సీఏఏపై అసెంబ్లీలో నేతల అభిప్రాయాలు

అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన కేసీఆర్
బలపరిచిన కాంగ్రెస్, ఎంఐఎం.. బీజేపీ నిరసన
తీర్మాన ప్రతులను చించేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
దేశంలో ఎంతో మందికి బర్త్ సర్టిఫికెట్లు లేవ్: సీఎం
తీర్మానాలతో పని కాదు, జీవో విడుదల చేయాలి: భట్టి
దేశాన్ని బలహీనపరిచేలా ఆ చట్టం ఉంది: అక్బరుద్దీన్
ఒక్కరికి అన్యాయం జరిగినా రాష్ట్రం నుంచి వెళ్లిపోతా: రాజాసింగ్
సీఏఏపై తీర్మానం చేసిన ఎనిమిదో రాష్ట్రంగా తెలంగాణ
రిజిస్ట్రేషన్​ చార్జీలు పెంచుతం: సీఎం

హైదరాబాద్, వెలుగు: సీఏఏ, ఎన్​పీఆర్, ఎన్ఆర్సీ అమలును సమీక్షించాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సీఏఏను సవరించాలని సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ తర్వాత శాసనసభ ఆమోదముద్ర వేసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ తీర్మానానికి మద్దతు తెలపగా, బీజేపీ వ్యతిరేకించింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలోనే తీర్మానం ప్రతులను చించేసి నిరసన తెలిపారు. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ధోకా ఇస్తోందని, అబద్ధాలు చెబుతోందని స్పీకర్​ పోడియం దగ్గర ఆందోళన చేశారు. ఆయన నిరసన మధ్యే స్పీకర్​ తీర్మానాన్ని ఆమోదించినట్లు ప్రకటించారు.

గుడ్డిగా వ్యతిరేకించడం లేదు: సీఎం

అసెంబ్లీ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఏఏను గుడ్డిగా వ్యతిరేకించటం లేదని, అన్ని అంశాలు అర్థం చేసుకునే స్పష్టమైన అవగాహనతోనే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై కేబినేట్ తీర్మానం చేశామని, పార్లమెంట్ లో కూడా వ్యతిరేకించామని చెప్పారు. ‘‘తెలంగాణ కొత్త రాష్ట్రం. దేశానికి జీడీపీ ఎక్కువగా అందించే రాష్ట్రాల్లో రెండు, మూడు స్థానాల్లో ఉంటుంది. సీఏఏ వచ్చిన నాటి నుంచి బయటే కాదు సోషల్ మీడియాలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. సాధారణంగా విదేశీ అతిథులు మన దేశం వచ్చినప్పుడు ఎంతో సంయమనం పాటిస్తుంటం. కానీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఢిల్లీలో ఉన్నప్పుడే సీఏఏపై అల్లర్లు జరిగి 50 మంది చనిపోయారు. అవి మతకల్లోలాలా, వేరేవా.. ఏవైనా కావొచ్చు. సీఏఏపై ఎంపీలు, కేంద్ర మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అవన్ని విని చాలా బాధపడినం. ఇది దేశానికి మంచిది కాదు. తాత్కాలికంగా కొంత మందికి ప్రయోజనం కలిగించే ఈ చట్టం మంచిది కాదు. రాక్షసానందం మంచిది కాదు’’అని సీఎం కేసీఆర్ అన్నారు.

45 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, 35 ఏండ్లుగా ఏదో ఒక పదవిలో తాను ఉన్నానని, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదన్నారు. దేశంలో సాగునీరు, తాగునీరు, నిరుద్యోగం వంటి ఎన్నో కీలక అంశాలు ఉండగా వాటిని పక్కన పెట్టి అల్లర్లు, కల్లోలం సృష్టిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. ‘‘సీఏఏ హిందువులు, ముస్లింల సమస్యే కాదు. యావత్ దేశ సమస్య. నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు. ఈ విషయం మొన్న కూడా చెప్పిన. నాదే లేదు.. నా తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్ తెమ్మంటే ఏడనుంచి తేవాలె. నాకే కాదు దేశంలో కోట్ల మందికి ఈ సమస్య ఉంది. సీఎం అయిన నాకే లేదంటే సామాన్యులు, గిరిజనులు, దళితులు, ఓసీల్లో పేదవాళ్లు, సంచార జాతులు ఇలా సమాజంలో ఎంతో మంది ఉన్నరు. నీ బర్త్ సర్టిఫికెట్ ఎవరడిగారని ఓ వ్యక్తి అంటుండు. ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, పాన్ కార్డు దేశంలో ప్రతి వ్యక్తికి వీటిలో ఏదో ఒకటి ఉంటది. ఇవి చెల్లవని కేంద్రం అంటంది. కోట్ల మంది ఉన్న దేశంలో అందరికి కార్డులు ఇవ్వాలంటే సామాన్యమైన విషయం కాదు’’అని కేసీఆర్ పేర్కొన్నారు.

