వరదనీటితో జలమయమైన ఊళ్లు.. గుళ్లు

  • ఉప్పొంగుతున్న కృష్ణా, భీమా నదులు   
  • నీట మునిగిన తీరం వెంట పొలాలు
  • పలు ప్రాంతాలకు కనెక్షన్‌ కట్‌ 
  • మూడు జిల్లాల్లో రెడ్‍ అలర్ట్

మహబూబ్‍నగర్‍, నాగర్ కర్నూల్, వెలుగు: కృష్ణా, భీమా నదులు ఉప్పొంగుతూ ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాను వణికిస్తున్నాయి. నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. అనేక గ్రామాలకు బయటి ప్రపంచంతో కనెక్షన్‌‌ కట్‌‌ అయింది. పంటపొలాలు, తోటలు, రహదారులు అన్ని జలమయం అయ్యాయి. ఎగువ నుంచి వరద మరింత పెరుగుతుండడంతో ముంపు ముప్పున్న గ్రామాలు ఖాళీ చేయించి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండు నదులు పొంగుతుండడంతో తీరం వెంట ఊళ్లు, పొలాలు, ఆలయాలు నీట మునుగుతున్నాయి. నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాల్లో రెడ్‍ అలర్ట్ ప్రకటించారు. వనపర్తి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి నిరంజన్‍రెడ్డి పరిశీలించారు. నారాయణపేట, గద్వాల జిల్లా కలెక్టర్లు వెంకట్‍రావు, శశాంక్‌‌ తీర ప్రాంతాల వెంటే ఉంటూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

కృష్ణానది ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో నారాయణపేట, గద్వాల జిల్లాలోని పలు గ్రామాలు జలమయం అయ్యాయి. మరికొన్ని గ్రామాలు ముందస్తుగా ఖాళీ చేయించారు. ఆదివారం నారాయణపేట జిల్లాలోని హిందూపూర్‍ గ్రామంలోని ఎస్సీ కాలనిలోకి వరద నీరు చేరింది. వారికి అదే గ్రామంలో ఉన్న ప్రభుత్వ బడిలో పునరావాసం కల్పించారు.  భోజనాలు, దుప్పట్లు అందజేశారు. కృష్ణా–-హిందూపూర్‍ రోడ్డు నీట మునగడంతో కృష్ణా, తంగిడి, కురుమూర్తి, గురజాల గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కృష్ణా, భీమా నదుల సంగమం ప్రాంతం తంగిడి వద్ద పరిస్థితి భయానకంగా మారింది. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ముడుమాల, మురార్‍దొడ్డి గ్రామాల మధ్య రోడ్డు నీట మునిగింది. రాకపోకలు బంద్​ అయ్యాయి. వనపర్తి జిల్లా రాంపూర్‍ వద్ద చేపలచెరువులో చిక్కుకున్న ఇద్దరిని రెస్క్యూ టీమ్‌‌ కాపాడింది.

తుంగభద్ర నుంచి 2లక్షల క్యూసెక్కులు

పశ్చిమ కనుమల్లో వర్షాలతో తుంగభద్రలో ప్రవాహం పెరుగుతోంది. కర్నాటకలోని హోసపేటెలోని తుంగభద్ర డ్యామ్‌‌కు వరద వస్తుండడంతో ఆదివారం 2 లక్షల క్యూసెక్కులను కిందకు వదిలారు. ఈ నీరు 48 గంటల లోపు కర్నూలు.. గద్వాల జిల్లా సరిహద్దులో ఉండే సుంకేశులను చేరనుంది. దీంతో ఉమ్మడి మహబూబ్‍నగర్‍ జిల్లాలో తీర ప్రాంతాలను అధికారులు మరింత అప్రమత్తం చేశారు.

నీట మునిగిన బీచుపల్లి రామాలయం

గద్వాల జిల్లాలోని బీచుపల్లి పుణ్యక్షేత్రానికి వరద ముంచుకొచ్చింది. దీంతో తీరం వెంట ఉన్న రామాలయంలోకి ఆదివారం తెల్లవారు జామున వరద నీరు చేరింది. బెంగళూరు–హైదరాబాద్‍ జాతీయ రహదారి ఆనుకుని ఉన్న ప్రసిద్ద బీచుపల్లి పుణ్యక్షేత్రం 2009 వరదలకు ముంపునకు గురైంది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఆ పరిస్థితి తలెత్తింది. వరద మరింత పెరిగి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు చేరే అవకాశం ఉందని ఇరిగేషన్​ అధికారులు అంటున్నారు. నారాయణ్‌పేట్‌ జిల్లా కృష్ణా గ్రామంలోని దత్తాత్రేయ స్వామి దేవాలయం, పస్పుల వద్ద శ్రీవల్లభాపుర క్షేత్రాల్లోకి వరద నీరు భారీగా చేరింది. తంగడి వద్ద సంగమేశ్వ రాలయం నుంచి శనివారం నలుగురు పూజారులను రక్షించిన సంగతి తెలిసిందే.

వరద ప్రాంతాల్లో మంత్రి సింగిరెడ్డి పర్యటన

కృష్ణా తీరం గ్రామాలైన మునగమాన్ దిన్నె, పెంచికలపాడు, రంగాపూర్, పెబ్బేరు, బీచుపల్లిల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. సహాయక చర్యలపై అధికారులను అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మరోవైపు మాగనూరు మండలంలో సహాయక చర్యల్లో మక్తల్‍ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‍రెడ్డి పాల్గొన్నారు.

శ్రీశైలానికి పోటెత్తిన టూరిస్టులు

ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యామ్‌‌ 11 గేట్లు ఓపెన్‌‌ చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులకు చేరింది. పూర్తి కెపాసిటీ 215 టీఎంసీలకు గాను 193 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో 900 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. అనంతరం 615073 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. వరుస సెలవులు రావడంతో  ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి పెరిగింది.

ప్రాజెక్టు నుంచి మన్ననూర్ చెక్‌‌పోస్టు వైపు 30 కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. వెహికల్స్‌‌ గంటకు కిలో మీటర్ మాత్రమే కదులుతున్నాయంటే ట్రాఫిక్‌‌ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మన్ననూరు చెక్‌‌పోస్ట్‌‌ నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 10 వేలకు పైగా వాహనాలు ప్రాజెక్టు వైపు వెళ్లినట్లు ఆఫీసర్లు తెలిపారు.

Latest Updates