వీఆర్వోలను ఇతర శాఖల్లో కలిపితే ఊరుకోం

  • మ్యుటేషన్ చేసే​ అధికారం లేనప్పుడు ఎలా అవినీతికి పాల్పడుతం
  • ఏ పెద్దాఫీసరు తప్పు చేసినా మాపై వేటేస్తున్నరు
  • వీఆర్వోలతో చర్చించాకే కొత్త చట్టం తేవాలి
  • అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్​

హైదరాబాద్, వెలుగుకొత్త రెవెన్యూ చట్టం పేరిట వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ వీఆర్వోస్​ అసోసియేషన్​ హెచ్చరించింది. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో వీఆర్​ఓలను కూడా భాగస్వాములను చేయాలని డిమాండ్​ చేసింది. హైదరాబాద్​లోని లక్డీకపూల్​లో వీఆర్వోస్​ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్​ మీడియాతో మాట్లాడారు. వీఆర్​ఓలు ప్రతి రైతుకు పాసుబుక్కులు అందేలా చూశారని, రైతు బంధును సక్సెస్​ చేశారని అన్నారు. తమ సేవలను పూర్తిస్థాయిలో వాడుకున్న ప్రభుత్వం ఇప్పుడు వీఆర్​ఓ వ్యవస్థనే రద్దు చేస్తామనడం ఏంటని ప్రశ్నించారు. మ్యుటేషన్ చేసే అధికారంగానీ, పాస్​ బుక్కులు ఇచ్చే పవర్​గానీ లేనప్పుడు అవినీతికి ఎలా పాల్పడుతామన్నారు. తక్కువ శాలరీలతో ప్రజలకు సేవ చేస్తున్న తమపై అవినీతి ముద్ర వేయడం సరికాదన్నారు. లంచం తీసుకున్న అధికారి పైరవీ ద్వారా మళ్లీ వచ్చి మాపై పెత్తనం చేస్తున్నాడని, అధికారులు అవినీతికి పాల్పడితే తమపై వేటు వేస్తున్నారని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో అవినీతి లేని శాఖ ఏదైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకరిద్దరు అవినీతికి పాల్పడితే అందరికీ శిక్ష వేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి అంతానికి మేం కూడా చేయికలుపుతామని, అవినీతిపరుల ఆటకట్టించేలా కఠిన చట్టం తేవాలని కోరారు. అన్నివర్గాలతోపాటు వీఆర్​ఓల అభిప్రాయాలు తీసుకున్నాకే  కొత్త రెవెన్యూ చట్టాన్ని తేవాలన్నారు. రాష్ట్రంలో సమగ్ర భూసర్వే చేపట్టాలని, ప్రతీ రైతు భూమికి సర్వే నంబర్ ఇవ్వాలని సూచించారు. మీటింగ్​లో వీఆర్​ఓల అసోసియేషన్​ నాయకులు కాందారి భిక్షపతి, రాజేష్, ఎస్​కే మౌలానా, రామేశ్వర్​రావు పాల్గొన్నారు.

Latest Updates