పలు రాష్ట్రాల్లో ఆందోళనలు, గొడవలు జరుగుతున్నాయని, షాన్ భాగ్ ఆందోళనలు, మేధావులు, మాజీ ఐఏఎస్ లు స్పందిస్తున్నారని, అవార్డులు వాపస్ చేస్తున్నారని, ఈ పరిణామాల వల్ల దేశప్రతిష్ట గంగలో కలుస్తోందన్నారు. ‘‘ప్రపంచంలో 180 దేశాలు ఉన్నయి. ప్రతి దేశంలో ఇండియన్స్ ఉన్నరు. పౌరసత్వం వద్దని ఎవరూ అనరు. చొరబాటుదారులను రమ్మని ఏ దేశం చెప్పదు. అమెరికాలో మెక్సికో దేశస్తులు రాకుండా ట్రంప్ గోడ కడుతుండు. మన దేశంలోకి ఇతర దేశస్తులు రాకుండా గోడ కడతామంటే ముందు నేనే మద్దతిస్తా. ఆర్మీ పుణ్యమా అని అందరం ప్రశాంతంగా జీవిస్తున్నం. సీఏఏను వ్యతిరేకించినా, వ్యతిరేకంగా మాట్లాడినా దేశ ద్రోహి అని, పాక్ ఏజెంట్ అని విమర్శిస్తున్నరు. ఇప్పుడు అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్నం, ఈ అసెంబ్లీ కూడా పాక్ ఏజెంట్ అయితదా? కేంద్ర మంత్రులు నాకు ఫోన్ చేశారు. వాళ్లకు దీనిని ఒప్పుకోమని ఖరాఖండిగా చెప్పిన’’అని కేసీఆర్ తెలిపారు.

అన్ని పార్టీలతో చర్చించాలి

సీఏఏపై కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించకుండా పార్లమెంట్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న, దేశంలో ఉన్న అన్ని పార్టీలతో చర్చలు జరపాలని కేసీఆర్ సూచించారు. 2003లోనే ఎంఎన్ఐసీ(మల్టీ నేషనల్ ఐడెంటిటీ కార్డ్) తేవాలని అప్పటి వాజ్​పేయి సర్కార్​ ప్రయత్నించి ఫెయిలైందని, 2014లో మోడీ ప్రభుత్వం సీఏఏని తెచ్చే ప్రయత్నాలు మళ్లీ స్టార్ట్ చేసిందన్నారు. ఎన్పీఆర్ అమలు చేస్తం, ఎన్సీఆర్ చేయం అని కేంద్రం చెబుతోందని, వారి మాటలను తాము నమ్మబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టిన రిపోర్టులో ఒకటి చెప్పి, మరో విధానం అమలు చేస్తోందని మండిపడ్డారు. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నా.. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని కేసీఆర్​ స్పష్టం చేశారు. సీఏఏను కేంద్రం పునసమీక్ష చేయాలని, ముస్లింలను మినహాయించటం రాజ్యాంగ వ్యతిరేక చర్యని, దేశ భవిష్యత్తుకు సీఏఏ మంచిది కాదని, అందరి అభిప్రాయాలు తీసుకుని సీఏఏలో సవరణలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

ఎన్‌‌పీఆర్‌‌ను నియంత్రిస్తాం: సీఎం కేసీఆర్

ఎన్​పీఆర్​ ప్రక్రియను రాష్ట్రంలో నియంత్రిస్తామని సీఎం కేసీఆర్​ అన్నారు. రాష్ట్రంలో ఎన్‌‌పీఆర్‌‌ చేపట్టకుండా స్టే ఇవ్వాలని అక్బరుద్దీన్‌‌ కోరగా సీఎం కేసీఆర్‌‌ స్పందిస్తూ ఎన్‌‌పీఆర్‌‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకోబోమని, కేరళ, వెస్ట్‌‌బెంగాల్‌‌లో ఎన్‌‌పీఆర్‌‌పై స్టే ఇచ్చారని, కేరళకన్నా మెరుగైన వ్యవస్థను రాష్ట్రంలో అమలు చేస్తామని సీఎం అన్నారు.

తీర్మానం చేసిన ఎనిమిదో రాష్ట్రం

సీఏఏపై తీర్మానం చేసిన 8వ రాష్ట్రం తెలంగాణ. ఫిబ్రవరి 16న ఈ తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించగా.. నెల తర్వాత అసెంబ్లీ ఆమోదించింది. సీఏఏపై ఇప్పటికే మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, బీహార్ తీర్మానం చేశాయి.

