కాంగ్రెస్​ ఎందుకిలా?

లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో  డీలా పడి  పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాహుల్ రాజీనామా చేయడంతో కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నిరుత్సాహానికి గురయ్యారు. ముందుండి పార్టీని నడిపించే నాయకుడే సడన్ గా కాడి వదిలేస్తే పార్టీ పరిస్థితి ఏంటని ఆందోళన పడ్డారు. రాజీనామా పై రాహుల్ మనసు మార్చుకుంటారని కొండంత ఆశలు పెట్టుకున్నారు. అయితే రాజీనామా పై  వెనక్కి తగ్గేది లేదని రాహుల్ స్పష్టం చేయడంతో కాంగ్రెస్ లో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పార్టీ చీఫ్​ సంగతి సరే, అసలు పార్టీ సరైన ట్రాక్​లోనే ఉందా? ఐడియాలజీకి దూరంగా జరగడంవల్లనే ఈ పరిస్థితి నెలకొందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

రాహుల్​ గాంధీ ఇప్పటకీ తేల్చుకోలేకపోతున్నారు. ఆయన ఏ డెసిషన్​ తీసుకుంటారన్నది పక్కన పెడితే, అసలు కాంగ్రెస్​ పార్టీ ఒకప్పటి పార్టీ మాదిరిగానే ఉందా? మొదట్నుంచి ఒక ఐడియాలజీ కి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. స్వతంత్రం కోసం జరిగిన పోరాటంలో ప్రజాగొంతుక అయింది. ఉప్పెన  లా ఎగసింది. కొన్ని సిద్ధాంతాలు, మరికొన్ని విలువలు. ఇవే కాంగ్రెస్ ను చాలా ఏళ్లపాటు నడిపించాయి. ఈ సిద్ధాంతాలు, విలువలతోనే ప్రజలకు దగ్గరైంది. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతాలే కాంగ్రెస్ కు జనం గుండెల్లో చోటు కల్పించాయి. చాలా ఏళ్ల పాటు పార్టీకి గైడ్ లైన్స్ లా పనిచేసిన సిద్ధాంతాలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదన్నది సోషల్ సైంటిస్టుల అభిప్రాయం. కాంగ్రెస్ కు వ్యూహాలే తప్ప సిద్ధాంతాలు ఉండవన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో కూడా కలిగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో లాభాల కోసం ఐడియాలజీని కాంగ్రెస్ అటకెక్కించిందన్న  విమర్శ చాలా కాలం నుంచి వినిపిస్తోంది. ఈ విమర్శలను పట్టించుకునే తీరిక, ఓపిక పార్టీ పెద్దలకు లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కాంగ్రెస్ ఇవాళ చేయాల్సింది ఎన్నికల్లో గెలుపు కోసం కసరత్తు కాదు. వదిలేసిన ఐడియాలజీని మళ్లీ దగ్గరకు తీసుకోవడం. కాంగ్రెస్ కు మిగతా రాజకీయ పార్టీలకు చాలా తేడా ఉంది. ఎన్నికల్లో గెలుపు కోసం పుట్టిన పార్టీ కాదు కాంగ్రెస్. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్, గెలుపోటములను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.  ఒక రాజకీయ పార్టీగా ప్రజల దగ్గరకు వెళ్లినప్పుడు ప్రజల ఆశీర్వాదాలు, తిరస్కరాలు రెండూ ఉంటాయి. రెండిటినీ సమానంగా తీసుకోవాల్సిన మెచ్యూరిటీ ఢిల్లీలో కూర్చుని నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ పెద్దలకు ఉండాలన్నది వీరి వాదన.  దేశానికి  స్వతంత్రం తీసుకురావడానికి పుట్టిన కాంగ్రెస్​కు ఒక స్పష్టమైన ఐడియాలజీ ఉంది.ఈ ఐడియాలజీయే  సమాజంలోని అనేక వర్గాలు కాంగ్రెస్ కు దగ్గరయ్యేలా చేసింది. కాంగ్రెస్ కు మొదటినుంచి సొసైటీలో  ఒక ‘ సపోర్ట్ బేస్ ’ అంటూ ఉంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ కొన్నేళ్లుగా  తన ఒరిజినల్ సిద్ధాంతాలకు దూరమైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో  కాంగ్రెస్ కు ‘సపోర్ట్ బేస్’  గా ఉన్న అనేక వర్గాలు పార్టీకి దూరమయ్యాయన్నది ఒక విశ్లేషణ. బీజేపీని నడిపించడానికి  ఆరెస్సెస్ అనే ఓ ఐడియాలజీ సంస్థ ఉన్నట్లు, లెఫ్ట్ పార్టీలకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి  పొలిట్ బ్యూరో వంటి  పెద్ద స్థాయి వేదికలు కాంగ్రెస్ కు లేవన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా  పొలిటికల్ ఎనలిస్టులు గుర్తు చేస్తున్నారు.

