నీట మునిగిన పత్తి చేను..ప్రాణం తీసుకున్న కౌలు రైతు

చెన్నూర్, వెలుగు: ప్రాణహిత వరదల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు నీటమునగడంతో ఎంతో మంది రైతులకు కడుపుకోత మిగిలింది. పత్తిచేన్లు నల్లబారి లక్షల పెట్టుబడులు మట్టిపాలయ్యాయి. కౌలు రైతులకు నష్టపరిహారం వచ్చే ఆశ కూడా లేక అప్పులను తలచుకుని కుంగిపోతున్నారు.  మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్ లో పదెకరాల్లో పత్తిచేను పూర్తిగా నల్లబారిపోవడంతో దిగులు చెందిన ఓ రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పుల్లగాం గ్రామానికి చెందిన కామ లింగయ్య (60) కౌలురైతు. పది ఎకరాలు కౌలుకు తీసుకుని, రూ.లక్షకు పైగా కౌలు చెల్లించాడు. పెట్టుబడి కోసం రూ.లక్ష అప్పు చేశాడు. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న టైమ్‌‌‌‌లో ఆగస్టు ఆఖరులో ప్రాణహిత వరదలు పోటెత్తాయి. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్​వాటర్​ వల్ల ప్రాణహిత తీరంలోని వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. లింగయ్య పత్తి చేను పూర్తిగా దెబ్బతింది. సర్కారు కౌలు రైతులను గుర్తించకపోవడంతో పంట నష్టం సర్వేలో అగ్రికల్చర్​ఆఫీసర్లు పట్టాదారుల పేర్లను నమోదు చేస్తున్నారు. నష్టపరిహారం వస్తుందన్న ఆశ కూడా  లేకపోవడంతో ఆవేదనతో లింగయ్య ఆదివారం సాయంత్రం ఇంట్లో పురుగులమందు తాగాడు. ఇంట్లో వాళ్లు గమనించే లోపే చనిపోయాడు. అతడికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.

Latest Updates