ఇంట్లో పై అంతస్తు నుండి దుర్వాసన.. వెళ్లి చూస్తే కొడుకు మృతదేహం

ఐదు రోజుల కిందటే కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

పబ్జి గేమ్ కు బానిసగా మారి..  బీటెక్ విద్యార్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మహత్య

అనంతపురం:  మొబైల్ ఫోన్ లో .. టీవీలో.. ల్యాప్ ట్యాప్ లో.. ఎప్పుడు చూసినా పబ్ జి గేమ్ లు ఆడుతూ.. వాటికే బానిసగా మారిన ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం  పట్టణంలోని రెవెన్యూ కాలనీలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదు రోజుల క్రితం బీటెక్ చదువుతున్న కన్న కొడుకు కనిపించం లేదని తల్లిదండ్రులు నరసింహారెడ్డి, హిమాజారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అయితే దుర్వాసన వస్తోందని ఇవాళ ఉదయం ఇంటిపై కడుతున్న కొత్త గది తలుపులు బద్దలు కొట్టించి చూస్తే..  ఉరేసుకుని చనిపోయిన కొడుకు శవం కనిపించింది.. మళ్లీ వస్తాడనుకున్న కొడుకును ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు.

చెన్నై లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కిరణ్ కుమార్ రెడ్డి కాలేజీలో చదువుకుంటున్న సమయంలోనే  పబ్ జి గేమ్ ఆడడడం అలవాటు చేసుకున్నాడు. అయితే  ప్రభుత్వం పబ్జి గేమ్ లను దేశం నుండే నిషేధించడంతో తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. ఒక్క రోజు గేమ్ ఆడకుండా ఉండలేకపోయేవాడు. ఏం చేయాలో పాలుపోక నిరంతరం మధనపడేవాడు. ఈ నెల 7న తమ ఇంటిపైన నిర్మాణంలో ఉన్న ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడు అదేరోజు రాత్రి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అందరికీ ఫోన్లు చేసి ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో ఉదయం తెల్లారిన తర్వాత  త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే నిన్న అనూహ్యంగా ఇంటి పైన నిర్మాణంలో వున్న ఓ గది నుంచి దుర్వాసన వస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల కూలీలను పిలిపించి  తలుపులు పగలగొట్టి చూడగా గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కుమారుడి మృతదేహం కనిపించింది. తల్లిదండ్రులు నరసింహారెడ్డి, హిమాజారాణి బోరున విలపించడం స్థానికులను విషాదంలో ముంచెత్తింది.

Latest Updates