గొంతెత్తితే నొక్కేస్తున్నరు.. నెటిజన్లపై టీఆర్ఎస్ కక్షసాధింపులు

 • సోషల్​ మీడియాలో నెగెటివ్ పోస్టులు పెడ్తే బెదిరింపులు
 • పోలీసులతో హెచ్చరికలు
 • ఇల్లీగల్ అరెస్టులు, బూతు పురాణాలు
 • వినకపోతే తప్పుడు ఫిర్యాదులతో అకౌంట్లు బ్లాక్
 • ట్రోలింగ్ కోసం స్పెషల్​ టీమ్స్​

 

టీఆర్​ఎస్​ ప్రభుత్వం నెటిజన్ల గొంతు నొక్కుతోంది. వారికి తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ లేకుండా చేస్తోంది. కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ప్రభుత్వానికి కానీ, టీఆర్​ఎస్​కు కానీ వ్యతిరేకంగా సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్లను గుర్తించి బెదిరింపులకు దిగుతోంది. కొందరు లీడర్లు, పోలీసులు నెటిజన్లకు ఫోన్​ చేసి.. పోస్టులను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నారు. వినకపోతే ఇంటికెళ్లి దబాయిస్తున్నారు. అయినా దారిలోకి రాకపోతే కేసులు పెట్టి సతాయిస్తున్నారు. అక్రమంగా నిర్బంధిస్తున్నారు. బలవంతంగా అకౌంట్లను డిలీట్  చేయిస్తున్నారు. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్, వెలుగు: తొలి ప్రభుత్వంలో సోషల్​ మీడియాను ఉపయోగించుకొని తన  ప్రచారాన్ని హోరెత్తించిన టీఆర్​ఎస్​… ఇప్పుడు అదే సోషల్​ మీడియాకు సంకెళ్లు వేయాలని చూస్తున్నది. ప్రశ్నించే వాళ్లపై ఎదురుదాడికి దిగుతున్నది. ఫస్ట్​ టర్మ్​ పాలనలో అటు ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు, ఇటు పార్టీ వ్యవహారాల కోసం  ట్విట్టర్​, ఫేస్​బుక్​, యూ ట్యూబ్​ ప్లాట్​ఫామ్​లన్నింటినీ వాడుకుంది. సీఎంవో మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ప్రత్యేక పేజీలు, ట్విట్టర్​ ఖాతాలతో పోటీ పడ్డారు. తమకు నెటిజన్ల ఫాలోయింగ్​ ఉందని చాటుకునేందుకు మంత్రి కేటీఆర్​ పలుమార్లు ట్విట్టర్​ వేదికగానే నెటిజన్లతో ప్రత్యేక చాటింగ్​ ప్రోగ్రాంలు  నిర్వహించారు. కానీ కొంత కాలంగా సోషల్​ మీడియాలో టీఆర్​ఎస్​ గ్రాఫ్​ పడిపోతూ వస్తోంది.

యూట్యూబ్ వేదికగా ప్రభుత్వం, టీఆర్ఎస్ పై  నెటిజన్లు పెడ్తున్న పోస్టులు, వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. సర్కార్​ ఫెయిల్యూర్లను నెటిజన్లు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. ఈ కామెంట్లు, పోస్టులను చూసి మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. దుబ్బాక ఎలక్షన్​లోనూ సోషల్​ మీడియా టీఆర్​ఎస్​ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేసిందనే అభిప్రాయాలున్నాయి. గతంలో కేసీఆర్​ ప్రెస్​మీట్లు, మీటింగ్​ అంటే  భారీగా నెటిజన్లు.. యూట్యూబ్​ చానళ్లకు అతుక్కుపోయే వారు. ఇటీవల వ్యూయర్​షిప్ వందల్లోకి పడిపోయింది. అదే టైమ్​లో ఇతర పార్టీల నేతల ప్రోగ్రాంలకు  వ్యూయర్​షిప్ పెరిగింది. గతంలో తమ ప్రోగ్రాంలకు లైక్​లు కొట్టే జనం.. ఇప్పుడు డిస్​ లైక్​లు కొట్టడమేందని టీఆర్​ఎస్​ నేతలకు కలవరం పట్టుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నెటిజన్లపై కక్ష కట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువైంది

