సమ్మె ఎఫెక్ట్: చిన్న వ్యాపారుల ఆమ్దానీ పోయింది

  • సమ్మెతో వెలవెలబోతున్న బస్టాండ్లు
  • సగం కంటే తగ్గిన సంపాదన
  • అల్లాడు తున్న పేద కుటుంబాలు

వెలుగు, నెట్వర్క్: ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా స్టూడెంట్లు, ప్యాసింజర్లే కాదు, బస్స్టేషన్లను నమ్ముకొని బతికే చిన్న వ్యాపారులూ ఆగమవుతున్నరు. బస్సుల్లో, బస్స్టేషన్ల లోపల, బయట స్నాక్స్, వాటర్ ప్యాకెట్స్, కంకులు, పండ్లు అమ్ముకుని బతికే స్మాల్ వెండర్స్ గిరాకీ లేక దినదిన గండంగా బతుకుతున్నరు. సరిపడా బస్సులు లేకపోవడం, టెంపరరీ డ్రైవర్లతో నడిపిస్తుండడం లాంటి కారణాలతో చాలా మంది ప్యాసింజర్ ప్రైవేట్ వెహికల్స్ పై వెళ్తున్నరు. బస్సుల కోసం బస్స్టేషన్లకు వచ్చే వారి సంఖ్య చాలా తగ్గింది. దీంతో బస్సులు ఎక్కి దిగుతూ స్నాక్స్ అమ్ముకునేవారితో పాటు వ్యాపారమూ దెబ్బతింటోందని బస్స్టాండ్ ముందు పండ్లు, వస్తువులు అమ్ముకునే తోపుడు బండ్ల వ్యాపారులు చెబుతున్నారు.

రెంట్ కట్టలేక..
బస్స్టేషన్లలో టెండర్ పాడి స్టాళ్లు దక్కించుకున్న వ్యాపారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. సమ్మె వల్ల బస్స్టేషన్లకు ప్యాసింజర్లు రావడం తగ్గింది. బయట ఆటోలు, ప్రైవేట్ వెహికల్స్లో వెళ్లిపోతున్నారు. దీంతో పండ్లు, స్నాక్స్, బుక్స్టాల్స్, ఇతర షాపులకు గిరాకీ పడిపోయింది. దీంతో నెలనెలా రెంట్ మీదపడుతోందని వ్యాపారులంటున్నారు. 2 నెలలుగా అప్పుచేసి కిరాయి కడుతున్నామని, పరిస్థితి ఇట్లే ఉంటే కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఓ మెట్టు దిగి, కార్మికులతో చర్చలు జరిపి, బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని వీరంతా కోరుతున్నారు.

యాభై రూపాయలన్నా వత్తలేవు..
నేను బస్టాండ్ ముందర గాజులు, బొట్టుబిళ్లలు, పిన్నీసులు అమ్ముకుంట. సమ్మెకు ముందు… రోజుకు 500 రూపాయల గిరాకీ వస్తుండె. బస్సులు బంద్ చేసినప్పటి నుంచి రోజుకు యాభై రూపాయలు కూడా వత్తలేవు. ఒక్కో రోజు అవి కూడా దొరుకుతలెవ్వు. ఎట్ల బతుకుడో ఏందో! నర్సవ్వ, జగిత్యాల

ఎట్ల బతకాలె..
ఆసిఫాబాద్ బస్టాండ్ ముందు చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్న. సమ్మెకు ముందు.. రోజు 300 రూపాయల దాక వచ్చేవి. ఆర్టీసీ సమ్మె కారణంగా జనం ఆసిఫాబాద్ వస్తలేరు. ఇప్పుడు రోజుకు వంద రావడమే కష్టమైతాంది. ఎట్ల బతుకుడో సమజైతలేదు.
– సంతోష్ , ఆసిఫాబాద్

మస్తు లాసయితున్న..
నేను 25 ఏండ్ల నుంచి కరీంనగర్ బస్టాండ్‌ ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేస్తు న్న. గతంలో ఎప్పుడు ఇంత నష్టం జరగలే. ఆర్టీసీ నమ్మెతో బస్టాండ్‌కు వచ్చెటోళ్లు తగ్గిన్రు. పండ్లు కొనేవాళ్లే లేరు. సమ్మెకు ముందు వరకు మంచిగ గిరాకీ అయ్యేది. ఇప్పుడు సగం కూడా కావట్లే. సమ్మె వల్ల రూ.60 వేల దాకా నష్టం జరిగింది.
– ఎండీ షాబీర్, పండ్ల వ్యాపారి

రెంట్​ మీద వడ్తంది..
జగిత్యాల కొత్త బస్టాండ్‌లో ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ షాప్ నడుపుతున్న. నెలకు రూ. 35 వేలకు టెండర్ పాడి తీసుకున్న. సమ్మెకు ముందు నెలకు రూ.50 వేల దాకా వచ్చేది. రెంట్ తీసేస్తే రూ.15 వేలు మిగిలేయి. సమ్మె వల్ల రూ.25 వేలే వస్తంది. రెంట్ కోసం రూ.10వేలు బయట అప్పు తీసుకొచ్చిన.
– చంద్రశేఖర్, జగిత్యాల

Latest Updates