ఆ ఊరు ఎటువైపు నుంచి చూసినా ఒకేలా

ఇటుకలతో కట్టిన టవర్లు, ప్రతి టవరుకూ ఒకే రీతిలో సున్నపు గీతల అలంకారాలు ఆ ఊరి ప్రత్యేకత. ఏ వీధిలో చూసినా ఇళ్ల నిర్మాణాలన్నీ ఇదే తీరుగ ఉండటమే ఈ ఊరి వింత! కోటలు, మేడలు, గుడిసెలన్నీ ఎర్రని ఇటుకలతో తెల్లని ముగ్గులతో చూడముచ్చటగా ఉండే ఈ ఊళ్లో దారితప్పడం సాధారణమే!

ఒకప్పుడు మన పల్లెటూళ్లలో మట్టి గోడలను ఎర్ర మట్టితో అలికేవాళ్లు. పండుగలొస్తే గోడలపై గీతల ముగ్గులు గీసి అలంకరించేవాళ్లు. ఈ అలంకరణ ఇంటి నిర్మాణానికి తగ్గట్గుగా ఉంటుంది. ఎవరి ఇష్టమైన ముగ్గు వాళ్లు గీసేవాళ్లు. కానీ ఈ ఊరిలో అలంకరించకుండా ఏ ఇల్లూ ఉండదు. అన్ని ఇళ్ల అలంకరణా ఒకే తీరుగా ఉండాలన్న కట్టుబాటు ఉంది. రెండు వేల  సంవత్సరాల నాటి నిర్మాణ శైలితో ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన నగరంగా ‘సన’ గుర్తింపు పొందింది. యెమెన్‌‌ దేశంలో పర్వత సముదాయాల మధ్య ఉన్న ప్రాచీన నగరం ఇది. సరవత్‌‌ పర్వత శ్రేణిలోని జబాల్‌‌ అన్‌‌ నబి షుయాబ్‌‌, జబాల్‌‌ తియాల్‌‌ పర్వతాలపై ఈ నగరాన్ని ప్రాచీన కాలంలో నిర్మించారు.  ప్రపంచ దేశాల రాజధానులలో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తున ఉన్న రాజధానిగా సనాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

 ఆధునిక భవనాలు వద్దట!…

పాత నగరంలో క్రీ.శ. 630లో నిర్మించిన మసీదు ఉంది. దీనిని ‘గ్రేట్‌‌ మసీద్‌‌, సనా మసీద్‌‌’ అని పిలుస్తారు. ఈ మసీదు నిర్మాణం కూడా ఈ ఊరిలోని ఇండ్లను నిర్మించిన శైలిలోనే నిర్మించారు. సనా నగరంలో ప్రాచీన కోట ఉంది. ఈ కోట బురుజులు, కోటలోని అంతఃపురం కూడా ఇట్లనే ఉంది. క్రీస్తు పూర్వం 110కి ముందు యెమెన్‌‌ను గ్రీకులు, రోమన్లు పాలించారు. ఆ పాలనా కాలంలో ప్రత్యేకమైన నిర్మాణశైలి ఇక్కడ అభివృద్ధి చెందింది. సనా ప్రజలు అదే నిర్మాణ శైలిని ఇప్పటికీ అనుసరిస్తున్నారు. పాత సనా నగరాన్ని యునెస్కో 2005లో ప్రపంచ వారసత్వంగా ప్రకటించింది. నిర్మాణం, అలంకరణలో ఏకరీతిగా ఉండే ఈ పట్టణ సంప్రదాయం, సంస్కృతికి యునెస్కో ఇచ్చిన గౌరవం ఇది. ఈ గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు సనా ప్రజలు ఆధునిక నిర్మాణ శైలికి దూరంగా ఉంటున్నారు.

ఈ నగరంలో ప్రాచీన కాలపు కోట బురుజులు, ధనవంతుల మేడలు, మధ్య తరగతి అపార్ట్‌‌మెంట్లు, పేదల ఇళ్లు.. అన్నీ ఒకే నిర్మాణ శైలిలో ఉంటాయి. వాటి అలంకరణ కూడా అట్లనే ఉంది. కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టి వాటిని సిమెంట్‌‌ అలుకు లేకుండా, సున్నపు ముగ్గులతో ముస్తాబు చేస్తారు. ఆ ఇంటి దర్వాజాలు, కిటికీలకు ఆర్చి రూపంలో ముగ్గులను గీస్తారు. ఈ ఊళ్లో ఎటు చూసినా జాజు రంగు గోడలు, తెల్లని గీతల డిజైన్లు తప్ప ఏ మేడ మీదా మరో రంగు కనిపించదు. ఇస్లాం మతానికి ఆదరణ ఉన్న ఆ నగరంలో మసీదులు కూడా ఇదే రంగులో ఉంటాయి. ఒక్క మసీదు నిర్మాణంలో మినార్లు, డూమ్‌‌ మాత్రమే ఇతర నిర్మాణాలకు భిన్నంగా ఉంటాయి.

అరబ్‌ కల్చరల్‌‌ క్యాపిటల్‌‌….

సనా నగరం ప్రాచీన సిటీ వాల్‌‌ను దాటుకుని విస్తరించింది. క్రైస్తవ, ఇస్లాం మతాల పుట్టుక, అభివృద్ధిని చూసిన నగరం ఇది. ఈ నగరంలో ఆ ఆనవాళ్లు ఇప్పటికీ అగుపిస్తాయి. ఇంత ప్రాధాన్యత ఉన్న ఈ నగరాన్ని అరబ్బుల సాంస్కృతిక రాజధానిగా అరబ్‌‌ లీగ్‌‌ 2004లో ప్రకటించింది. చరిత్రలో సనా నగరం వైభవాన్ని ఈ కాలానికి తెలియజేసేందుకు ఆ దేశ పాలకులు ‘అల్‌‌ సాహెబ్‌‌ మసీదు’ నిర్మించారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద మసీదులలో ఒకటి. 27,300 చదరపు మీటర్ల వైశాల్యంలో దీనిని నిర్మించారు. యెమనీ సంప్రదాయ నిర్మాణ శైలి, ఇస్లామిక్‌‌ నిర్మాణ శైలిని జోడించి ఈ మసీదు నిర్మించారు. ఇస్లాం మత గ్రంథం ఖురాన్‌‌లోని  సురాలలోని ముఖ్యమైన అయాత్‌‌లను ఈ మసీద్‌‌ గోడలపై చెక్కించారు. మసీదులో 40 వేల మంది ఒకే సారి నమాజ్‌‌లో పాల్గొనవచ్చు. కొన్ని ఎంపిక చేసిన రోజులలో పర్యాటకులను కూడా మసీదులోకి అనుమతిస్తారు. అల్‌‌ సాహెబ్‌‌ మసీద్‌‌ పేరుని ‘పీపుల్స్‌‌ మసీద్‌‌’ అని పేరు మార్చారు.

Latest Updates