ప్రపంచాన్ని వణికించిన వైరస్ లు ఇవే..!

వైరస్ ఎప్పుడూ డేంజరే. ఏ రూపంలో అయినా ఎటాక్ చేయొచ్చు. జంతువుల ద్వారా దాడి చేయొచ్చు. గాల్లో కలిసిపోయి రావచ్చు. కంట్రోల్ చేద్దామంటే వ్యాక్సిన్​లుండవు. ఈ మహమ్మారి గురించి అవగాహన పెంచుకునేలోగానే వందలు, వేలాదిమంది ప్రాణాలు కోల్పోతారు. ఆ మధ్య వచ్చిన ఎబోలా కావచ్చు. నిన్న వచ్చిన నిఫా కావచ్చు. మధ్య మధ్యలో జనాన్ని వణికించిన స్వైన్​ ఫ్లూ లాంటివి, లేటెస్ట్​గా వచ్చిన కరోనా కావచ్చు. ఏదైనా యమ డేంజరే. ప్రపంచాన్ని వణికించిన ప్రమాదకర వైరస్​లు కొన్ని…

ఆఫ్రికాలో పుట్టిన ఎబోలా

మూడు నాలుగేళ్ల క్రితం ఎబోలా వైరస్​ పేరు చెబితే ఆఫ్రికా వణికిపోయింది. 2013 నుంచి 2016 వరకు పశ్చిమాఫ్రికాలో ఈ వైరస్​ బాగా విస్తరించింది. ఎబోలా.. ఇది ఒక  డేంజరస్ వైరస్. ఆఫ్రికాలో పుట్టి ప్రపంచాన్ని వణికించింది.  ఎబోలా వైరస్​ను 1976లో తొలిసారి గుర్తించారు. సౌత్ సూడాన్​లోని జారా అనే ఒక పట్టణంలో ఈ వైరస్​ను గుర్తించారు. ఎబోలా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన జంతువుల రక్తం లేదా సలైవా (చొంగ) ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.

డెంగీ ఒక వైరల్ జ్వరం

డెంగీ వైరస్​ ప్రభావం మన దేశంలో 2016లో బాగా ఎక్కువగా పడింది. న్యూఢిల్లీ, కేరళలో దాదాపు 1500 మందికి సోకినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. డెంగీ జ్వరాలు సోకని రాష్ట్రం లేనే లేదు. 1970కు ముందు డెంగీ వైరస్ కేవలం తొమ్మిది దేశాలలోనే ఉండేది. అయితే, ఆ తరువాత ఈ వైరస్ వంద దేశాల్లో విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కిందటేడాది ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో డెంగీ మరోసారి విజృంభించింది.  బంగ్లాదేశ్​లో ఎక్కువ కేసులు (1,01,000) రిపోర్ట్ అయ్యాయి. డెంగీ వైరస్   వైరల్ జ్వరం రూపంలో మనుషుల ప్రాణాలు తీస్తుంది.

కీళ్ల నొప్పుల చికున్ గున్యా

చికున్​గున్యా వైరస్​తో జ్వరాన పడ్డవాళ్లు ఓ పట్టాన కోలుకునేవారు కాదు. దీనివల్ల కీళ్లనొప్పులు చాలా ఎక్కువగా వచ్చేవి. 2013–2017 మధ్య కాలంలో ఇండియాలో 70 శాతం మేర చికున్​గున్యా సోకింది.  కేసుల సంఖ్యకూడా 65 వేలకు పైగా నమోదయ్యాయి. చికున్ గున్యా వ్యాధి ఎడిస్ దోమ వల్ల వస్తుంది. మొట్టమొదటిసారి 1953 లో టాంజానియాలో ఈ వ్యాధిని గుర్తించారు.  తీవ్రమైన కీళ్ల నొప్పులు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. మనిషి పట్టుమని నాలుగు అడుగులు కూడా వేయలేడు.

చిన్నారులపై జికా ప్రభావం

జికా వైరస్​ 2017లో మన దేశాన్ని తాకింది. మొదట రాజస్థాన్​లోని జైపూర్​లో దీని తీవ్రతను గుర్తించారు. దాదాపుగా 100మంది వరకు జికా బారినపడ్డారు. పొరుగున ఉన్న గుజరాత్​లోనూ ఇది ఎఫెక్ట్ చూపించింది. జికా వైరస్​ను 1947లో ఉగాండాలో తొలిసారి గుర్తించారు. ఆ తరువాత అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 86 దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది.

గొర్రెల నుంచి  మనిషికి ఆంత్రాక్స్

సౌత్​ ఇండియాపై ఎక్కువగా విరుచుకుపడిన వైరస్​లలో ఆంత్రాక్స్​ ఒకటి.  ఛత్తీస్​గఢ్​లో 2007లో దీనిని గుర్తించారు. అక్కడి నుంచి ఇతర చోట్లకు ఇది పాకింది. ఆంత్రాక్స్ ఒక అంటువ్యాధి. ‘బాసిల్లస్ ఆంత్రసిస్’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా గొర్రెల నుంచి మనుషులకు వస్తుంది. దీంతో ఆంత్రాక్స్ వ్యాధి సోకిన గొర్రెల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు.

కేరళను కుదిపేసిన ‘నిఫా

రెండేళ్ల క్రితం నిఫా వైరస్​ కేరళలో చాలా ఎక్కువగా సోకింది. ఈ వైరస్​ మలేసియా, సింగపూర్​లలో వందలాది మందిని బలి తీసుకుంది. 2001వ సంవత్సరంలో బంగ్లాదేశ్​లోకి, అక్కడినుంచి పశ్చిమ బెంగాల్​లోకి ప్రవేశించింది. 2018లో కేరళను కుదిపేసింది. మలేసియాలో 1999లో నిఫా వైరస్​ను తొలిసారి గుర్తించారు. ఆ తరువాత సింగపూర్​లోకి ఎంటరైంది. ఈ వైరస్ బారినపడి ఈ రెండు దేశాల్లోనూ వందమందికి పైగా చనిపోయారు.

కుక్కకాటుతో వచ్చే రేబిస్ వ్యాధి

రేబిస్ కూడా వైరస్ వ్యాధే. కుక్క కాటు వల్ల వస్తుంది. రేబిస్ రోగాన్ని కలుగచేసే  క్రిమిని ‘లిస్సా వైరస్’ అంటారు. ఇది జంతువుల లాలాజలంలో ఉంటుంది. ఈ క్రిమి ఉన్న కుక్క మనిషిని కరిచినా లేదా శరీరంమీద గాయాలున్న చోట టచ్​ చేసినా దాని ద్వారా శరీరంలోకి వైరస్ ప్రవేశిస్తుంది.

Latest Updates