ఈసారి రాష్ట్ర బడ్జెట్​ లక్షన్నర కోట్లు!

హైదరాబాద్, వెలుగు:కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి వచ్చే నిధులపై స్పష్టత రావటంతో రాష్ట్ర బడ్జెట్​కు కసరత్తు వేగవంతమైంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి  రూ. లక్షా 50  వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో రెండు రోజులుగా బడ్జెట్ తయారీపై సమీక్షలు జరుపుతున్నారు. ఆర్థిక, రెవెన్యూ శాఖ ఆఫీసర్లతోపాటు సీఎంవో ఆఫీసర్లు ఈ సమీక్షలో పాల్గొంటున్నారు. శాఖల వారీగా కేంద్రం నుంచి వచ్చే నిధులపై లెక్కలు తీస్తున్నారు. ఈసారి కూడా వాస్తవిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాలని సీఎం భావిస్తున్నట్టు ఆఫీసర్లు చెపుతున్నారు. బడ్జెట్ లో అధిక కేటాయింపులు చేసి అబాసుపాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు నిధుల కొరత లేకుండా చూడాలని చెప్పినట్లు సమాచారం. ఆసరా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లాంటి పథకాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆయన ఆదేశించినట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెప్పాయి. అయితే రైతు బంధు పథకం అమలు కోసం నిధుల కొరత వచ్చే ప్రమాదం ఉందని అంటున్నాయి.

భూముల అమ్మకంపై ఆశలు

2020–-21 బడ్జెట్ లో భూముల అమ్మకాలతో సుమారు రూ. 10 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. 2019-–20 బడ్జెట్ లో కూడా భూములను అమ్మితే రూ. పది వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. కానీ ఆ భూములపై కోర్టుల్లో కేసులు ఉండటంతో వాయిదా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం కచ్చితంగా భూములను అమ్మాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ శివారులోని కోకాపేట సమీపంలో సుమారు 100 ఎకరాల భూమి ఉంది. దాన్ని అమ్మితే సుమారు రూ. 10 వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

రెవెన్యూ వసూళ్లు  రూ. లక్షా 30వేల కోట్లు

2019–-20 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వసూళ్లు రూ. లక్షా 30 వేల కోట్లకు చేరవచ్చని అధికారుల అంచనా.  డిసెంబర్ చివరి నాటికి రెవెన్యూ వసూళ్లు రూ. 71187.09 కోట్లు వచ్చాయి. మిగతా మూడు నెలలకు కలిపి రూ. 35  నుంచి 40 వేల కోట్లు వరకు రెవెన్యూ వసూళ్లు ఉండే  అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర నిధుల విడుదల్లో కోత విధించడం వల్ల ఆదాయం తగ్గిందని చెపుతున్నారు.

ఎన్నికల హామీలకు ఇబ్బందులు

ప్రధాన ఎన్నికల హామీలకు ఈసారి కూడా బడ్జెట్ లో నిధుల కొరత ఉండొచ్చని అధికారులు చెపుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ అమలు చేస్తామని టీఆర్​ఎస్​ హామీ ఇచ్చింది. రుణమాఫీ కోసం సుమారు రూ. 30వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని, దీన్ని నాలుగు విడతలుగా మాఫీ చేయాలని గతంలో నిర్ణయించారు. 2019–-20 బడ్జెట్ లో రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల కోట్లను కేటాయించారు. కానీ రైతు రుణమాఫీని అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి కోసం 2019–-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో రూ. 1,800 కోట్లు కేటాయించారు. కానీ పూర్తి స్థాయి బడ్జెట్ లో ఆ ఊసే ఎత్తలేదు. ఈసారి కూడా నిరుద్యోగ భృతి కోసం నిధుల కేటాయింపు లేకపోవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినరోజు సీఎం కేసీఆర్  నిరుదోగ భృతిపై మాట్లాడుతూ..  భృతి ఎవరికి ఇవ్వాలి, ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారనేది ఇంకా క్లారిటీ రాలేదని చెప్పారు. దీంతో ఆ పథకం అమలు చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Latest Updates