టీఆర్ఎస్ కు దడ..రాబోయే ఎన్నికలపై గ్రేటర్​ ఎఫెక్ట్​

  • త్వరలో ఖమ్మం, వరంగల్  కార్పొరేషన్స్​కు, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లకు ఎలక్షన్స్,
    నాగార్జునసాగర్​కు బై ఎలక్షన్​
  • వాటిని ఎదుర్కొనేదెట్ల.. బీజేపీని కట్టడి చేసేదెట్లని పరేషాన్​ అవుతున్న టీఆర్​ఎస్​ పెద్దలు
  • రేపు ఖమ్మం టూర్​కు కేటీఆర్ .. ఆ తర్వాత వరంగల్ లో పర్యటన
  • త్వరలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం రివ్యూ

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ టీఆర్​ఎస్​కు త్వరలో జరగబోయే ఎన్నికలు దడ పుట్టిస్తున్నాయి. వాటిని ఎట్లా ఎదుర్కోవాలని పార్టీ లీడర్లు కలవరపడుతున్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రభావం రాబోయే ఎన్నికలపై కూడా ఉండొచ్చని, బీజేపీని ఎలా కట్టడి చేయాలని వారు చర్చించుకుంటున్నారు. ఎన్నికలు జరుగబోయే ఏరియాల్లో ఇప్పటినుంచే వీలైనన్ని డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్స్​స్టార్ట్​ చేయాలని భావిస్తున్నారు. లోకల్​ లీడర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు స్థానిక రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.  గ్రౌండ్​ లెవల్​లో సిచ్యువేషన్​ను తెలుసుకునేందుకు టీఆర్​ఎస్​ పెద్ద లీడర్లు ఆయా ఏరియాల్లో పర్యటించనున్నారు.

హైదరాబాద్, వెలుగుదుబ్బాక,  జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు భారీ షాక్​ ఇచ్చిన బీజేపీ.. అదే జోష్​తో రాబోయే ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. దీంతో టీఆర్​ఎస్​ లీడర్లలో బుగులు పట్టుకుంది. ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లకు, నాగార్జున సాగర్  అసెంబ్లీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్, మేలో సిద్దిపేట మున్సిపల్​ ఎలక్షన్​ కూడా జరుగనున్నాయి. రాబోయే ఎన్నికలపైనా జీహెచ్​ఎంసీ రిజల్ట్స్​ ఎఫెక్ట్​ ఉంటుందని, ఆయా ఏరియాల్లో బీజేపీని ఎలా కట్టడి చేయాలని, ఆ పార్టీ ప్రభావం పడకుండా ఏం చేస్తే మంచిగుంటుందని టీఆర్​ఎస్​ లీడర్లు ఆలోచిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఖమ్మం టూర్ కు సిద్ధమయ్యారు. ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికలపై పార్టీ కేడర్ అభిప్రాయాలను తీసుకోవడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. త్వరలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ కేటీఆర్​ పర్యటించే చాన్స్​ ఉంది. నోముల నర్సింహయ్య దశదిన కర్మ తర్వాత నాగార్జునసాగర్ బై ఎలక్షన్ పై టీఆర్ఎస్  ఫోకస్ పెట్టనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలతో త్వరలో సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ పెట్టి,  ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చించనున్నట్టు తెలిసింది.

కొంత కాలం వాయిదా వేద్దామా?

ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలను కొంతకాలం పాటు వాయిదా వేస్తే ఎలా ఉంటుందని ఆ రెండు సిటీల లీడర్లు ఆరా తీస్తున్నారు. షెడ్యూల్​ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే జీహెచ్ఎంసీ రిజల్ట్స్​ ఎఫెక్ట్​ పడవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఏడాది మార్చి 6తో ఖమ్మం, వరంగల్​నగర పాలక మండళ్ల గడువు ముగుస్తుంది. మున్సిపల్ యాక్టు ప్రకారం వచ్చే ఏడాది జనవరి 6 తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే చాన్స్ ఉంది. కానీ ఎన్నికలను కొంతకాలం పాటు వాయిదా వేస్తే బాగుంటుందని ఖమ్మం, వరంగల్​కు చెందిన కొందరు టీఆర్​ఎస్​ లీడర్లు అంటున్నారు. ఇదే విషయాన్ని వారు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. పాలక మండలి గడువు ముగిసిన తర్వాత కొంతకాలం పాటు స్పెషల్ ఆఫీసర్ పాలన పెడ్తే  మంచిదని వారు చెబుతున్నారు. గతంలో ఉమ్మడి  వరంగల్ జిల్లాలో రెండు మూడు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు, మేయర్ సీటును గెలుచుకున్న చరిత్ర బీజేపీకి ఉంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో వరంగల్ కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ మరింత పుంజుకునే చాన్స్ ఉందని లోకల్​ టీఆర్​ఎస్​ లీడర్లు భయపడుతున్నారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను ఎదుర్కొనేదెట్ల?

