ఎన్నిరోజులైనా పెడ్తమన్నరు..8 రోజులకే సాలించుకున్నరు

8 రోజులకే

  • రెండోసారి టీఆర్‌ఎస్‌ సర్కారువచ్చినంక సెషన్స్‌ జరిగింది 35 రోజులే
  • మార్చి బడ్జెట్‌ సమావేశాలూ 20 రోజులకు 8 రోజులే..
  • ఈసారీ కరోనా పేరుతో అసెంబ్లీ మధ్యల్నే ముగించిన్రు
  • బిల్లులన్నీ పాసయ్యాక ఇక పని లేదని క్లోజ్‌ చేశారంటున్న లీడర్లు

హైదరాబాద్, వెలుగు:ఎన్ని రోజులైనా సభ పెడ్తమన్నరు. దేశానికి రోల్‌‌ మోడల్‌‌గా ఉండేలా నిర్వహిద్దామన్నరు. ఏ అంశమైనా చర్చించేందుకు రెడీ కావాలని మంత్రులను సీఎం ఆదేశించిండు. కానీ అనుకున్న దాంట్లో సగం రోజులు కూడా జరగకుండానే సభను వాయిదా వేశారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందంటూ సమావేశాలను ముగించేశారు. ఇట్ల ఇప్పుడే కాదు. సెషన్స్‌‌పై మొదట్నుంచీ సర్కారు ఇట్లనే చేస్తూ వస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక తొలి బీఏసీలో యేటా 60 రోజులు సభ పెడ్తమన్నరు. కానీ ఇప్పటివరకు 30 రోజులకు మించి నడపలేదు. రెండోసారి టీఆర్‌‌ఎస్‌‌ అధికారంలోకి వచ్చాక 35 రోజులే సభ నడిచింది. ఈ మార్చిలో కూడా 20 రోజులు సభ నడిపిస్తమని 8 రోజులకే ముగించేశారు. ఇప్పుడూ ఇట్లనే అర్ధంతరంగా క్లోజ్‌‌ చేశారు.

అనుకున్న ఎజెండా పూర్తయిందనే..

నిజానికి ఈసారి అసెంబ్లీ సెషన్స్‌‌ను 20 రోజులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏఏ అంశాలను చర్చించాలో మంత్రులు, విప్‌‌లతో ప్రగతి భవన్‌‌లో సీఎం కేసీఆర్‌‌ మీటింగ్ పెట్టి మాట్లాడారు. ఎన్ని రోజులైనా సభ నిర్వహిద్దామని అప్పుడే ప్రకటించారు. కానీ కరోనా వేగంగా వ్యాపిస్తోందంటూ సభ్యులు ఆందోళన చెందుతున్నారని, అందుకే సమావేశాలు కుదిస్తున్నామని అటు మండలి చైర్మన్, ఇటు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు.సర్కారు అనుకున్న ఎజెండా పూర్తవగానే సమావేశాలను కుదించేందుకు సిద్ధమయ్యారని లీడర్లు చెప్తున్నారు. మొదటి నుంచీ అసెంబ్లీ సెషన్స్ పట్ల సీఎం అంతగా ఆసక్తి చూపరని అంటున్నారు. ప్రతి 6 నెలలకు ఓసారి సమావేశాలు నిర్వహించాలనే రాజ్యంగ నిబంధనల ప్రకారమే సెషన్స్ పెడుతున్నారని చెబుతున్నారు.

రెండ్రోజుల క్రితం నుంచే లీకులు

సెషన్స్ కుదిస్తున్నట్టు సోమవారం ప్రభుత్వం నుంచి లీకులొచ్చాయి. కరోనా కేసులు పెరుగుతున్నాయని స్పీకర్, చైర్మన్ ఆఫీసులకు రిపోర్టిచ్చారు. గత వారం అసెంబ్లీలో ఆమోదించిన రెవెన్యూ బిల్లును సోమవారం మండలిలో ఆమోదించారు. అదే రోజు 8 బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. దీంతో రెండు సభల్లో ప్రభుత్వం అనుకున్న బిజినెస్ పూర్తయింది. ఇక సమావేశాలను కొనసాగించాల్సిన అవసరం లేదని అర్ధంతరంగా వాయిదా వేసినట్టు ప్రచారం జరుగుతోంది.

