గాలివానకు కుప్పకూలిన మార్కెట్ షెడ్డు

హయత్‌నగర్, వెలుగుహైదరాబాద్​ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో కోహెడ ఫ్రూట్ మార్కెట్‌లో షెడ్డు కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న షెడ్డు రేకులు ఎగిరిపడటంతో అక్కడే ఉన్న రైతులు, వ్యాపారులు, కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈదురుగాలులకు షెడ్డు రేకులు ఎగిరిపడ్డాయి. ఐరన్ పైపులు కూలిపోయాయి. మార్కెట్‌కు వచ్చిన వందల మంది రైతులు, వ్యాపారులు, కూలీలు భయాందోళనతో పరుగులు తీశారు. రేకులుపడి గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని ఆస్పత్రికి తరలించారు.

గాలివానకు ఆగమాగైమైన కోహెడ మార్కెట్‌‌ను బీ‌‌జే‌‌పీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. అక్కడి రైతులను పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష వైఖరితో రైతుల ప్రాణాల మీదకు వచ్చిందన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి గాయపడ్డ వారి ట్రీట్‌‌మెంట్‌‌ ఖర్చులు భరించాలని.. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు.  షెడ్లను నాణ్యత లేకుండా నిర్మించి లక్షల రూపాయలు వృథా చేశారని అన్నారు.

రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి సబిత

మార్కెట్‌‌ను జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఘటనతో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు. ఇన్సూరెన్స్‌‌లు ఉన్నాయి కనుక రైతులకు నష్టం ఉండదన్నారు. ఈ ఘటనలో ఎవరికీ నష్టం జరగదన్నారు. కూలిన షెడ్లు తాత్కాలికంగా నిర్మించినవేనని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, డీ‌‌సీపీ సంప్రీత్ సింగ్ తదితరులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ప్రమాదానికి ముందే ఎం‌‌పీ కోమటిరెడ్డి పర్యటన

రైతులకు మాయమాటలు చెప్పి ఎలాంటి సౌకర్యాలు లేకుండా రాత్రికి రాత్రే ఫ్రూట్‌‌ మార్కెట్‌‌ను కోహెడకు తరలించారని స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. మార్కెట్‌‌లో కనీస సౌకర్యాలు సైతం కల్పించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోమటిరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు.

కోహెడ ఘటన దురదృష్టకరం: నిరంజన్‌‌రెడ్డి

గాలివానతో కోహెడ మార్కెట్‌‌లో జరిగిన ప్రమాద ఘటన దురదృష్టకరమని, బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గాయపడిన వారి ట్రీట్‌‌మెంట్‌‌ ఖర్చు ప్రభుత్వమే
భరిస్తుందని చెప్పారు.

Latest Updates