అన్ని కులాలకు వ్యతిరేకం:ఒవైసీ

సీఏఏ అన్ని కులాల ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, మతాలను విడదీస్తోందని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. సీఏఏపై దేశవ్యాప్తంగా పలు చోట్ల జరిగిన అల్లర్లలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ప్రశాంతంగా ఉన్న దేశంలో అశాంతిని రగిల్చిందని మండిపడ్డారు. అసెంబ్లీలో సీఏఏ తీర్మానంపై ఒవైసీ మాట్లాడుతూ.. వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానున్న ఎన్పీఆర్ పై ముందుకెళ్లొద్దని, ఈ పక్రియ ఆపేస్తూ జీవో విడుదల చేయాలని సూచించారు. సీఏఏపై గోడవల్లో మరణించిన వారికి, వర్సిటీల్లో జరిగిన అల్లర్లకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అన్ని మతాలకు కేసీఆర్ ప్రభుత్వం సమాన హక్కును కల్పిస్తోందని, ప్రజల మధ్య విభేదాలు లేకుండా పాలన చేస్తోందని, కాబట్టి టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ప్రజల సెంటిమెంట్ తో మోడీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, ఇవాళ ఎన్పీఆర్, రేపు ఎన్సీఆర్, తర్వాత సీఏఏ అమలు చేస్తారని, ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని అన్నారు.

ఎన్నో సందేహాలున్నాయి: భట్టి

అసెంబ్లీ తీర్మానాలతో పని కాదని, సీఏఏ అమలు చేయబోమని కేరళ మాదిరిగా జీవో విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటికి ఎన్నో అంశాలపై తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని, వీటిలో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు, ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల భూమిని ఏపీకి అప్పగించొద్దనే తీర్మానాలు ఉన్నాయని చెప్పారు. సీఏఏ తీర్మానంపై చర్చలో భట్టి మాట్లాడారు. రాష్ట్రంలో చాలా మంది ప్రజాప్రతినిధులకే బర్త్ సర్టిఫికెట్లు లేవని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తనకు, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, సీతక్కకూ బర్త్ సర్టిఫికెట్లు లేవని, తన ఎత్తు చూసి ఫలానా ఏడాది పుట్టినట్లుగా పెద్దలు ధ్రువీకరించారని చెప్పారు. ఎన్పీఆర్, -ఎన్ఆర్సీ, -సీఏఏపై ప్రభుత్వ తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తోందని చెప్పారు. ఈ చట్టంలో ఎన్నో సందేహాలు ఉన్నాయని, వేటికి కూడా కేంద్రం జవాబు ఇవ్వటం లేదని ఆరోపించారు.

అన్యాయం జరిగితే రాష్ట్రం నుంచి వెళ్లిపోతా: రాజాసింగ్

సీఏఏతో ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇబ్బందులు ఎదురవుతాయని ప్రచారం చేస్తున్నారని, ఈ యాక్ట్​ వల్ల ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్రం నుంచి బయటికి వెళ్లిపోతానని ఎమ్మెల్యే రాజాసింగ్​ సవాల్​ విసిరారు. సీఏఏ తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. సీఏఏ గురించి ఏ ముస్లిం భయపడొద్దని చట్టంలో ఉన్నా.. రాష్ట్ర ప్రజలను ధోకా చేస్తున్నారని మండిపడ్డారు. 2011లోనూ ఎన్​పీఆర్​ అమలు చేశారని, అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు వచ్చిందన్నారు. కొందరు రాజకీయ దురుద్దేశంతో సీఏఏను విమర్శిస్తున్నారని ఆరోపించారు. ‘‘సీఏఏతో ముస్లింలు, ఇతర ఏ కులాలవారు భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా చెప్పారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. 25,447 మంది హిందువులు, 5,087 సిక్కులు, 55 మంది క్రిస్టియన్లు, ఇద్దరు పార్సీలు మన దేశంలో శరణార్థులుగా ఉన్నారు. వీళ్లకు ఇండియన్​ సిటిజన్​ షిప్​ ఇచ్చేందుకు సీఏఏను తీసుకొచ్చింది”అని రాజాసింగ్​ వివరించారు. ఎన్​ఆర్సీపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ దానిపై ఎందుకు చర్చిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

తీర్మాన ప్రతుల చించివేత

రాజాసింగ్ మాట్లాడుతుండగా టైం అయిపోయిందని స్పీకర్ మైక్ కట్ చేయడంతో ఆయన తీర్మాన ప్రతులను చింపి విసిరి నిరసన తెలిపారు. స్పీకర్​ పోడియం వద్దకు వెళ్లి అబద్ధాలు మాట్లాడుతున్నారు.. ప్రజలను మోసం చేస్తున్నారంటూ నినాదాలు చేశారు. స్పీకర్ సర్ది చెప్పినా ఆయన వినలేదు. దీంతో స్పీకర్​ సీఎంకు అవకాశమిచ్చారు. ప్లీజ్​ గో బ్యాక్​ టు యువర్​ సీట్ అంటూ రాజాసింగ్​కు సీఎం సూచించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఇది నడుస్తనే ఉంటదని, అన్ని పార్టీల వాళ్లు చెప్పింది తాను విన్నానని, నోట్​ చేసుకున్నానని తీర్మానం పాస్​ చేయాలని స్పీకర్​ను కోరారు. తీర్మానానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు మద్దతు తెలపగా స్పీకర్​ ఆమోదించారు.

Latest Updates