గడ్డి పరకే కదా అనుకోలేదు.. దాంతోనే అద్భుతాలు చేస్తూ లక్షల సంపాదన

ఎలిఫెంట్ గ్రాస్ తో ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్టులు

ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టింది ఉషారాణీ నాయక్​.పేదరికం వల్ల చిన్నతనంలోనే చదువుకి దూరమయింది. పెళ్లాయ్యాక తన కష్టాలన్నీ తీరపోతాయి అనుకుంది. కానీ, అత్తగారింట్లోనూ  అవే ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. ఆ పరిస్థితుల్ని మార్చాలనుకుంది.. ప్రతి అడుగుకి అడ్డంకులు ఎదురయ్యాయి.. అయినా అధైర్యపడలేదు. అత్తమామలు వద్దని వారించినా. ఆడవాళ్లకి  వ్యాపారాలేంటని ఊరంతా వ్యతిరేకించినా వెనకడుగేయలేదు.. ఊళ్లోని ఆడవాళ్లందరినీ ఒప్పించి ముందుకు నడిచింది..ఇప్పుడు లక్షల్లో ఉంది వాళ్ల సంపాదన…

గడ్డి పరకే కదా అని తీసి పక్కన పెట్టలేదు  ఆమె. దాంతోనే అద్భుతాలు చేసి చూపెట్టింది. తనకి తెలిసిన విద్యని నలుగురికీ పంచుతూ ఊళ్లోని ఆడవాళ్లకి ఓ దారి చూపించింది. ఎవరూ పెద్దగా పట్టించుకోని ఎలిఫెంట్ గ్రాస్ తో వేలల్లో సంపాదిస్తున్నారు ఇప్పుడు వాళ్లంతా.. ఒడిశా రాష్ట్రం, మయూర్ భంజ్ జిల్లాలోని గుజల్దిహి అనే ఓ చిన్న ఊళ్లో  మొదలై దేశవ్యాప్తంగా పాపులర్​ అయిన వీళ్ల   గురించి మరిన్ని విషయాలు..

గడ్డితో డబ్బు సంపాదించటం అంత ఈజీగా జరిగిపోలేదు. దీని వెనుక ఉషారాణీ నాయక్ అనే  మహిళ ఒంటరి పోరాటం ఉంది. ఆమె పడిన అవమానాలున్నాయి. ఆ ఊరి చుట్టుపక్కల పెరిగే సబాయి గడ్డి (ఎలిఫెంట్ గ్రాస్)తో ఎకోఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని తయారు చేసి  రెండు వందల మందికి ఉపాధి చూపించడానికి ఒక చిన్నపాటి యుద్దమే చేయాల్సి వచ్చింది ఈమె .

ఏదైనా చేయాలనుకుంది

ఒడిశాకి చెందిన ఉషారాణీ నాయక్​ ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. దాంతో చిన్నతనం నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడింది. పెళ్లయ్యాక కూడా ఆర్థిక పరిస్థితులు మరీ గొప్పగా ఏం లేవు. తినటానికి తిండి,కట్టుకోవటానికి బట్టల వరకూ లోటు లేదు కానీ నాలుగు డబ్బులు వెనకేసుకోవడం లేదు. దాంతో ఏదో ఒక పనిచేసి డబ్బు సంపాదించాలనుకుంది. అయితే,  అత్తగారింట్లో ఒప్పుకోలేదు. ఆడవాళ్లు పని చేసి కుటుంబం నడపడం ఏంటి? అన్న ప్రశ్నలు వచ్చాయి.  అయినా సరే నిరుత్సాహపడలేదు ఆమె. అత్తమామలు వ్యతిరేకించినా తన కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టడానికి తనవంతుగా ఏదైనా చేయాలనుకుంది.

నష్టాలొచ్చాయి

ఆ ఆలోచనతోనే  2001లో తన గ్రామంలో స్వయం సహాయక బృందాలను (ఎస్‌‌హెచ్‌‌జి) మొదలు పెట్టింది. తనతో మొదట కలిసి వచ్చిన వాళ్లు పదిమంది మాత్రమే. ఈ పదిమందీ అక్కడ దొరికే సబాయి గడ్డిని తెచ్చుకొని తాళ్లు పేనటం మొదలు పెట్టారు. ఇది ఆఫ్రికాకు చెందిన ఎలిఫెంట్ గ్రాస్ జాతికి చెందింది. దాదాపు మనిషంత ఎత్తు పెరిగే ఈ గడ్డి మయూర్ భంజ్ జిల్లాలో  ఎక్కువగానే దొరుకుతుంది. ఈ గడ్డితో తాడు పేనుకోవటం అక్కడి వాళ్లకి అలవాటే కానీ దాన్ని కూడా మార్కెట్ చెయ్యొచ్చని నిరూపించింది ఉషారాణే. పేనిన తాళ్లని మయూరభంజ్‌‌ సబాయి ఫార్మర్స్‌‌ ప్రొడ్యూసర్‌‌ కంపెనీ లిమిటెడ్‌‌’ లో అమ్మేవాళ్లు వీళ్లు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత తర్వాత అందులో ఉన్న కష్టం  అర్థమయ్యింది. గడ్డి తేవటం దాన్ని తాళ్లుగా పేనటం, ప్యాక్ చేసి కంపెనీకి అమ్మడం.. ఇంత కష్ట పడితే వీళ్లకు ముట్టేది మాత్రం చాలా తక్కువ.

అప్పే మిలిగింది

ప్రొడక్షన్​ బాగానే ఉన్నా వాటిని మార్కెట్ చేయడం  ఒక సవాలుగా మారింది ఉషారాణి టీమ్​కి. సరిగ్గా ఆ టైంలోనే కటక్‌‌లో జరిగిన ఓ ఎగ్జిబిషన్‌‌లో  వీళ్లు తయారుచేసిన వస్తువుల్ని ప్రదర్శించే అవకాశం వచ్చింది. కొన్ని గంటల్లోనే దాదాపు 20 వేల ఆదాయం వచ్చింది.  కానీ, ఎగ్జిబిషన్​ నిర్వాహకులు వస్తువులు క్వాలిటీ లేవనే  కుంటి సాకుతో వీళ్ల కష్టాన్ని దోచుకున్నారు. వాళ్ల దగ్గరున్న ఇరవై వేలకు తోడు మరో నలభైవేల రూపాయలు కట్టించుకున్నారు. అప్పటి వరకూ లాభాలు మాత్రమే లేవు అన్న బాధకు నలభై వేల రూపాయల అప్పు కూడా చేరడంతో ఆడవాళ్లంతా కుంగిపోయారు. ఉషారాణి కూడా ఒకింత డిప్రెషన్​లోకి వెళ్లింది..

అవమానించారు

ఆడవాళ్లని పోగేసి డబ్బులు దోచుకుంటోందనీ, వాళ్లని  తప్పుడు తోవల్లోకి తీసుకుపోతోందనీ అవమానాలు మొదలయ్యాయి ఉషారాణికి. కానీ, ఆమె తన పనిని వదులుకోలేదు. ఒడిశా గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్‌‌ సొసైటీ వాళ్ల సాయంతో రెండేళ్లలో మళ్లీ టీంని తయారుచేసింది. కొద్దిరోజుల్లోనే అప్పుని తీర్చేసి లాభాల బాట పట్టింది. ఇప్పుడు ఉషారాణి టీంలో దాదాపు 200 మంది ఉన్నారు.

సక్సెస్

2019 లో ఉషారాణి టీం దాదాపు 30 లక్షల విలువైన ప్రొడక్ట్స్​ ని మార్కెట్ చేసింది.  పెట్టుబడులు, ఖర్చులూ పోను 19 లక్షలకు పైగా లాభాలు పొందారు వీళ్లు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రం బారిపాడ, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌‌లోని ‘మయూరశిల్ప’ లాంటి   హస్తకళా అవుట్​లెట్లలోనూ   ప్రొడక్ట్స్ అమ్మే స్థాయికి వచ్చారు  వీళ్లు ఇప్పుడు .

బిగ్​ టార్గెట్

రీసెంట్​గా రూ.25 లక్షల విలువైన ఉత్పత్తులను మూడు నెలల్లో పంపిణీ చేయాలని ఆర్డర్‌‌ వచ్చింది ఉషారాణి టీమ్​కి. అప్పటివరకూ వచ్చిన సింగిల్‌‌ ఆర్డర్లలో  ఇదే పెద్దది. దీనికోసం ఉషా చుట్టు పక్కల గ్రామాల్లో మరో ఆరు మహిళా గ్రూపులను తయారు చేసి, వాళ్లకి ట్రైనింగ్ ఇచ్చింది. అంతా కలిసి ఇప్పుడు ఆ ఆర్డర్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.

ఎందరికో ఇన్సిపిరేషన్

ఒకప్పుడు ఉషారాణిని ఎగతాళి చేసి, అవమానించిన వాళ్లే ఇప్పుడు  పనికోసం ఆమె దగ్గరికి వస్తున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల ఆదాయం కాస్త తగ్గింది. కానీ, వాళ్లలో పట్టుదల మాత్రం అలానే ఉంది .​  ఆన్‌‌లైన్‌‌ ఫ్లాట్‌‌ఫామ్స్​లోనూ  వాళ్ల ప్రొడక్ట్స్​ని అందుబాటులో ఉంచే ప్రయత్నాల్లో ఉంది ఉషారాణి  టీం..

ఏదైనా కొత్తగా

ఎంత కష్టపడ్డా ఐదు పదికి మించి మిగలట్లేదు. పైగా కుటుంబ సభ్యుల నుంచి ఎగతాళి మాటలు. దాంతో  ఆ బిజినెస్​ పక్కనపెట్టి పౌల్ట్రీ, మేకలను పెంచడం, పుట్టగొడుగులను పండించడం లాంటి పనులు చేశారు. కానీ అందులోనూ  ఆదాయం అంతంత మాత్రంగానే వచ్చింది. దాంతో తేనెటీగల పెపంకం వైపు మళ్లారు. కానీ ఆ ఊరి ఆచారం ప్రకారం ఆడవాళ్లు తేనె తీయకూడదు. అలాంటిది తేనెటీగలుపెంచి, తేనె తయారీ అంటే గ్రామంలోని పెద్దలు, మగవాళ్లు వ్యతిరేకించారు.  దాంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు ఆడవాళ్లంతా. ఆ టైంలోనే ఉషారాణి వాళ్లలో ధైర్యం నింపి సబాయి తాడు తయారీ వైపే మళ్లీ అడుగులేయించింది. అయితే ఈసారి కేవలం తాళ్లు పేనటమే కాదు సన్నగా పేనిన తాళ్లతో  రకరకాల వస్తువుల్ని తయారుచేయడం మొదలుపెట్టారు. దీనికోసం జిల్లా పారిశ్రామిక కేంద్రం హెల్ప్ తీసుకున్నారు . ఆరు నెలల ట్రైనింగ్ ప్రోగ్రాం  ఏర్పాటు చేశారు. ఈసారి ఈ పదిమందికి ఇంకో అరవైమంది కలిశారు.  కోస్టర్స్‌‌, బుట్టలు, మాట్స్‌‌, స్టాండ్‌‌, బూట్లు లాంటి ప్రోడక్ట్స్ తయారు చేయటం మొదలైంది.

Latest Updates