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల టైంలో నెటిజన్లపై వేధింపులు ఎక్కువయ్యాయి. టీఆర్ఎస్​కు వ్యతిరేక పోస్టులు పెట్టిన వారిని ఐపీ అడ్రస్ ల ద్వారా గుర్తించి, వారిని బెదిరిస్తున్నారు. దుబ్బాక బై ఎలక్షన్​లో సోషల్ మీడియా వింగ్ యాక్టివ్ గా ఉండటం వల్లే బీజేపీ గెలిచిందనే అభిప్రాయం టీఆర్ఎస్ లీడర్లలో ఉంది. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సోషల్ మీడియా వేదికగా వ్యతిరేక పోస్టులు రాకుండా అడ్డుకునేందుకు టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. ఇందుకోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, నెగెటివ్ పోస్టులకు కౌంటర్లు ఇస్తోంది. అదే సమయంలో పోస్టులు పెట్టినవారిని గుర్తించి, ఫోన్ చేసి బెదిరిస్తున్నది. చాలా చోట్ల ఐపీఎస్ ఆఫీసర్లు కూడా నెటిజన్లకు ఫోన్ చేసి, బెదిరింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సోషల్​ మీడియాలో వస్తున్న వ్యతిరేకతను గుర్తించేందుకే స్పెషల్​గా ఓ అడిషనల్ ఎస్పీ, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్​ఐలను టీమ్ గా ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తున్నది.

కంప్లయింట్లు లేకుండానే పోలీసుల ఎంట్రీ

సోషల్ మీడియాలో అశ్లీలం, ఫేక్ కంటెంట్, మార్ఫింగ్ కంటెంట్, విద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా పోస్టులు పెడ్తే  కేసులు పెట్టి, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు ఎంట్రీ అవుతారు. అకౌంట్ల అడ్మిన్లను గుర్తించి వేధిస్తున్నారు. ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. దారికొస్తే వదిలేస్తున్నారు. లేకుంటే  వాళ్ల ఇండ్లకు వెళ్లి ఫ్యామిలీ ముందు తిడ్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మొండిగా ఉన్న నెటిజన్ల అకౌంట్లను బలవంతంగా బ్లాక్ చేయిస్తున్నారు. ఇందుకోసం వాట్సప్, ఫేస్​బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్  ఆపరేటర్లకు అకౌంట్ల బ్లాక్  రిక్వెస్టులు పంపుతున్నారు. పోలీసులే రిక్వెస్టు చేయడంతో ఆపరేటర్లు బ్లాక్ చేస్తున్నారు.

పాజిటివ్ పోస్టులకు ఆఫర్లు​

హైదరాబాద్​ ప్రజలు వరదల్లో బిక్కుబిక్కుమంటు కాలం వెళ్లదీస్తే సీఎం ఎందుకు పరామర్శించలేదని ఇటీవల నెటిజన్లు నిలదీస్తున్నారు. ఎన్నికల హామీలు ఏమైయ్యాయని నిలదీస్తున్నారు. ఇవి వైరల్ అవుతుండటంతో కంట్రోల్ చేసేందుకు ట్రోలింగ్ టీమ్ లను టీఆర్​ఎస్​ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఆ టీమ్​లు.. డిజిటల్ ఆర్గనైజేషన్లను ఎంగేజ్ చేసుకుని, నెగిటివ్ పోస్టులను డిస్ లైక్ కొట్టి, వాటికి వల్గర్ కామెంట్స్ పెట్టి ట్రోల్ చేయిస్తున్నాయి. అనుకూల పోస్టులు పెట్టిన వారికి టీఆర్ఎస్ లీడర్లు ఆఫర్లు ఇస్తున్నట్టు తెలిసింది. గ్రేటర్ డివిజన్లలో ఎక్కువ మెంబర్ షిప్ ఉండే గ్రూప్స్ కు నగదు బహుమతులు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. టెక్ట్స్​ కంటెంట్ కు రూ. 200, వీడియోకు రూ. 500, ఇంటర్వ్యూకు రూ. 1,000 వరకు ఇస్తున్నట్టు ఓ లీడర్ చెప్పారు.  ఇందుకోసం కూడా ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

బాధితుల్లో కొందరు..

