మైనర్ల ర్యాష్​ డ్రైవింగ్​..దంపతుల దుర్మరణం

రాజేంద్రనగర్, వెలుగు: మైనర్లు కారు నడుపుతూ అతివేగంగా వచ్చి బైక్​ను ఢీకొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రాజేంద్రనగర్ లోని అప్పా జంక్షన్ వద్ద ఆదివారం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం మధ్యాహ్నం(టీఎస్11 ఈజి 8002) నెంబరు గల  మారుతీ బ్రిజా కారు మహబూబ్ నగర్ వెళ్తుండగా అప్పా జంక్షన్  ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ లో ఎదురుగా వస్తున్న (ఏపీ 22 ఎస్ 7681) బైక్​ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్​గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. కారు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్​పై ప్రయాణిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలానికి చెందిన చెన్నయ్య(38), అతని భార్య పద్మమ్మ(32) ఘటనాస్థలంలో నే మృతి చెందారు. చెన్నయ్య బావమరిది కూతురు మౌనికకు తీవ్ర గాయాలయ్యాయి. చెన్నయ్య దంపతులు మొయినాబాద్ లో నివాసం ఉంటున్నారు. దసరా పండుగ సందర్భంగా చెన్నయ్య సొంతూరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన మౌనిక ను చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. అలాగే రాష్ కారు డ్రైవింగ్ చేసిన యాకత్ పురా కు చెందిన ముగ్గురు మైనర్లలో ఒకరికి తీవ్రగాయాలవ్వడంతో చికిత్స కోసం ఆలివ్ హాస్పిటల్ కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Latest Updates