కాంగ్రెస్ జర్నీలో అనేక అనుబంధ సంఘాలు

ఒక మాస్ ఆర్గనైజేషన్ గా మొదలైన కాంగ్రెస్ జర్నీలో అనేక అనుబంధ సంఘాలున్నాయి.కార్మికుల కోసం పనిచేసే ఐఎన్ టీయూసీ, రైతుల మేలు కోసం కిసాన్ కాంగ్రెస్, స్టూడెంట్ల సమస్యలపై  పోరాటం చేయడానికి ‘ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ’. ఏ వర్గాల కోసం ఈ అనుబంధ సంఘాలు ఉన్నప్పటికీ  ఇవన్నీ కాంగ్రెస్ ఐడియాలజీకి లోబడి పనిచేయల్సిందే. అంతర్గతంగా అన్ని అనుబంధ సంఘాల మధ్య ఒక  బాండేజ్ ఉండేది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తన మార్క్ ఐడియాలజీకి దూరంగా జరిగిందో, అప్పటి నుంచే ఈ సంఘాల మధ్య అనుబంధం కూడా దెబ్బతిన్నదని సోషల్ సైంటిస్టులు చెబుతున్నారు.  సిద్ధాంతాలను పక్కన పెట్టి పరిస్థితుల కనుగుణంగా సర్దుకుపోవడం మొదలైంది. చివరకు ఎన్నికల్లో గెలుపే కాంగ్రెస్ కు మెయిన్ టార్గెట్ గా మారింది. ఈ పరిస్థితుల్లో  కాంగ్రెస్  ప్రజలకు దూరమవడం మొదలైందన్నారు సోషల్ సైంటిస్టులు.  పార్టీలోకి  కొత్త రిక్రూట్ మెంట్లు ఆగిపోయాయి. కాంగ్రెస్  ద్వారా అధికారానికి  చేరువైన కొన్ని  కుటుంబాలు మాత్రమే  పార్టీలో కొనసాగుతున్నాయి. అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి  ఈ కుటుంబాలు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాయి. చాలా ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో  సంపద పోగేసుకునే విద్య బాగా తెలిసిన బడా వ్యాపారస్తులు కాంగ్రెస్ లోకి  ఎంటరయ్యారు. ప్రజలతో సంబంధం లేకపోయినా డబ్బు చూపించి ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు తెచ్చుకుంటున్నారు…గెలుస్తున్నారు. కాంగ్రెస్ లో చక్రం తిప్పుతున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ కు ఏమాత్రం లాభం చేయబోవంటున్నారు  రాజకీయ విశ్లేషకులు.

కాంగ్రెస్ పార్టీ ఏనాడూ పిడివాదానికి కట్టుబడి లేదు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు విధానాలను మార్చుకుంటూ వెళ్లింది.  1947 కు ముందు ఏ విలువలు, ఏ సిద్దాంతాల కోసమైతే కాంగ్రెస్ పోరాటం చేసిందో ఆ పోరాటాన్ని మళ్లీ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు సోషల్ సైంటిస్టులు. ఎన్నికల్లో గెలుపు కోసం కాకుండా దూరమైన  ప్రజలకు ఎలా దగ్గర కావాలన్న విషయంపై  కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేయాలంటున్నారు.

అన్ని వర్గాలు దూరమయ్యాయి

సామాన్య ప్రజలకు దూరమైన కాంగ్రెస్ రాజకీయాలు తర్వాత రెండే రెండు అంశాల చుట్టూ తిరిగాయి. ఒకటి….ఎన్నికల్లో గెలుపు. రెండు ….వచ్చే ఎన్నికల్లో గెలవడానికి పార్టీ ఫండ్స్ ను సేకరించడం. ఈ పరిస్థితుల్లో పార్టీ లో నియంతృత్వ పోకడలు పెరిగాయన్న ఆరోపణ కూడా వినిపిస్తోంది. పెద్ద మొత్తంలో పార్టీకి  విరాళాలు సేకరించగలవారే  ప్రముఖ నాయకులుగా మారిపోయారు.యూత్ కాంగ్రెస్, ఐఎన్ టీయూసీ,  కిసాన్ కాంగ్రెస్ వంటి అనుబంధ సంఘాలు ఆయా వర్గాలకు దూరమయ్యాయి. ఈ సంఘాల కోటా కింద పార్టీ టికెట్లు తెచ్చుకోవడానికి ఈ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

రాహుల్ చేయాల్సింది ఏంటి ?

నెహ్రూ కుటుంబానికి చెందిన ఐదో తరం ప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ గాంధీ ప్రస్తుత పరిస్థితుల్లో  ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందంటున్నారు సోషల్ సైంటిస్టులు. ఒక బలమైన  ప్రతిపక్ష నాయకుడిగా నిరూపించుకోవాల్సిన టైం వచ్చిందంటున్నారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించడం ఒక్కటే నాయకుడి సమర్థతకు కొలమానం కాదంటున్నారు. అధికారపక్షం లోక్ సభలో తనకున్న సంఖ్యా బలాన్ని చూసుకుని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే అప్పోజిషన్ పార్టీగా వ్యతిరేకించాల్సిన బాధ్యతను రాహుల్ తీసుకోవాలన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఏం చేసినా చెల్లుతుందనే ధీమా అధికారపార్టీకి కలగకుండా చేయాలంటున్నారు. ప్రజాస్వామ్యలో  ‘చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ’ కున్న ఇంపార్టెన్స్ ను ఈ సందర్భంగా సోషల్ సైంటిస్టులు గుర్తు చేస్తున్నారు.

Latest Updates