 • ఉస్మానియాలో ఓ పీహెచ్​డీ స్కాలర్​.. నిరుద్యోగ భృతిపై అప్పట్లో కేసీఆర్​ ఇచ్చిన హామీ వీడియోను సెటైరిక్ గా చేసి ఫేస్​బుక్​ అకౌంట్ లో పెట్టారు. అది వైరల్ కావడంతో ఆ స్కాలర్​ను ఇల్లీగల్ గా అరెస్టు చేసి అకౌంట్​ను డిలీట్ చేయించారు. ఇకపై ఎలాంటి వ్యతిరేక పోస్టులు పెట్టొద్దని పేపర్​పై రాయించుకున్నారు.
 •  వేల కోట్ల స్కామ్స్ చేసి ఓ మంత్రి వందల ఎకరాల భూములు కొన్నారని, ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారంటూ ఫొటోలు, వీడియోల్ని పోస్ట్ చేసిన అకౌంట్ అడ్మిన్ పై తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ చేశారు.
 • ‘తెలంగాణ’ పేరుతో నడుస్తున్న ఫేస్​బుక్ అకౌంట్​లో టీఆర్ఎస్​ను టార్గెట్ చేస్తున్నారని ఆ అకౌంట్​ను కొన్నిరోజులు బ్లాక్ చేయించారు. అడ్మిన్లను బెదిరించారు.
 • మల్లన్న సాగర్ నిర్వాసితులకు అండగా పోస్టు లు పెట్టిన ప్రశాంత్ అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు వేధించడం వివాదాస్పదమైంది.
 • దుబ్బాక ఎన్నికల్లో సోషల్ మీడియా క్యాంపెయిన్​ చేసిన వ్యక్తిని నల్గొండ పోలీసులు బెదిరించి, ఆ అకౌంట్​ను క్లోజ్​ చేయించారు.
 • గ్రేటర్ ఎన్నికల్లో ప్రభుత్వం, టీఆర్ఎస్​ లీడర్ల తీరును ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్న ఓ ఫేస్​బుక్​ అకౌంట్​ను  బ్లాక్ చేశారు. దాన్ని ఆపరేట్ చేస్తున్న ఇద్దర్ని బెదిరించినట్టు తెలుస్తోంది.

ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నరు

టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా, వాస్తవాలు పెట్టినా దానికి  పెయిడ్ అకౌంట్ హోల్డర్స్​తో బూతులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ ఫెయిల్యూర్స్​ను ఎత్తి చూపితే ఆ పోస్టులపై ఎదురు దాడి దిగుతున్నారు. విమర్శలపై సమాధానాలు చెప్పడానికి చేతకాకనే టీఆర్​ఎస్​ లీడర్లు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు.

-దాసరి శ్రీనివాస్,
తెలంగాణ జాగృతి మాజీ ఐటీ సెల్ ఇన్​చార్జ్​

ఆఫీసుకు వచ్చి సోదాలు చేశారు

మల్లన్న సాగర్ బాధితులు,  నిరుద్యోగుల తరఫున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు 2017లో మా ఆఫీసుకు వచ్చి సోదాలు చేశారు. వేధింపులకు గురిచేశారు. ఈ రాష్ట్రంలో ప్రశ్నించడమే తప్పా? తాత్కాలికంగా సోషల్ మీడియాను కట్టడి చేయగలరేమో.. కానీ,  ప్రజాగ్రహం పెల్లుబుకినప్పుడు అడ్డుకోలేరు.

– సతీష్ చంద్ర, డిజిటల్ మీడియా క్యాంపెయినర్​, మెటా మార్ఫ్ ఐటీ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్

దాడులు చేస్తున్నారు

ప్రభుత్వ డిజిటల్​ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్‌‌కు నెలకు  రూ.2.5 లక్షల శాలరీ ఇస్తున్నారు. ఆ విభాగంలో 14 మంది ఎంప్లాయీస్‌‌ను నియమించుకున్నారు. సోషల్ మీడియాలో టీఆర్‌‌‌‌ఎస్‌‌కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ల మీద విరుచుకుపడుతున్నారు. వాళ్ల సోషల్ మీడియా ఐడీలను బ్లాక్ చేస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నిజామాబాద్‌‌లో ఆర్టీసీ ఉద్యోగి తనకు జరిగిన అన్యాయాన్ని ఫేస్‌‌బుక్‌‌లో పెట్టినందుకు ఆయన ఉద్యోగాన్ని తీసేశారు. ఇలాంటివి వందల, వేల కేసులు ఉన్నాయి.  – మూష్ణం శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమ కారుడు

అక్రమ కేసులు బనాయిస్తోంది

మా క్యూ న్యూ స్ చానెల్ ను టార్గెట్ చేసి ప్రభుత్వం వేధిస్తోంది. అక్రమ కేసులు బనాయిస్తోంది. ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతులు, వేదికలు లేకుండా చేయడమే ఈ
ప్రభుత్వ టార్గెట్. జర్నలిస్టులను, మీడియా సంస్థలనే బెదిరిస్తే ఇక సామాన్యుడు ఎట్ల గొంతెత్తగలడు? పెరిగిన సోషల్ మీడియాను,ప్రభుత్వ వ్యతిరేకతను అడ్డు కోవడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ డిజిటల్ ఎంప్లాయీస్ సైన్యాన్ని రంగంలోకి దింపి ​కుట్రలు చేస్తున్నది.
– తీన్మార్ మల్లన్న

 

Latest Updates