మాస్క్ ల పేరుతో 4 లక్షలు కొట్టేసిన్రు

ఆన్ లైన్ లో సెర్చ్ చేసిన డాక్టర్ ను బురిడి కొట్టించిన సైబర్ నేరగాళ్లు
అగ్గువకే మాస్క్ లు, శానిటైజర్స్ అందిస్తామని మోసం

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ సైబర్ నేరగాళ్లకు కాసుల పంట పండిస్తోంది. మాస్క్ లు,శానిటైజర్ల కోసం సెర్చ్ చేసేవారిని టార్గెట్ చేసి ఆన్ లైన్ మోసగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో మూడు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. హయత్ నగర్ లోని ఓ మెడికల్ షాపు యజమాని నుంచి రూ.2.57 లక్షలు వసూలు చేయగా.. పాతబస్తీకి చెందిన ఆంకాలజిస్ట్ నుంచి రూ. 4.11 లక్షలు కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతబస్తీలోని మీర్ చౌక్ అలీజా కోట్లలో క్లినిక్ నిర్వహిస్తున్న అంకాలజిస్ట్, డాక్టర్ మహ్మద్ సయ్యద్ మాస్క్ లను హోల్ సేల్ లో అమ్మేందుకు ప్లాన్ చేశారు. గత నెల 18న అలీబాబా ఈ కామర్స్ సైట్ లో  త్రీ ఫ్లై సర్జరీ మాస్క్ ల కోసం సెర్చ్ చేశారు.

తర్వాత డాక్టర్  కు  వాట్సాప్ మెసేజ్ వచ్చింది.‘ మీరు త్రీ ఫ్లై సర్జరీ మాస్క్ ల కోసం సెర్చ్ చేశారు. మా కంపనీ మంచి క్వాలిటీ మాస్క్ లను అగ్గువకు అందిస్తాం. స్టాక్ ఆర్డర్  చేస్తే 30 శాతం డిస్కౌంట్ లో డోర్ డెలివరీ చేస్తాం’ అని నమ్మించారు. ఒక్కో బాక్స్ లో 100 మాస్క్ లు ఉంటాయని, 50 కాటన్స్ ఆర్డర్ చేసేలా డాక్టర్ సయ్యద్ ను సైబర్ నేరగాళ్లు  ఒప్పించారు. అడ్వాన్స్ గా రూ.84 వేలు వసూలు చేశారు. వాట్సప్ లో ఇన్ వాయిస్, డెలివరీ ఆర్డర్ ను పంపించారు. తర్వాత రూ.89 వేలు, రూ.2.10 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. మొత్తం రూ.4.11 లక్షలు  వసూలు చేశారు. ఈ నెల 10న మాస్కులు డెలివరీ అవుతాయని చెప్పారు. మాస్క్ లు డెలివరీ కాకపోవడంతో సయ్యద్ వాట్సప్ నంబర్లకు కాల్ చేశారు. ఆ నంబర్స్ పని చేయలేదు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఢిల్లీ కేంద్రంగా ఆన్ లైన్ నేరాలు

సైబర్ క్రైమ్ ఏసీపీ కెవీఎం ప్రసాద్ ఆధ్వర్యంలో ఇన్ స్పెక్టర్ వెంకట్ రామిరెడ్డి టీమ్ కేసును దర్యాప్తు చేస్తోంది. బాధితుడు అందించిన వివరాలు, ఇన్వాయిస్ ల ఆధారంగా తమిళనాడు, మిజోరం బ్యాంకుల్లోని అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్లు గుర్తించారు. మౌత్ మాస్క్ లు, శానిటైజర్స్ పేరుతో ఢిల్లీ కేంద్రంగా నైజీరియన్లు ఆన్ లైన్ నేరాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు సేకరించారు.

Latest Updates