హైదరాబాద్, వెలుగు: విభజన చట్టాన్ని అతిక్రమించి గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్ సహా పలు కొత్త ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, వాటిని ఆపాలని తెలంగాణ సర్కారు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్‌పురేకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లెటర్ రాశారు. ఈ ప్రాజెక్టుల పనులు ఆపాలని కేసీఆర్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి గతంలోనే కంప్లైంట్ చేశారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా గండికోట సీబీఆర్ లిఫ్టులు, గండికోట నుంచి పైడిపాలెం లిఫ్టులు, కుందు నది విస్తరణ తదితర పనులకు రూ.4,039.97 కోట్లతో టెండర్లు పిలిచిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు సాగు, తాగునీరు, హైదరాబాద్ తాగునీటిపై ప్రభావం పడుతుందన్నారు. రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏ రాష్ట్రం కొత్త ప్రాజెక్టు చేపట్టినా అపెక్స్ కౌన్సిల్ అనుమతి,రివర్ బోర్డు, సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్ తప్పనిసరి అని గుర్తు చేశారు.
కృష్ణా బోర్డు వైజాగ్‌కు తరలించొద్దు
కృష్ణా బోర్డు హెడ్ ఆఫీసును ఏపీలోని వైజాగ్‌కు తరలించొద్దని తెలంగాణ తేల్చి చెప్పింది. బోర్డు హెడ్ ఆఫీసును వైజాగ్‌లో ఏర్పాటు చేయాలని ఏపీ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్‌పురేకు మంగళవారం లెటర్ రాశారు. 2018 జూన్‌లో బోర్డు హెడ్‌క్వార్టర్స్‌ను విజయవాడకు తరలిస్తామని ఏపీ ప్రతిపాదన పంపిందని లెటర్లో పేర్కొన్నారు. 2019 అక్టోబరు 9న కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలోనూ హైదరాబాద్ నుంచి విజయవాడకు బోర్డు తరలింపు ప్రతిపాదనపై చర్చ జరిగిందన్నారు. పోయిన ఏడాది జనవరి 20న నిర్వహించిన కృష్ణా బోర్డు 12వ మీటింగ్‌లోనూ విజయవాడకు తరలిస్తామనే ప్రతిపాదించారని తెలిపారు. గతంలో ఎప్పుడూ వైజాగ్‌కు బోర్డు తరలిస్తామని ఏపీ చెప్పలేదని, పోయినేడాది అక్టోబరు 6న నిర్వహించిన రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ఏపీకి బోర్డు తరలింపుపై మాత్రమే చర్చ జరిగింది తప్ప, వైజాగ్‌కు తరలించాలని కాదని తెలిపారు. బోర్డు సమావేశాలకు హాజరయ్యే ఇంజనీర్లకు ఫ్లైట్ ట్రావెల్‌కు పర్మిషన్ ఉండదని, ట్రైన్లో ట్రావెలింగ్కు ఎక్కువ టైం పడుతుందని తెలిపారు. బోర్డు తరలింపు విషయంలో తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
తాగునీటికి 8 టీఎంసీలు ఇవ్వండి : తమిళనాడు
చెన్నై తాగునీటి కమిటీ నుంచి తమను తొలగించాలని కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణా బోర్డును కోరాయి. కేఆర్ఎంబీ చైర్మన్ పరమేశం అధ్యక్షతన చెన్నై వాటర్ సప్లయ్‌పై మీటింగ్ నిర్వహించారు. వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జరిగిన ఈ మీటింగ్‌లో తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు సహా ఏపీకి చెందిన ఇరిగేషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు. చెన్నై తాగునీటికి తమ రాష్ట్రాల వాటాగా 5 టీఎంసీల చొప్పున వాటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని కర్నాటక, మహారాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీలు తెలిపారు. తమను కమిటీ నుంచి తొలగించాలని ఇప్పటికే రిక్వెస్ట్ పంపించామని కర్నాటక రాష్ట్రానికి చెందిన సెక్రటరీ, త్వరలోనే ప్రపోజల్స్ పంపిస్తామని మహారాష్ట్ర సెక్రటరీ చైర్మన్‌కు చెప్పారు. ఇప్పటివరకు 6.95 టీఎంసీల నీరు తమకు అందాయని, శ్రీశైలం, సోమశిల రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు ఉన్నందున మిగిలిన 8.05 టీఎంసీల నీటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని తమిళనాడు ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వాటా నీరు ఇవ్వడానికి ఇంటర్ స్టేట్ ఎస్ఈ కోటేశ్వర్ అనుమతించగా.. తమ వెసులుబాటు చూసుకుని చెన్నైకి వాటర్ రిలీజ్ చేస్తామని ఏపీ తరఫున హాజరైన కర్నూలు ప్రాజెక్టుల సీఈ మురళీనాధ్ రెడ్డి చెప్పారు.