స్టీవ్ జాబ్స్ మెచ్చనిది..యాపిల్ మెచ్చినది

ఆ ఫీచర్​ అప్పటి యాపిల్​ సీఈవో స్టీవ్​ జాబ్స్​కు నచ్చలేదు. ‘యాక్​.. ఆ ఫీచర్​ ఎవరికి కావాలి? దాన్ని పెట్టాలి, తీయాలి, చివరకు పడేయాలి. ఎవరికి అది అవసరం లేదు’ అంటూ కొన్నేళ్ల క్రితం ఆయన ఛీ కొట్టారు. కానీ, అప్పుడు ఆయన మెచ్చని ఆ ఫీచర్‌‌నే  యాపిల్​ ఇప్పుడు మెచ్చింది.  ఇంతకీ, ఆ ఫీచర్​ ఏంది? అంటే.. ‘స్టైలస్​’! అవును, కొన్ని ఫోన్లకు దాంతో ఓ స్టిక్​ వస్తుంది తెలుసు కదా. వేలితో కాకుండా,  ఫోన్​ లేదా ట్యాబ్​ స్క్రీన్​పై రాసేందుకు, టైప్​ చేసేందుకు వాడే ఆ స్టిక్​నే స్టైలస్​ అంటారు. దాన్నే ఇప్పుడు యాపిల్​ తీసుకొస్తోందని తెలుస్తోంది. సెప్టెంబర్​లో కంపెనీ కొత్త ఫోన్లు ఐఫోన్​ 11, ఐఫోన్​ 11 ప్రో, ఐఫోన్​ 11 మ్యాక్స్​ ప్రోలను రిలీజ్​ చేయబోతోంది. ఆ కొత్త ఫోన్లలోనే ఈ ఫీచర్​ను పెడుతున్నట్టు సమాచారం. కాకపోతే దానికి స్టైలస్​ అని కాకుండా ‘యాపిల్​ పెన్సిల్​’ అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ఐఫోన్లకు స్పెషల్​గా కేసులను (ప్రొటెక్షన్​ కవర్​) తయారు చేసే ఓలిగ్జర్​ అనే కంపెనీ 2019కి సంబంధించి తాను లిస్ట్​ చేసిన ఐఫోన్​ కేసుల జాబితాలో ఈ కొత్త ఫీచర్‌‌ను వెల్లడించింది.  దాని ప్రకారం కొత్త ఐఫోన్లోనే యాపిల్​ పెన్సిల్​కు ఇన్​బిల్ట్​ స్లాట్​ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే ఐప్యాడ్​ మోడల్స్​లో ఈ పెన్సిల్​ను పెట్టినా ఫోన్లలో పెట్టడం ఇదే తొలిసారి.  ‘‘ప్రీమియం లెదర్​తో చేసిన ఈ ఐఫోన్​ 11 ప్రో కేసు చాలా స్టైలిష్​గా ఉంటుంది. స్లిమ్​గా ఉండడంతో పాటు యాపిల్​ పెన్సిల్​ స్లాట్​కు తగ్గట్టు కేసును తయారు చేశాం” అంటూ ఆలిగ్జర్​ తన వెబ్​సైట్​లో స్టైలస్​తో ఐఫోన్​ వస్తోందని చెప్పకనే చెప్పింది. కాబట్టి స్టీవ్​ జాబ్స్​ వద్దన్న ఆ స్టైలస్​ ఇప్పుడు సెప్టెంబర్​లో విడుదలయ్యే ఐఫోన్​ 11 ప్రో, ఐఫోన్​ 11 మ్యాక్స్​ ప్రో  ఫోన్లలో కనిపించబోతోందన్నమాట!!

 

Latest Updates