సగం రోజులు కూడా నడవలే

ఈ నెల 7 నుంచి స్టార్టయిన సమావేశాలను 28 వరకు 18 రోజులు నిర్వహించాలని రెండు సభల బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు బిజినెస్‌‌ను రెడీ చేయాలని ఆఫీసర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆఫీసర్లు కూడా సర్కారు సూచించిన 26 అంశాలపై ఇన్ఫర్మేషన్‌‌ తీసుకొని రెడీగా పెట్టుకున్నారు. కానీ 8 పని దినాలకే కరోనా కారణంతో సెషన్స్‌‌ను కుదించడంపై వాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గ్రేటర్ ఎలక్షన్ కోసం ప్రత్యేక చర్చ

గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ చివరి రోజు ‘గ్రేటర్ హైదరాబాద్, ఇతర మున్సిపాలిటీల అభివృద్ది’పై షార్ట్ డిస్కషన్ నిర్వహించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ఏం చేశామో చెప్పుకునేందుకు టీఆర్ఎస్ పార్టీకి, ఓల్డ్ సిటీలోని సమస్యలను ప్రస్తావించామని చెప్పుకునేందుకు మజ్లిస్ పార్టీకి కలిసొచ్చింది. ఈ టైమ్‌‌లో పంజాగుట్టలో తొలగించిన అంబేడ్కర్ విగ్రహాన్ని మళ్లీ అక్కడే ఏర్పాటు చేస్తారా లేదా? అని భట్టి విక్రమార్క పదే పదే ప్రశ్నించినా మంత్రి కేటీఆర్ సరైన జవాబు చెప్పలేకపోయారు. మరిన్ని అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ కొరినా పట్టించుకోలేదు.

చాలా ప్రాబ్లమ్స్‌‌పై డిస్కషన్‌‌ జరగలె

అసెంబ్లీని సడన్‌‌గా వాయిదా వేయడంలో చాలా ప్రజా సమస్యలు చర్చకు రాలేదు. వర్షాల వల్ల పంట నష్టం, కృష్ణా నదిపై ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులు, జీఎస్టీ వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, సెక్రటేరియట్ నిర్మాణంపై అనుమానాలు, నిరద్యోగ సమస్య, మైనార్టీ, గిరిజన రిజర్వేషన్ల పెంపు, ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుతో పాటు ఊర్లల్లో విస్తరిస్తున్న మద్యం బెల్ట్ షాపులపై చర్చ జరగలేదు.

ముందు నుంచీ ఇదే తీరు

సమావేశాలను ఎన్ని రోజులైనా నిర్వహిస్తామని బీఏసీలో సీఎం కేసీఆర్ హమీ ఇవ్వడం, తాను అనుకున్న బిజినెస్ పూర్తవగానే సెషన్స్‌‌ వాయిదా వేయడం కొత్తేమీ కాదని ప్రతిపక్షాలు అంటున్నాయి. 2018 అసెంబ్లీ రద్దుకు ముందు నెల రోజులు సభ నిర్వహిస్తామని చెప్పి మధ్యలోనే వాయిదా వేశారని గుర్తు చేశాయి. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాలనూ కుదించారన్నాయి.