మార్చిలో వరంగల్– ఖమ్మం– నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతోపాటు హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగున్నాయి. ఇప్పటికే ఓటరు నమోదు కార్యక్రమం పూర్తి కావొచ్చింది. త్వరలో ఫైనల్ ఓటరు లిస్టును ఈసీ విడుదల చేయనుంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఆ రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ఉంటుందని టీఆర్ఎస్ లీడర్లు కలవరపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలనే ఆందోళనలో టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు.  వరంగల్​  టీఆర్​ ఎస్​సిట్టింగ్​సీటు కాగా, హైదరాబాద్​ బీజేపీ సిట్టింగ్​ సీటు. ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలపై త్వరలో సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది.  ఇప్పటిదాకా హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో టీఆర్ఎస్ గెలవలేదు.

నాగార్జునసాగర్‌లో  పరిస్థితి ఏంది?

నాగార్జునసాగర్  బై ఎలక్షన్ లో దుబ్బాక తరహా ఫలితం వస్తుందేమోనన్న భయం టీఆర్ఎస్  లీడర్లలో కనిపిస్తోంది. సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఏర్పడ్డ దుబ్బాక బై ఎలక్షన్ లో సానుభూతితో విజయం సాధించవచ్చన్న వ్యూహంతో ఆయన భార్యకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కానీ సానుభూతి పనిచేయలేదు. అక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్ విజయం సాధించారు. టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో త్వరలో నాగార్జునసాగర్ కు కూడా బై ఎలక్షన్​ జరుగనుంది. అక్కడ నోముల కుటుంబానికి టికెట్ ఇస్తే సానుభూతి పనిచేస్తుందా అనే కోణంలో టీఆర్​ఎస్​ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కానీ ఆ జిల్లాకు చెందిన కొందరు సీనియర్ లీడర్లు నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వొద్దని అభ్యంతరం చెప్తున్నట్టు సమాచారం.

దూకుడు మీదున్న బీజేపీ

దుబ్బాక బై ఎలక్షన్​లో విజయం సాధించి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు చుక్కలు చూపించిన బీజేపీ.. త్వరలో జరిగే ఎన్నికలపై కూడా ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు బీజేపీ సిట్టింగ్ స్థానం. మళ్లీ అక్కడ విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల్లో వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానంలో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఈసారి ఆ సీటును కూడా గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. గతంలోనే వరంగల్ కార్పొరేషన్ మేయర్ సీటును దక్కించుకున్న బీజేపీ.. ఈసారి అక్కడి కార్పొరేషన్​ ఎన్నికల్లోనూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు రెడీ అవుతోంది. ఖమ్మం సిటీలోనూ పార్టీకి అనుకూల పవనాలు ఉన్నాయని భావిస్తున్నది.

ఎన్నికలు జరగబోయే ఏరియాల్లో పర్యటనలు

మంత్రి కేటీఆర్ సోమవారం ఖమ్మం సిటీలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై లోకల్ లీడర్లతో ఆయన చర్చించే చాన్స్ ఉంది. ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపై వారి అభిప్రాయాలను తీసుకోనున్నట్లు తెలిసింది. త్వరలో వరంగల్ సిటీలో కేటీఆర్ పర్యటించి, ఎన్నికలపై అక్కడి లీడర్ల అభిప్రాయాలు తీసుకోనున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్​ ఈ నెల 10న సిద్దిపేటలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

 

Latest Updates