బ్రిడ్జి కోసం ఊరంతా వాగు దగ్గరే!

బ్రిడ్జి కోసం ఊరంతా వాగు దగ్గరే!

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: అది కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని దిందా గ్రామం. ఊరికి చెందిన సుమారు 200 మంది జనం పిల్లాపాపలు, వృద్ధులతో కలిసి వారం రోజులుగా వాగు వద్ద రిలే దీక్ష చేస్తున్నారు.  పగలు, రాత్రి తేడా లేకుండా అక్కడే ఉంటున్నారు. ఎండకు ఎండుతూ వానలో తడుస్తూ,  కలెక్టర్​ వస్తే తప్ప కదలబోమని భీష్మించుకొని కూర్చున్నారు.
ఇదీ సమస్య..
దిందా గ్రామానికి ఉత్తరాన ప్రాణహిత ఎప్పుడూ పారుతూ ఉంటుంది. దక్షిణాన ఉన్న అడవికి, ఊరికి మధ్య ఓ వాగు ఉంది. ఈ వాగు దాటితే తప్ప ఊరిలోకి రాలేరు. కానీ ప్రతి వానకాలం ఈ వాగులో ప్రవాహం పెరిగి దాటనిస్తలేదు. ఈసారి కూడా ఇదే పరిస్థితి ఎదురై గ్రామానికి రాకపోకలు బంద్​అయ్యాయి. వాగుపై వంతెన కట్టాలని దశాబ్దాలుగా గ్రామస్తులు డిమాండ్​చేస్తున్నారు. పలుసార్లు ఆందోళన చేయగా కేంద్ర సర్కారు స్పందించింది. ‘ప్రధాన మంత్రి గ్రామీణ్​ సడక్ యోజన’ కింద  బ్రిడ్జి నిర్మాణం కోసం మూడేండ్ల కింద రూ. 3 కోట్లు మంజూరు చేసింది. కానీ ఇక్కడ బ్రిడ్జి కట్టేందుకు ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​అనుమతులు ఇవ్వడం లేదు. ఆఫీసర్లు కూడా పట్టించుకోకపోవడంతో బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయింది. దీంతో అత్యవసర సమయాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గ్రామస్తులు వాగు దాటుతున్నారు. 2015 ఆగస్ట్ 14న గ్రామానికి చెందిన దోకే రామకృష్ణ అనే ఎంబీఏ స్టూడెంట్ వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు. అప్పట్లో లోకల్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బ్రిడ్జి నిర్మాణం కోసం హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదు. దీంతో ఈసారి ఊరు ఊరంతా వాగు దగ్గరే దీక్షలకు దిగారు. కలెక్టర్​ వచ్చి బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చే దాకా అక్కడి నుంచి కదలబోమని స్పష్టం చేస్తున్నారు. 

వాగు దాటనిస్తలేదు 
దిందా  గ్రామానికి వెళ్లాలంటే ఇదొక్కటే దారి. మధ్యలో వాగు అడ్డంగా ఉంది. దీంతో వానకాలంలో నాలుగు నెలల పాటు వాగు దాటనిస్తలేదు. పాము కుట్టినా, రోగమచ్చినా, గర్భిణులు డెలివరీలకు పోవాలన్నా కష్టమైతాంది. నాకు జ్వరం వస్తే అష్టకష్టాలు పడి వాగుదాటి కర్జేలికి పోయి చూయించుకొని వస్తున్న. ఇప్పటికైనా బ్రిడ్జి కట్టాలె.                                        - రంగుబాయి, గ్రామస్తురాలు


కాలేజీకి పోయినంక వానొస్తే కష్టమే
నేను కౌటాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న. వచ్చేటప్పుడు ఎలాగోలా వాగుదాటి నాలుగు కిలోమీటర్లు నడిచి కేతిని నుంచి బస్సులో పోతున్న. కాలేజీకి పోయిన తర్వాత వర్షం పడితే వాగు ఉప్పొంగుతుంది. దీంతో వాగుదాటి ఇంటికి పోలేక కేతినిలో తెలిసిన వాళ్ల ఇంటికాడ ఉంటున్న.                                                                          - సాయికుమార్, ఇంటర్ స్టూడెంట్, దిందా