స్పెషల్‌‌ రూల్స్‌‌తో సంప్రదాయాలకు చెక్

కొత్త రాష్ట్రంలో అసెంబ్లీకి కొత్త రూల్స్ ఉండాలనే ఉద్దేశ్యంతో విపక్షాలు, సభ్యుల హక్కులను కాలరాశారని విమర్శలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సభ స్టార్టవగానే వాయిదా తీర్మానాలను స్పీకర్ చదివి వినిపించే వారు. వాటిని తిరస్కరిస్తే విపక్షాలు ఆందోళనకు దిగేవి.  తెలంగాణ సాధన కోసం నాడు టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకుంది. కానీ కొత్త రాష్ట్రంలో వాయిదా తీర్మాన సమయం మార్చారు. బడ్జెట్ డిమాండ్లపై చర్చించాల్సిన రోజులనూ తగ్గించారు.

మీడియాకు తాగేందుకు నీళ్లూ లేవు

కరోనా సాకుతో సెషన్స్‌‌కు మీడియాపై ఆంక్షలు పెట్టారు. లాబీల్లోకి అనుమతించలేదు. గ్యాలరీలోకి వెళ్లేందుకు ప్రతి సంస్థకు ఒక్కో పాస్‌‌నే జారీ చేశారు. మీడియా పాయింట్‌‌ను ఎత్తేశారు. దాన్ని కొనసాగించాలని బీఏసీలో అడిగితే అసెంబ్లీ కంటే ఎక్కువగా మీడియా పాయింట్ పైనే ఇంట్రస్ట్ ఉందని సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు భట్టి వివరించారు. అసెంబ్లీలో ఫొటోగ్రాఫర్, కెమరా పర్సన్స్‌‌పై ఆంక్షలు పెట్టడంతో చాలా ఇబ్బంది పడ్డారు. గన్‌‌ పార్క్ దగ్గర ఎండలో డ్యూటీలు చేశారు. కనీసం తాగేందుకు నీళ్లు ఏర్పాటు చేయాలన్నా సర్కారు స్పందించలేదు.

ప్రతిపక్షాలు సక్కగా ప్రశ్నిస్తలెవ్‌‌

ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలంటే జనానికి ఆసక్తి  ఉండేది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు రెడీగా ఉండేవి. ఏ తప్పు దొరికినా ఆధారాలు, లెక్కలతో పాటు నిలదీసేవి. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్షాల తీరు సరిగా లేదని విమర్శలున్నాయి. కరోనా విషయంలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైందని అంతటా చర్చించుకుంటున్నా సభలో కాంగ్రెస్ సరిగా ప్రశ్నించలేకపోయిందని అనుకుంటున్నారు. దళితులు, గిరిజనులకు మూడెకరాలు కొనసాగించలేమని సీఎం స్వయంగా చెప్పినా కాంగ్రెస్ నిలదీయలేకపోయిందని చర్చించుకుంటున్నారు.

గత నెల 17న అసెంబ్లీ సమావేశాలపై రివ్యూ చేస్తూ..

ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చ జరగడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి చట్ట సభలకు మించిన వేదిక లేదు. ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలి. దేశానికి ఆదర్శంగా ఉండేలా శాసనసభను నిర్వహించాలి. సభ్యులు అడిగే ప్రతి అంశానికి  ప్రభుత్వం వివరాలు చెపుతుంది.

ఏడాదికి 60 రోజులు సమావేశాలెక్కడ?

యేటా 60 రోజులు సమావేశాలను నిర్వహిస్తామని రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి బీఏసీ మీటింగ్‌‌లో సీఎం కేసీఆర్ హామీచ్చారు. కానీ ఇంతవరకు యేటా 30 రోజులకు మించి జరగట్లేదు. రెండోసారి టీఆర్ఎస్‌‌ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలు 35 రోజులే జరిగాయి. మార్చి 2019 జనవరిలో 4 రోజులు, ఫిబ్రవరిలో 4 రోజులు, జులై లో 2 రోజులు, సెప్టెంబరు లో 9 రోజులు నిర్వహించారు. 2020 మార్చిలో 8 రోజులు, ఇప్పుడు 8 రోజులు సభ జరిగింది.

 

Latest Updates