కుమార్‌‌ కంట పడ్డాడు. గార్గ్‌‌ బాగా ఆడుతున్నాడని, కోచింగ్‌‌ ఇప్పించమని అతనే నరేశ్‌‌ను ఒప్పించాడు. కొడుకు మనసు తెలుసుకున్న తండ్రి.. విక్టోరియా స్టేడియంలో కోచ్‌‌ ఆశీష్‌‌ శర్మ దగ్గరకు తీసుకెళ్లాడు. అప్పు చేసి మరీ కోచింగ్‌‌ సెంటర్‌‌లో చేర్చాడు. ఆ రోజు నుంచి గార్గ్‌‌కు ఒక్కటే పని. ఉదయం నాలుగు రోటీలు టిఫిన్‌‌ బాక్స్‌‌లో పెట్టుకొని బస్సెక్కడం.. 22 కిలోమీటర్లు ప్రయాణించి విక్టోరియా స్టేడియం చేరడం.. సాయంత్రం వరకు ప్రాక్టీస్‌‌ చేసి ఇంటికి రావడం. తొలుత బౌలింగ్‌‌పై కూడా ఇంట్రస్ట్‌‌ చూపెట్టినప్పటికీ.. కోచ్​లు ఆశీష్‌‌ శర్మ, సంజయ్‌‌ రస్తోగి సూచనతో బ్యాటింగ్‌‌పైనే ఫోకస్‌‌ పెట్టాడు. మొదట్లో లెధర్‌‌ బాల్‌‌ను ఫేస్‌‌ చేసేందుకు భయపడ్డా తర్వాత దానికి అలవాటు పడ్డాడు. అయితే, ఏ బాల్‌‌తో ప్రాక్టీస్‌‌ చేస్తున్నా.. అతని మదిలో సచిన్‌‌ టెండూల్కరే మెదిలేవాడు. తనను తాను సచిన్‌‌లా ఊహించుకుంటూ బ్యాక్ ఫుట్‌‌, ఫ్రంట్‌‌ఫుట్‌‌పై కవర్‌‌ డ్రైవ్స్‌‌ కొట్టడం నేర్చుకున్నాడు.

తల్లి మరణం.. తండ్రి కష్టం

అంతా సాఫీగా సాగుతున్న టైమ్‌‌లో గార్గ్‌‌ తల్లి చనిపోవడంతో అతని కుటుంబంలో విషాదం అలుముకుంది. అప్పటికి 11 ఏళ్లున్న ప్రియమ్‌‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక దశలో క్రికెట్‌‌ను వదిలేద్దామని అనుకున్నాడు. కానీ, తండ్రితో పాటు ముగ్గురు అక్కలు, అన్న సర్దిచెప్పడంతో మళ్లీ ఆటపై దృష్టి పెట్టాడు. ఒకవైపు మైదానంలో ప్రియమ్‌‌ చెమటలు చిందిస్తే.. అతనికి ప్రాక్టీస్‌‌ ఇప్పించేందుకు, కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి నరేశ్‌‌ గార్గ్‌‌ అంతకుమించి కష్టపడ్డాడు. స్కూల్‌‌ వ్యాన్‌‌ నడిపితే వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో పాలు అమ్మాడు. హమాలీ పని చేశాడు. పైసా పైసా పోగేసి గార్గ్‌‌కు క్రికెట్‌‌ కిట్లు కొనిచ్చాడు. ప్రాక్టీస్‌‌ ఫీజు కట్టాడు. అతని కష్టం వృథా పోలేదు. పన్నెండేళ్లకే ఉత్తర్‌‌ప్రదేశ్‌‌ అండర్‌‌–14 టీమ్‌‌లోకి వచ్చిన ప్రియమ్‌‌ ఫస్ట్‌‌ సీజన్‌‌లోనే ఓ హాఫ్‌‌ సెంచరీ కొట్టేసి తన టాలెంట్‌‌ నిరూపించాడు. అక్కడి నుంచి అతను వెనుదిరిగి చూసింది లేదు.

గతేడాదే సెలెక్ట్‌‌ అవ్వాల్సినా?

