జగిత్యాల జిల్లాలో దొంగల బీభత్సం

ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న భార్యాభర్తలను కొట్టి చోరీకి పాల్పడ్డారు.  ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని సింగపూర్ లో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం..  సింగపూర్ లో నివసిస్తున్న గోపెనవేని రాజశేఖర్, నగేశ్​ అన్నదమ్ములు. ఇద్దరూ  పక్క పక్క ఇళ్లలో ఉంటున్నారు. నగేశ్​ ఉపాధి నిమిత్తం  గల్ఫ్ కు వెళ్లాడు. రాజశేఖర్  కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. నగేష్ భార్య వందన పది రోజుల క్రితం ఇంటికి తాళం వేసి పుట్టింటికి వెళ్లింది. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నగేశ్​​ ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి నగలు చోరీ చేశారు. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న రాజశేఖర్ ఇంట్లోకి  వెళ్లారు. నిద్రిస్తున్న రాజశేఖర్ దంపతులను చేతులు కట్టేసి కట్టెలతో వారిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న సుమారు 11 తులాల బంగారం, 15 తులాల వెండి నగలు, రెండు సెల్ ఫోన్లు, ఒక బైకు ఎత్తుకెళ్లారు. దొంగల దాడిలో గాయపడ్డ రాజశేఖర్ ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates