లాక్​డౌన్​లో 9 వేల కోట్లు నష్టపోయిన సినీరంగం

పెద్ద సినిమాలు వస్తేనే థియేటర్స్​ ఓపెన్​..

తేల్చిచెబుతున్న తెలంగాణ, ఏపీ ఎగ్జిబిటర్లు

పాత సినిమాలతోనే తెరుచుకున్న  బాలీవుడ్​

బిజినెస్‌‌ డెస్క్, వెలుగు: తెలంగాణ, ఏపీలలో థియేటర్లు ఓపెన్ చేసేందుకు ఓనర్లు ఆసక్తి చూపడం లేదు. కర్నాటక మినహా తమిళనాడు, కేరళలలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద స్టార్లకు చెందిన కొత్త సినిమాలు వస్తే తప్ప థియేటర్లు ఓపెన్ చేయమని ఓనర్లు తేల్చి చెబుతున్నారు. కరోనా లాక్‌‌డౌన్ ఆంక్షల తర్వాత థియేటర్ల ఓపెన్‌‌కు మోడీ ప్రభుత్వం ఈ నెల మొదట్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ, దక్షిణాదిలో థియేటర్ ఓనర్లు మాత్రం ఆపరేషన్స్‌‌ను తిరిగి ప్రారంభించేందుకు  ముందుకు రావడం లేదు. సౌత్ ఇండియాలో  సింగిల్ స్క్రీన్ ఓనర్లు కొత్త కంటెంట్, కొత్త టైటిల్స్‌‌తోనే థియేటర్లు ఓపెన్ చేయాలని కంకణం కట్టుకున్నారు. పాత సినిమాలతో థియేటర్లు ఓపెన్ చేయమని తేల్చి చెబుతున్నారు. పెద్ద స్టార్ల సినిమాలతోనే సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీసు దద్దరిల్లుతుంది. ఈ క్రమంలో భాగంగా పెద్ద టిక్కెట్ ఆఫరింగ్స్ కోసం థియేటర్ ఓనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెద్ద స్టార్లతో తెరకెక్కుతోన్న సినిమాలు కొన్ని పూర్తి కాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. తమిళనాడులోని థియేటర్లు ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు తాజా తమిళ్ కంటెంట్‌‌తోనే ఓపెన్ అవుతాయని ఇండిపెండెంట్ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిళ్లై చెప్పారు. పాత  సినిమాలను రన్ చేసేందుకు  థియేటర్ ఓనర్లు సిద్ధంగా లేరని అన్నారు. ప్రస్తుతం ఆరు నుంచి ఎనిమిది కొత్త సినిమాలు సెన్సార్ అయి ఉన్నాయి. అవి విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు పిళ్లై ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ విజయ్‌‌కు చెందిన ‘మాస్టర్’, అజిత్ ‘వాలిమై’, స్పై థ్రిల్లర్ ‘ధ్రువ నక్షత్రం’లు మాత్రమే కాక సూర్య ‘ఇరావకాలం’ కూడా బిగ్ స్క్రీన్‌‌పై  విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ‘మాస్టర్’ సినిమాను కేవలం థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని  ఇప్పటికే ఈ సినిమా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ చెప్పారు.   సౌత్ ఇండియాలో 70 శాతం నుంచి 75 శాతం వరకు ఎగ్జిబిషన్ సెక్టార్ సింగిల్ స్క్రీన్లతోనే నడుస్తోంది. మిగిలినవి మల్టిఫ్లెక్స్‌‌లని ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్స్‌‌పర్ట్ ఒకరు చెప్పారు.  బాలీవుడ్ మాదిరిగా కాకుండా సౌత్ ఇండస్ట్రీలో ఫిల్మ్‌‌ ఇండస్ట్రీ డిఫరెంట్‌‌గా ఆలోచిస్తోంది. థియేటర్ల ఓపెన్‌‌కు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వగానే బాలీవుడ్ ఇండస్ట్రీ థప్పడ్, కబీర్ సింగ్, కేదర్‌‌‌‌నాథ్ వంటి సినిమాలను రన్ చేస్తూ థియేటర్లు ప్రారంభించారు. అయితే పాత బ్లాక్‌‌బస్టర్ సినిమాలతో థియేటర్లు ప్రారంభించేందుకు తెలంగాణ, ఏపీ ప్రొడ్యూసర్లతో పాటు సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. కర్నాటకలో మాత్రమే థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళలలో థియేటర్లు ఇంకా ఓపెన్ కాలేదు. పాత సినిమాలతో థియేటర్లు ఓపెన్ అయిన ప్రేక్షకులు  రావడం లేదు. వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ వ్యాపారాలు తిరిగి సాధారణ స్థితికి రావడం  చాలా నిదానంగా సాగుతుందని చెన్నైలోని వెట్రీ థియేటర్స్ ఎం.డి రాకేశ్ గౌతమన్ అన్నారు.

రికవరీకి కనీసం రెండేళ్లు…

మరోవైపు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కరోనా వైరస్ దెబ్బ నుంచి ఆర్థికంగా రికవరీ కావాలంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుందని ఈ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లు కరోనా లాక్‌‌డౌన్‌‌తో మూతపడటంతో వేల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. సినిమా హాల్స్‌‌కు రావాలని ప్రస్తుతం ప్రజలను వేడుకోవాల్సి వస్తోందని ఈ ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తి చెప్పారు. సినిమాలకు ఇది చాలా కష్ట కాలమని అన్నారు. లాక్‌‌డౌన్ ఆంక్షలతో థియేటర్లు మూతపడ్డ ఆరు నెలల కాలంలో ఇండస్ట్రీకి రూ.9 వేల కోట్ల నష్టం వచ్చినట్టు అంచనాలున్నాయి. అయితే ఈ నష్టాల నుంచి సినిమా హాల్స్ రికవరీ అవుతాయని, కానీ ఎంత టైమ్ పడుతుందనేది  అవసరమని పీవీఆర్ సినిమాస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లి అన్నారు. థియేటర్ ఓనర్లకు, ప్రొడ్యూసర్లకు మధ్య ఎంతో కాలంగా సాగుతోన్న వర్చ్యువల్ ప్రింట్ ఫీజు విషయంపై కూడా సినిమాల రికవరీ ఆధారపడి ఉంటుందని ట్రేడ్ అనలిస్ట్ పిళ్లై చెప్పారు. ఫిజికల్ ప్రింట్స్‌‌ను డిజిట్ ప్రొజెక్టర్స్‌‌తో రీప్లేస్ చేసినప్పుడు.. వాటికయిన ఖర్చునంతా ప్రొడ్యూసర్లే భరించారు. వారి రెవెన్యూలు బాగా దెబ్బతిన్నాయి.  కానీ ఈ వర్చ్యువల్ ప్రింట్ ఫీజుల విషయంలో థియేటర్లకు, ప్రొడ్యూసర్లకు అప్పటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. థియేటర్ ఓనర్లతో నెలకొన్న ఈ సమస్యను పరిష్కరించుకునే దాక ఎలాంటి కొత్త ఫిల్మ్ విడుదల ఉండదని అసోసియేషన్ ఆఫ్ యాక్టివ్ తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు.

For More News..

మున్సిపల్​ ఆఫీసులో కొట్టుకున్న టీఆర్ఎస్​ కౌన్సిలర్లు

వరుస పండుగలతో కరోనా పైపైకి! ఐదు రోజుల్లో 6,798 మందికి వైరస్​

Latest Updates