చోరీ చేసి పారిపోతుంటే పట్టుకున్నరు

  • దంపతుల దగ్గరి నుంచి  రూ.8లక్షలున్న బ్యాగ్ ని  ఎత్తుకెళ్లిన యువకుడు
  • పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు
  • మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద ఘటన

మహేశ్వరం,వెలుగు: భూమిని కొనేందుకు వచ్చిన దంపతులు దగ్గరి నుంచి రూ.8లక్షలున్న బ్యాగ్‌‌‌‌ ని చోరీ చేసి పారిపోతున్న యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..కడ్తాల్ మండలం మాదారం అనుబంధ గ్రామమైన రేఖ్యాతండాకు చెందిన కేతావత్ శ్రీను, తులసి దంపతులు ఓ భూమి కొనేందుకు మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు దగ్గరికి వచ్చారు. తులసి చేతిలో ఉన్న బ్యాగ్ లో రూ.8లక్షల 26 వేల డబ్బు ఉంది.  దీన్ని గమనించిన ఓ యువకుడు తులసి చేతిలో ఉన్న బ్యాగ్ ను లాక్కొని పరుగులు తీశాడు. తులసి అరవడంతో అప్రమత్తమైన స్థానికులు ఆ దొంగను వెంబడించి పట్టుకున్నారు. బ్యాగ్ ని ఆ దంపతులకు అందించి..పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాగ్ ఎత్తుకెళ్లేందుకు యత్నించిన ఆ యువకుడు  కందుకూరు మండలం మురళీనగర్ కి చెందిన మెగావత్ అనిల్ కుమార్ గా గుర్తించారు.  అనిల్ కుమార్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకన్న నాయక్ తెలిపారు.

Latest Updates