జీతం రూ.2 లక్షలు…టార్గెట్ రూ.20లక్షలు

హైదరాబాద్‌‌, వెలుగు: మెడికల్ రిప్రజెంటేటివ్స్‌‌కు పెట్టినట్టు, ఇప్పుడు డాక్టర్లకు కూడా కార్పొరేట్ హాస్పిటళ్లు టార్గెట్లు పెడ్తున్నాయి. వేతనానికి కనీసం పది రెట్లు బిల్లు చేయకపోతే కార్పొరేట్ బాసులు ఒప్పుకుంటలేరు. నెలకు రూ.2 లక్షల వేతనం ఇస్తే, కనీసం రూ.20 లక్షల వరకు బిల్లు జనరేట్ చేయాల్సిందే. టార్గెట్​ రీచ్​ కాలేకపోతే డాక్టర్లను రకరకాలుగా వేధిస్తున్నారు. 2, 3 నెలలు శాలరీలు పెండింగ్ లో పెట్టడం.. ఆపరేషన్ అలవెన్స్‌‌లో కోత పెట్టడం వంటివి చేస్తూ నేరుగా వెళ్లిపోమని చెప్పకుండా పొగబెడుతున్నారు. ఈ టార్గెట్లు రీచ్ కాలేక, వేధింపులు తట్టుకోలేక యువ డాక్టర్లు కొలువులు వదిలి పెడ్తున్నారు. నాలుగైదు దవాఖాన్లు మారి.. దాదాపు అంతటా అదే వ్యవహారమని తెలుసుకుంటున్న సీనియర్లైతే, టార్గెట్ రీచ్‌‌ అయ్యేందుకు పేషెంట్లపై భారం వేస్తున్నారు. తల నొస్తోందని పోయినా, తలపోటు వచ్చేలా అడ్డగోలు టెస్టులు రాస్తున్నారు. చివర్లో అంతా బాగానే ఉంది ప్రశాంతంగా ఉండండని చెప్పి జేబు ఖాళీ చేసి పంపుతున్నారు. పేషెంట్‌‌ తల్లిదండ్రుల వృత్తి వివరాలను తెలుసుకుంటున్న డాక్టర్లు, వాళ్ల హోదాలను బట్టి ‘ఖర్చు’పెట్టిస్తున్నారు.

ఓపీ నుంచి బిల్లుల వరకూ ప్రతిదీ లెక్కే

ఓపీ స్లిప్ దగ్గర్నుంచి, డాక్టర్‌‌‌‌ రాసే టెస్టులు, ప్రిస్ర్కిప్షన్, వాటి బిల్లుల వరకూ అన్నింటిపై టార్గెట్ల లెక్కలుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ‘ప్రతి డాక్టర్‌‌పై హాస్పిటల్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ ఓ టార్గెట్ పెట్టుకుంటుంది. అది రీచ్ అవుతున్నాడా లేదా తెలుసుకునేందుకు డాక్టర్‌‌‌‌ రాసే ప్రతి టెస్ట్‌‌, ఇచ్చే ప్రతి గోలిని లెక్కేస్తాయి’ అని ఓ యువ డాక్టర్‌‌ వెల్లడించారు. ప్రతినెలా ఎన్ని ఎంఆర్‌‌ఐలు రాశారు? సీటీ స్కాన్‌‌లు.. ఈసీజీలు ఎన్ని రాశారు? ఎంత విలువైన మెడిసిన్ రాశారు? ఎన్ని సర్జరీలు చేశారు? వంటి వివరాలన్నింటిని లెక్కేస్తారు. ‘టార్గెట్ రీచ్ అవకపోతే, డాక్టర్‌‌‌‌ వేతనంలోనూ లెక్కలు మారుతాయి. నేరుగా వెళ్లిపోమని చెప్పకుండా, రకరకాలుగా వేధించడం మొదలు పెడ్తారు. 2, 3 నెలలు శాలరీ పెండింగ్ పెడ్తరు. ఆపరేషన్ అలవెన్స్‌‌లో కోత పెడ్తరు’అని ఆయన వివరించారు.

