గోడకు అంటించే వాల్ పేపర్లు..వైఫై గా మారిపోతే

ఇల్లు అందంగా కనిపించేందుకు వాల్​పేపర్లు అంటిస్తాం. కానీ, ఆ వాల్​పేపరే ఫోన్లకు, కంప్యూటర్లకు నెట్​ను అందించే వైఫైగా మారిపోతే ఎలా ఉంటుంది? ఆ వాల్​పేపరే ఇంట్లో పొల్యూషన్​ను గుర్తిస్తే.. ఇంకా సూపర్​ కదా. దానికి పవరే అవసరం లేకుంటే.. మరింత సూపర్​ కదా! అలాంటి ఓ వైఫై వాల్​పేపర్​నే తయారు చేశారు అమెరికాలోని మసాచుసెట్స్​ ఇనిస్టిట్యూట్​ఆఫ్​ టెక్నాలజీ (ఎంఐటీ)లోని మన ఇండియన్​ రీసెర్చర్లు. దాని పేరు ‘ఆర్​ఫోకస్​’. మామూలుగా అయితే మనం వాడే వైఫైకి చాంతాడంత వైరింగ్​ కావాలి. అది పనిచేయాలంటే పవర్​ కనెక్షన్​ ఇవ్వాలి. కానీ, ఆర్​ఫోకస్​కు అవేవీ అవసరం లేదు. మరి అదెలా పనిచేస్తుంది? అందుకు ఆర్​ఫోకస్​లో వేలాది చిన్నచిన్న వైర్​లెస్​ యాంటెన్నాలను ఏర్పాటు చేశారు. వాటిని కంట్రోల్​ చేసేందుకు ఓ సాఫ్ట్​వేర్​ను ప్రోగ్రామ్​ను రాశారు. ఆ సాఫ్ట్​వేర్​ ద్వారా యాంటెన్నాలు సిగ్నళ్లను తీసుకుని డివైస్​లకు అందిస్తుంది. మామూలు వాటితో పోలిస్తే పది రెట్లు ఎక్కువ శక్తిమంతమైన సిగ్నళ్లను ఇది ఇస్తుంది. వివిధ పరికరాలకు సంబంధించిన వందలాది సెన్సర్లను ఇది కనెక్ట్​ చేస్తుంది. వైరింగ్, పవర్​ వంటివేవీ లేవు కాబట్టి, దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువేనట. ఎంఐటీ కంప్యూటర్​ సైన్స్​ అండ్​ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ ల్యాబ్స్​కు చెందిన హరి బాలకృష్ణన్​, వెంకట్​ అరుణ్​ అనే పీహెచ్​డీ స్టూడెంట్లు ఈ ఆర్​ఫోకస్​ను తయారు చేశారు. దీంతో ఇల్లు, ఆఫీసు ఎక్కడైనా ఎక్కువ సంఖ్యలో డివైస్​లకు మెరుగైన వైఫై ఇవ్వొచ్చని వాళ్లు చెప్పారు. చిన్న నెట్​వర్క్​ డివైస్​లకు నెట్​ వస్తుందన్నారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అభివృద్ధి దశలోనే ఉందని, పూర్తయితే వైఫై, 5జీ సిగ్నళ్లు మరింత మెరుగవుతాయని అన్నారు.

Latest Updates