యూపీ తరఫున ఏజ్‌‌ గ్రూప్‌‌ క్రికెట్‌‌లో పరుగులమోత మోగించిన ప్రియమ్​ చాలా తక్కువ టైమ్‌‌లో స్టేట్‌‌లో పాపులర్‌‌ అయ్యాడు. 2016లో  శ్రీలంకలో జరిగిన ఆసియా కప్‌‌ (అండర్‌‌-–19)లో బరిలోకి దిగాడు. గతేడాదే అండర్‌‌–19 వరల్డ్‌‌కప్‌‌లో ఆడుతాడని భావించినా.. టోర్నీకి ముందు ఫామ్‌‌ కోల్పోవడంతో అవకాశం చేజారింది. ఆ ప్లేస్​లో మరెవరైనా ఉంటే కుంగిపోయే వారు. కానీ, ప్రియమ్‌‌ మాత్రం తన పెర్ఫామెన్స్‌‌ మెరుగు పరుచుకోవడంపై దృష్టి పెట్టాడు. గతేడాది సెప్టెంబర్‌‌లో విజయ్ హజారే ట్రోఫీలో చాన్స్​ దక్కించుకున్నాడు.  నెల తిరిగేసరికే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి తన ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో గోవాపై సెంచరీ కొట్టాడు. ఆ సీజన్​లో 10 మ్యాచ్‌‌ల్లోనే 814 రన్స్‌‌తో యూపీ తరఫున సెకండ్‌‌ హైయెస్ట్‌‌ స్కోరర్‌‌గా నిలిచాడు. మళ్లీ అండర్‌‌–19 టీమ్‌‌లోకి రావడంతో పాటు కెప్టెన్‌‌ అయ్యాడు. 18 ఏళ్లకే ఇండియా అండర్‌‌–23 టీమ్‌‌కు కూడా సారథ్యం వహించే స్థాయికి ఎదిగాడు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన దులీప్‌‌ ట్రోఫీలో ఇండియా గ్రీన్‌‌కు కూడా ఎంపికయ్యాడు. ఓవరాల్‌‌గా ఇప్పటిదాకా ఆడిన 12 ఫస్ట్‌‌క్లాస్‌‌ మ్యాచ్‌‌ల్లో 867 రన్స్‌‌ చేసిన గార్గ్​ యావరేజ్‌‌ 66.69 కావడం గమనార్హం. ఇక, 15 లిస్ట్‌‌-–ఎ మ్యాచ్‌‌ల్లో 539 రన్స్‌‌ చేశాడు. అండర్‌‌–16, అండర్‌‌–19లో రెండు డబుల్‌‌ సెంచరీలతో పాటు రంజీ ట్రోఫీలో డబుల్‌‌ కొట్టిన రేర్‌‌ ఫీట్‌‌ సాధించిన ప్రియమ్‌‌.. ఇండియా జూనియర్‌‌ టీమ్‌‌ కోచ్‌‌ రాహుల్‌‌ ద్రవిడ్‌‌ మార్గనిర్దేశంలో రాటు దేలాడు. టెక్నిక్‌‌, ఫుట్‌‌వర్క్‌‌, స్ట్రోక్‌‌ ప్లేలో పట్టు సాధించాడు. క్రీజులో ఓపిగ్గా బ్యాటింగ్‌‌ చేయడం  కూడా అలవాటు చేసుకున్నాడు. వాటికి తోడు నాయకత్వ లక్షణాలు కూడా ఉండడంతో ప్రతిష్టాత్మక టోర్నీలో ఇండియాకు కెప్టెన్సీ వహించే అవకాశం అతడిని వరించింది. ఈ మెగా టోర్నీలో గతంలో ఇండియాను గెలిపించిన మహ్మద్‌‌ కైఫ్‌‌ (2000), విరాట్‌‌ కోహ్లీ (2008), పృథ్వీ షా (2018) టీమిండియాకు కూడా ఆడి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రియమ్‌‌ కూడా వారి బాటలోనే నడవాలని ఆశిద్దాం.

నాన్నే నా రోల్‌‌ మోడల్‌‌

చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు. స్కూలు మానేసి ఇంటి దగ్గర్లోని ఓ పాన్‌‌ షాప్‌‌లో ఉన్న టీమ్​లో సచిన్‌‌ టెండూల్కర్‌‌ ఆట చూసేవాడిని. దాంతో, మా నాన్న చేతిలో తన్నులు తిన్నా. కానీ, ఆటపై నాకున్న ఇష్టాన్ని అర్థం చేసుకున్న నాన్న  కోచింగ్‌‌ ఇప్పించాడు. నా వెన్నంటే నిలిచాడు. పెద్ద ఫ్యామిలీని నడిపించేందుకు ఆర్థిక స్థోమత లేకున్నా ఆయన చాలా కష్టపడ్డాడు. ఎన్నో పనులు చేసి మమ్మల్ని పెంచాడు. నా కెరీర్‌‌కు సపోర్ట్‌‌గా నిలిచాడు.  ఆయన కష్టం వల్లే వరల్డ్‌‌కప్‌‌లో ఇండియాకు కెప్టెన్‌‌ కాగలిగా. నా రోల్‌‌ మోడల్‌‌ మా నాన్నే. –ప్రియమ్‌‌ గార్గ్‌‌

Latest Updates