కన్నతండ్రిని కొట్టి చంపిండు

సిద్దిపేట రూరల్, వెలుగు: కన్నకొడుకే తండ్రిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన సిద్దిపేట పట్టణంలో కలకలం రేపింది. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాలు వన్ టౌన్ ఎస్సై రాజేశ్‌‌కథనం ప్రకారం..  చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామానికి చెందిన కావటి ఎల్లయ్య(55) చాలా సంవత్సరాల క్రితం కుటుంబంతో సహా సిద్దిపేటకు వచ్చి పట్టణంలోని భారత్ నగర్‌‌‌‌లో స్క్రాప్ వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు. కాగా అతడికి రెండు వివాహాలు జరుగగా, రెండో భార్య కుమారుడు ప్రసాద్ తో ఆస్తి విషయంలో తరచుగా గొడవలు జరిగేవి.  ఈ క్రమంలో ఎల్లయ్య పట్టణంలోని నాసరపురకు మకాం మార్చాడు. గురువారం రాత్రి ప్రసాద్ ను కలవడానికి ఎల్లయ్య భారత్ నగర్ నివాసానికి రాగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాట మాట పెరిగి కొట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రసాద్ తన తండ్రిని బండ రాళ్లతో అతి కిరాతకంగా కొట్టి చంపేశాడు. శుక్రవారం ఉదయం హత్య జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య కావటి కనకవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అంతకుముందు హత్య విషయాన్ని తెలుసుకున్న ఏసీపీ రామేశ్వర్ ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

Latest Updates