డిపార్ట్‌‌మెంట్‌‌ను బట్టి టారిఫ్‌‌

కార్పొరేట్ హాస్పిటళ్లు ఒక్కో డిపార్ట్‌‌మెంట్‌‌ను ఒక డాక్టర్‌‌‌‌కు అప్పగించి, ఆయనకే టార్గెట్‌‌ ఫిక్స్‌‌ చేస్తున్నాయి. ఉదాహరణకు కార్డియాలజీ డిపార్ట్‌‌మెంట్‌‌ను ఓ సీనియర్ కార్డియాలజిస్ట్‌‌కు అప్పగిస్తారు. నెలకు ఇన్ని కోట్ల ఇన్‌‌కం జనరేట్‌‌ చేయాలని, ఇంత కమీషన్ ఇస్తామని టార్గెట్‌‌ పెడ్తాయి. కార్డియాలజిస్ట్‌‌ల రిక్రూట్ మెంట్, వాళ్ల శాలరీలు, టార్గెట్ పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ వ్యక్తికే అప్పగిస్తాయి. టార్గెట్ రీచ్ అవకపోతే డాక్టర్లందరికీ ఉద్వాసన పలుకుతాయి. పెద్ద పెద్ద సంస్థల చేతుల్లోకి వెళ్లిన కొన్ని హాస్పిటళ్లలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారమిదేనని డాక్టర్లు చెబుతున్నారు.

ప్రాక్టీస్​కు ప్రోత్సాహం కరువు

దశాబ్దం క్రితం ఎంబీబీఎస్‌‌ డాక్టర్లకూ మస్తు ప్రాక్టీస్ ఉండేది. ఇప్పుడు పరిస్థితి అలాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌‌‌‌ఎంపీ, పీఎంపీల వద్దకు వెళ్తున్నారు. లేదంటే వాళ్లు సూచించిన బడా దవాఖాన్లు, కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్తున్నారు. పెద్ద హాస్పిటళ్లు కమీషన్లు ఇస్తుండడంతో ఆర్‌‌‌‌ఎంపీ, పీఎంపీలకు అక్కడికి వెళ్లాలని లేదంటే ప్రమాదమంటూ జనాలను భయపెడుతున్నారు. కమీషన్లు ఇవ్వలేని చిన్నాచితక హాస్పిటళ్లు, క్లినిక్‌‌లకు పేషెంట్లు రావడం లేదు. స్పెషలైజేషన్ చేసినా ఉద్యోగాలపైనే ఆధారపడాల్సి వస్తోందని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న క్లినిక్‌‌లు, నర్సింగ్‌‌హోంలు పెట్టుకునే డాక్టర్లను ప్రోత్సహించాలని, రూల్స్‌‌ను సరళీకృతం చేయాలని వారు కోరుతున్నారు.

సొంతంగా హాస్పిటల్ నడపలేక

‘‘స్పెషలైజేషన్ పూర్తి చేసే సరికే రూ.లక్షల్లో ఖర్చవుతోంది. సొంతంగా చిన్న నర్సింగ్ హోం పెట్టి నడిపించాలన్నా రూ.20 లక్షల నుంచి 30 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. రకరకాల పర్మిషన్ల కోసం అధికారుల చుట్టూ తిరగాలి. ఇన్ని చేసినా పేషెంట్లు వస్తరా అంటే నమ్మకం లేదు. ఇంత రిస్క్‌‌ తీసుకోవడానికి డాక్టర్లు ఎవరూ విల్లింగ్ గా లేరు”అని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌‌లో పని చేస్తున్న డాక్టర్ వివరించారు. స్పెషలైజేషన్‌‌ను బట్టి కార్పొరేట్ హాస్పిటళ్లలో స్టార్టింగ్ శాలరీ రూ.లక్ష వరకూ ఇస్తున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లకైతే రూ.25 వేల నుంచి 30 వేలు చెల్లిస్తున్నారు.

మరిన్ని వార్తలు –

హైదరాబాద్‌లోనూ ‘వాటర్ బెల్‍’
భర్తను హత్య చేసి వంటింట్లో పాతిపెట్టిన భార్య

Latest Updates