పోతిరెడ్డి పాడుతో పెద్ద గండి పెడ్తున్నా..పాలమూరును పట్టించుకుంటలే

మొదట ఒక టీఎంసీ ఎత్తిపోస్తామంటున్న సర్కారు
తర్వాత రెండో టీఎంసీ పనులు చేయడం సాధ్యం కాదంటున్న ఇంజనీర్లు
లోన్ లింకేజీ ఉన్నా ఎందుకీ నిర్లక్ష్యమనే ప్రశ్నలు
దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం తప్పదని హెచ్చరికలు

ఏపీ శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద గండిపెట్టిరోజుకు ఏడెనిమిది టీఎంసీల నీళ్లు మళ్లించుకునేందుకు కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నా.. తెలంగాణ సర్కారు మాత్రం పాలమూరు– రంగారెడ్డి కెపాసిటీని ఒక్క టీఎంసీకి తగ్గిస్తోంది. ఇప్పుడే కాదు శాశ్వతంగా పాలమూరు కెపాసిటీని ఒక్క టీఎంసీకే పరిమితం చేసే యోచన ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కృష్ణా జలాల్లో ఒక్క చుక్క నీళ్ల‌నూ వదులుకోబోమని, తొలి అపెక్స్ మీటింగ్ లో కొట్లాడి సాధించుకున్న హక్కులను నిలబెట్టుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటనలు చేస్తున్నా..జరుగుతున్నది మాత్రం వేరేగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. రోజు రోజుకు పాలమూరు ప్రాజెక్టుపై ఆశలు సన్నగిల్లేలా సర్కారే ప్లాన్ చేస్తోందని.. లోన్ లింకేజీ ఉన్నా కావాలనే ప్రాజెక్టు పనులు జాప్యం
చేస్తూ మొత్తం ప్రాజెక్టు ఊపిరినే తీసేయాలని చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సీఎం టూర్ తర్వాత నుంచి..

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రారంభించిన మొదటి ప్రాజెక్టు పాలమూరు– రంగారెడ్డిని మొదటి నుంచి సర్కారు నిర్ల‌క్ష్యం చేస్తూనే ఉంది. ఏండ్లుగా ప్రాజెక్టు పనులను పొడిగిస్తూ, ఎప్పటికి పూర్తి చేస్తారో కూడా తెలియడం లేదు. నిరుడు ఆగస్టులో సీఎం కేసీఆర్ పాలమూరు పనుల ఫీల్డ్ విజిట్ కు వెళ్లినప్పుడు ప్రాజెక్టును రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి కుదిస్తున్నట్టుగా లీకులు వచ్చాయి. తన టూర్ లో సీఎం కూడా ఆ విషయం చెప్పారు. మొదట ఒక టీఎంసీ పనులు చేసి ఆ తర్వాత రెండో టీఎంసీ పనులు చేపడతామని అన్నారు. అయితే సీఎంటూర్ తర్వాత ‘పాలమూరు’కు గ్రహణం పట్టింది . రెండో టీఎంసీ పనులకు పూర్తిగా పుల్ స్టాప్ పెట్టి ఒకవైపు టన్నెల్, ఒక టీఎంసీ ఎత్తిపోసేలా పంపు హౌసుల్లో పనులు చేస్తున్నారు. ఫస్ట్ పంపుహౌస్ ఎల్లూర్ ను అండర్ గ్రౌండ్ గా చేపట్టగా తర్వాత ఓపెన్ అంటూ మళ్లీ సర్వే చేశారు. చివరికి అండర్ గ్రౌండేనని మళ్లీ పనులు చేస్తున్నారు. ఫస్ట్ రిజర్వాయర్ నారపూ్ల ర్ తోనూ అధికారులు, ఇంజనీర్లు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. రిజర్వాయర్ కెపాసిటీని 40 శాతం వరకు తగ్గించేందుకు ప్రయత్నించి చివరికి వెనక్కి తగ్గారు. ఈ పరిణామాలన్నీ సీఎం ఫీల్డ్ విజిట్ తర్వాతే జరిగాయంటే.. వాటికి ఆయన ఆమోదం ఉందనే చర్చ జరుగుతోంది.

