బీసీలను పట్టించుకోని సర్కారు..ఆగిపోతున్న స్కీమ్ లు

బీసీలను పట్టించుకోని సర్కారు..ఆగిపోతున్న స్కీమ్ లు
  • ఆగమైతున్న బీసీ సంక్షేమ శాఖ 
  • బడ్జెట్​లో  నిధులు నామ్కేవాస్తే
  • వేలల్లో కల్యాణలక్ష్మి అప్లికేషన్లు పెండింగ్​
  • గురుకులాలు, హాస్టళ్లలో సౌలతుల్లేవ్​

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖను గాలికొదిలేసింది. డిపార్ట్‌‌మెంట్‌‌లో కార్యక్రమాలు, పథకాలను పట్టించుకోవడంలేదు. అసలు రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ ఉందా..? లేదా అన్నట్లుగా దిక్కుమొక్కు లేకుండా తయారైంది. పథకాలకు ప్రభుత్వం నిధులు రిలీజ్‌‌ చేయడంలేదు. ఒక్క స్కీమ్​ కూడా సక్కగ అమలైతలేదు. కల్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్​మెంట్, ఓవర్సీస్ స్కాలర్‌‌షిప్స్.. ఇట్లా పథకాలన్నీ పెండింగులోనే మూలుగుతున్నాయి. నిరుద్యోగ యువతకు లోన్లు పత్తాలేవు. గురుకులాలు, హాస్టళ్లు అస్తవ్యస్తంగా మారాయి. పలు విభాగాలకు హెచ్‌‌వోడీలే కరువయ్యారు. 

రీయింబర్స్​ మెంట్​ కోసం ఎదురుచూపులు

రెండు విద్యా సంవత్సరాలు గడిచిపోయినా బీసీ స్టూడెంట్స్‌‌కు స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్​ డబ్బులను ప్రభుత్వం చెల్లించడం లేదు. సుమారు రూ. 3,100 కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. ఇందులో సగం బీసీ సంక్షేమ శాఖవే ఉన్నాయి. నిధులు విడుదల చేయకపోవడంతో దాదాపు లక్షల మంది స్టూడెంట్స్‌‌‌‌ ఎదురుచూస్తున్నారు. కాలేజీ మేనేజ్‌‌‌‌మెంట్లు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పేరెంట్స్‌‌‌‌ బయట వడ్డీలకు తెచ్చి ఫీజులు కడుతున్నారు. తెచ్చిన అప్పులకు రోజురోజుకు వడ్డీలు మాత్రం పెరిగిపోతున్నాయి. మరో వైపు ఓవర్సీస్‌‌‌‌ స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌లకు కూడా సకాలంలో ఇవ్వడంలేదు. 

ఏడాదిన్నరగా కల్యాణలక్ష్మి రాదాయె..!

రాష్ట్రంలో ఏడాదిన్నరగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌ చెక్కులు ఇవ్వడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మందికి పైగా వీటి కోసం ఎదురుచూస్తున్నారు. నిధులు లేకపోవడంతోనే లేట్‌‌‌‌ అవుతోందని ఆఫీసర్లు అంటున్నారు. దీంతో ఆడబిడ్డ పెండ్లికి పేరెంట్స్‌‌‌‌ అప్పులు చేయాల్సి వస్తున్నది. కల్యాణ లక్ష్మి పైసలు వస్తే ఆ అప్పు తీర్చుకోవచ్చని భావిస్తే.. ఎంతకూ విడుదల కావడం లేదు. దీంతో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. మరోవైపు కొర్రీలు పెడుతూ అప్లికేషన్లను ఆఫీసర్లు రిజెక్ట్‌‌‌‌ చేస్తున్నారు.

గురుకులాలు, హాస్టళ్లను పట్టించుకునే దిక్కు లేదు

రాష్ట్రంలోని బీసీ గురుకులాలు, హాస్టళ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దాదాపు అన్ని కూడా కిరాయి భవనాల్లోనే అరకొర వసతులతో నెట్టుకొస్తున్నాయి. ప్రభుత్వం కనీసం కాస్మొటిక్‌‌‌‌ చార్జీలు కూడా ఇవ్వడంలేదు. చలికాలం చలికి వణుకుతున్నా దుప్పట్లు పత్తాలేవు. పిల్లలు చన్నీళ్ల స్నానమే చేయాల్సి వస్తోంది. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో క్వాలిటీ ఫుడ్‌‌‌‌ అందడం లేదు. అనేక హాస్టళ్లలో మరుగుదొడ్లు లేవు. నీటి సమస్య వెంటాడుతున్నది. 

ఆత్మగౌరవ భవనాలు ముందుకు పడ్తలే

హైదరాబాద్‌‌‌‌ పరిసర ప్రాంతాల్లో 46 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రకటించారు. 73 ఎకరాల భూమి, రూ. 53 కోట్లు కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ మూడేండ్లు దాటినా ఇంకా ఒక్క భవనం కూడా పూర్తి కాలేదు. ఇటీవల కూల్చిన సెక్రటేరియట్‌‌‌‌ స్థానంలో కొత్త బిల్డింగుల పనులు మాత్రం చకచకా సాగిపోతున్నాయి. అదే.. ఆత్మ గౌరవ భవనాల నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. 

కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు పైసా ఇస్తలే

బీసీల్లో వివిధ కులాలకు సంబంధించి రజక, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, కృష్ణ బలిజ పూసల, వాల్మీకి, భట్రాజు, మేదర, విశ్వబ్రాహ్మణ, కుమారి శాలివాహన,  గీత పనివారలు, సగర(ఉప్పర) ఫెడరేషన్లు ఉన్నాయి. ఆయా ఫెడరేషన్ల నుంచి లోన్లు ఇవ్వడం, కులవృత్తులపై శిక్షణ, సబ్సిడీ కింద వివిధ మిషన్లు తదితర కార్యక్రమాలు చేపట్టాలి. కానీ ప్రభుత్వం బడ్జెట్‌‌‌‌లో మూడేండ్ల నుంచి ఒక్క రూపాయి కూడా అలకేట్‌‌‌‌ చేయడంలేదు. దీంతో ఫెడరేషన్లు ఖాళీగా ఉంటున్నాయి.  ఫెడరేషన్లకు పాలకమండళ్లను కూడా నియమించలేదు. 

ఏడేండ్లలో రెండు సార్లే లోన్లు..!

బీసీ కార్పొరేషన్‌‌, ఎంబీసీ కార్పొరేషన్‌‌ ద్వారా బీసీ యువతకు లోన్లు ఇవ్వాలి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీసీ కార్పొరేషన్‌‌ ద్వారా రెండు సార్లు మాత్రమే లోన్లు ఇచ్చారు. 2015లో ఒకసారి, 2018లో మరోసారి అందజేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు లోన్లకు అప్లికేషన్లు ఆహ్వానించడంతో 5.70 లక్షల మంది అప్లయ్​ చేసుకున్నారు. అప్పుడు ఎలక్షన్‌‌ ఇయర్‌‌ కావడంతో 50 వేల మందికి లోన్లు ఇచ్చారు. అయితే ఎన్నికలు అయిపోగానే అప్లికేషన్లను పక్కన పడేశారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా లోన్ల ఊసేలేదు. లోన్లకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ అధికారులు యాక్షన్‌‌ ప్లాన్‌‌ రూపొందిస్తున్నా.. సర్కారు మాత్రం అప్రూవ్ చేయడం లేదు. ఎంబీసీ కార్పొరేషన్‌‌ ఏర్పాటు చేసినా అదీ ఉత్తగనే ఉంది. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు కొత్త  చైర్మన్లను 
నియమించడం లేదు. 

బీసీలను బిచ్చగాళ్లను చేస్తున్రు..

రాష్ట్రంలో బీసీలను సర్కారు పట్టించుకోవడం లేదు. నిధులు రిలీజ్‌‌‌‌ చేస్తలేదు. కొత్త స్కీంలు దేవుడెరుగు. ఉన్న పథకాలను కూడా అమలు చేయడంలేదు. బీసీలను బిచ్చగాళ్లను చేస్తున్నరు. బీసీ కార్పొరేషన్‌‌‌‌, ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌, ఫెడరేషన్లు ఖాళీగా ఉంటున్నాయి. 
- ఆర్‌‌‌‌.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ప్రెసిడెంట్

ఎలాంటి అప్ డేట్ లేదు

2016 లో జనరల్ స్టోర్  పెట్టుకునేందుకు రూ. 2 లక్షల బీసీ కార్పొరేషన్ లోన్‌‌కు అప్లికేషన్ పెట్టుకున్న. సర్టిఫికెట్ వెరిఫికేషన్,  ఇంటర్వ్యూ అయిపోయింది. ఇప్పటివరకు దానిపై ఎటువంటి అప్​డేట్​ లేదు.
- కొలపాక జగదీశ్, గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా 

ఇచ్చుడే లేదు

టెంట్ హౌస్ ఏర్పాటుకు బీసీ కార్పొరేషన్ కింద లోన్ కోసం 2016- –17 లో అప్లయ్​చేసుకున్న. రెండు లక్షల లోన్ కోసం అప్లయ్​ చేసుకుంటే .. ఆ సంవత్సరం 50 వేల లోపు వాళ్లకు లోన్లు ఇచ్చిన్రు. ఇప్పటివరకు లోన్​ రాలేదు. 
- జక్కుల వెంకటరమణ, ఖమ్మం

ఫాయిదా లేకుండాపోయింది

నేను టూవీలర్ మెకానిక్‌గా 22 ఏండ్ల నుంచి పని చేస్తున్న. షాప్  డెవలప్​ చేసుకునేందుకు ఐదేండ్ల కింద బీసీ కార్పొరేషన్ లో రూ. 2 లక్షల లోన్ కోసం అప్లయ్​ చేసిన. లోన్ మంజూరు కోసం ఆఫీసులు, లీడర్ల చుట్టూ తిరిగినా ఫాయిదా లేకపోవడంతో చాలించుకున్న. 
- సామల శ్రీనివాస్, మెకానిక్ చొప్పదండి మండలం, కరీంనగర్ జిల్లా
 

సమాధానం చెప్తలేరు

జిరాక్స్ సెంటర్ పెట్టుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ. 2 లక్షల లోన్ కోసం 2015–16 లో అప్లయ్​ చేసుకున్న. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సమాధానం చెప్తలేరు. ఏండ్లు  దాటుతున్నా లోన్​ మాత్రం మంజూరు చేస్తలేరు.
- పి.వనిత రాణి, ఖమ్మం