అమ్మా నీ దగ్గరికే వస్తున్నా..తల్లి మృతి తట్టుకోలేక తనువు చాలించిన కొడుకు

మేడిపల్లి, వెలుగు శివకుమార్​కు తండ్రి లేడు. తల్లే అన్నీ తానై పెంచి పెద్ద చేసింది. కానీ ఈ నెల16న నీళ్ల కోసం మోటారుకు కరెంట్ ​కనెక్షన్​ ఇస్తూ షాక్​కొట్టి ప్రాణాలొదిలింది. దీంతో తల్లిని కోల్పోయిన ఆ కొడుకు అప్పటినుంచి ఆమెను తలుచుకుని ఏడుస్తూనే ఉన్నాడు. అమ్మ లేని లోకంలో తాను కూడా ఉండలేనంటూ విలపిస్తున్నాడు. ఆదివారం కర్మకాండ నిర్వహించాల్సి ఉండగా ఒకరోజు ముందే ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లిలో విషాదం నింపింది.

మేడిపల్లికి చెందిన విజయకు..రాయికల్​కు చెందిన రాజేశంతో 30 ఏండ్ల క్రితం పెండ్లయ్యింది. వీరికి ఒక్కగానొక్క కొడుకు శివకుమార్​ (26) ఉన్నాడు. 20 ఏండ్ల క్రితం కుటుంబంలో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. కొడుకు మూడేండ్ల వయస్సున్నప్పటి నుంచి తల్లి దగ్గరే ఉంటున్నాడు. విజయ మేడిపల్లికి వచ్చి కూలీ పని చేసుకుంటూ కొడుక్కి ఏ లోటూ రానివ్వకుండా పెంచింది. కష్టపడి టెన్త్​వరకూ చదివించింది. అక్కడితోనే చదువు ఆపేసి పెయింటర్​గా పని చేస్తున్నాడు. ఒక్కడే కావడంతో గారాబంగా చూసుకుంది. శివకు కూడా తల్లితో చనువు ఎక్కువ. ఏ విషయమైనా ఆమెతో షేర్​చేసుకునేవాడు. తాను సంపాదిస్తున్నానని, తల్లిని కష్టపడింది చాలని, కూలీకి వెళ్లొద్దని బలవంతం చేసేవాడు. కానీ ‘నీ పెండ్లి చేసిన తర్వాత బంద్​చేస్తాలేరా’ అని సమాధానమిచ్చేది. అంతా బాగుంటుందనుకుంటున్న తరుణంలో ఈనెల 16న విజయ నీళ్లు పట్టడానికి కరెంట్ ​మోటారుకు కనెక్షన్​ ఇస్తూ షాక్​కొట్టి అక్కడికక్కడే చనిపోయింది. దీంతో శివ కలత చెందాడు. అప్పటి నుంచి ‘అమ్మా..నువ్వు లేని ఈ లోకం ఎందుకమ్మా. నేను నీ దగ్గరికే వస్తా. ఎవరూ లేని అనాథగా బతకలేను. ప్రతిక్షణం నువ్వే గుర్తొస్తున్నావ్​’  అంటూ ఏడుస్తున్నాడు. మేనమామతో పాటు బంధువులు ఎంతో ఓదార్చారు. కానీ అతడు ఆ తల్లినే తల్చుకుంటూ డిప్రెషన్​లోకి వెళ్లిపోయాడు. దీంతో కొన్నిరోజులుగా అతడిని అబ్జర్వ్​ చేస్తూనే విజయ కర్మకాండకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఆదివారం కార్యక్రమం చేద్దామని అనుకుంటుండగా శుక్రవారం అర్ధరాత్రి టిన్నర్ (పెయింట్​లో కలిపే కెమికల్​) పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు. మేన మామ గంగాచారి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

షేక్ హ్యాండ్ ఇస్తే ఒర్రుతది..గోదావరి ఖని స్టూడెంట్ తయారీ

Latest Updates