బ్లాస్టింగ్ లతో చేసిన పనులు దెబ్బతింటయ్

పాలమూరు ప్రాజెక్టులో భాగంగా రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో120 టీఎంసీలను ఎత్తిపోయాలని తొలి ప్లాన్ వేశారు. ఇందుకోసం ఓపెన్ చానల్స్, ట్విన్ టన్నెల్స్ నిర్మిస్తున్నారు. రెండు టన్నెళ్ల మధ్య దూరం 40 మీటర్లుగా ఉంది. కాల్వలు, టన్నెళ్ల పని చేస్తున్న ప్రాంతాల్లో భూమి మొత్తం రాళ్ల‌తో కూడి ఉండటంతో బ్లాస్టింగ్ చేయక తప్పదు. అంతకు ముందు రెండు టీఎంసీల కోసమంటూ రెండు టన్నెళ్ల తవ్వకం పనులు సమాంతరంగా చేసిన వర్క్ ఏజెన్సీలు..ఇప్పుడు ఒకవైపు టన్నెల్ పనులు పూర్తిగా బంద్ చేసి, ఒక టన్నెల్ తవ్వకమే కొనసాగిస్తున్నారు. ఇట్లా ఒక టన్నెల్ కంప్లీట్ చేసి రెండో టన్నెల్ పనులు మొదలుపెడితే బ్లాస్టింగ్ లతో మొదటి టన్నెల్ దెబ్బతింటుందని సీనియర్ ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు.

పంపుహౌస్ ల్లో పనులే చేయలేరు

పంపుహౌజుల్లో పక్కపక్కనే మోటార్లు, పంపులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పంపులకు సర్జ్ పూల్ లోని డ్రాఫ్ట్ ట్యూబ్ ల ద్వారా నీళ్లు చేరుతాయి. వాటిని మోటార్లు డెలివరీ సిస్టర్న్ ద్వారా ఎత్తిపోస్తాయి. ఎక్కడ లిఫ్ట్ స్కీం చేపట్టినా టార్గెట్ కన్నా కనీసం ఒకటి, రెండు పంపులు ఎక్కువ పెట్టుకునేలా ఎర్త్, కాంక్రీట్ వర్క్ కంప్లీట్ చేసి పెడతారు. అవసరమనుకుంటే ఆ మేరకు మోటార్లు బిగించుకుంటారు. పాలమూరులో రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ఒక్కో పంపుహౌస్ లో ఎనిమిది నుంచి తొమ్మిది మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. సీఎం నిర్ణ‌యం తర్వాత పంపుహౌస్ లలో మోటార్ల ఏర్పాటుకు సంబంధించిన ఎర్త్, కాంక్రీట్ పనులను ఒక్క టీఎంసీకే కుదించారు. మొదట ఒక్క టీఎంసీని ఎత్తిపోసే ఏర్పాట్లు చేశాక, రెండో టీఎంసీకి పనులు చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. కానీ అది ప్రాక్టిక‌ల్ గా సాధ్యం కాదని ఇంజనీర్లు చెప్తున్నారు. ప్లెయిన్ సాయిల్స్ ఉన్న కాళేశ్వరం పంపు హౌజుల్లో ఒకేసారి మూడో టీఎంసీకి ఎర్త్, కాంక్రీట్ పనులు చేసి.. రాక్ సాయిల్ ఉన్న పాలమూరులో మాత్రం తర్వాత చేస్తమనుడేందని, ఇది మొత్తం ప్రాజెక్టునే ఒక టీఎంసీకి కుదించడమేనని అంటున్నారు. పాలమూరు ఫస్ట్ పంపుహౌస్ కోసం చేస్తున్నబ్లాస్టింగ్ లతో కల్వకుర్తి పంపు హౌస్ దెబ్బతింటుందని ఆ ప్రాజెక్టు ఇంజనీర్లు ఆరోపించారు. కోర్ డ్రిల్లింగ్ పేరుతో ఆ పంపుహౌస్ కు ముప్పేమీ లేదని ప్రభుత్వం ఇప్పటికే చెప్పినా..వందల మీటర్ల దూరంలో ఉన్న పంపుహౌస్ లోనే పగుళ్లు వస్తున్నాయంటే.. పక్కనే ఉన్న మోటార్లు, దానికి దిగువన ఉన్నసర్జ్ పూల్ ఎలా నిలుస్తాయని ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates