యూఎస్ ఓపెన్ టైటిల్ తో.. థీమ్ డ్రీమ్ నిజమయింది

యూఎస్ ఓపెన్ టైటిల్ సొంతం

కెరీర్లో తొలి గ్రాండ్‌ స్లామ్‌ నెగ్గిన ఆస్ట్రియా వీరుడు
ఐదు సెట్ల టైటిల్‌ ఫైట్‌‌లో జ్వెరెవ్‌ ఓటమి

అనుభవం ముందు యువ ప్రతిభ చిన్నబోయింది. అసాధారణ పోరాటం ముందు అనుభవరాహిత్యం తలవంచింది. ఎదురీతతో విధి రాత మారింది. ఆస్ట్రియా వీరుడు డొమెనిక్ థీమ్‌‌ అనుకున్నది సాధించాడు. నెక్ట్స్‌‌ బిగ్‌‌ ప్లేయర్​గా ఎప్పుడో పేరు తెచ్చుకున్నా.. చాన్నాళ్లుగా స్టార్లకు సవాల్‌‌ విసురుతున్నా… మూడేళ్ల నుంచి తనను వెక్కిరిస్తున్న గ్రాండ్‌‌స్లామ్‌‌ను ఎట్టకేలకు ఒడిసిపట్టుకున్నాడు. జర్మనీ యువ సంచలనం అలెగ్జాండర్ ​జ్వెరెవ్‌‌కు చెక్‌‌ పెట్టి యూఎస్‌‌ ఓపెన్‌‌లో నయా బాద్​షా గా నిలిచాడు. ఐదు సెట్ల హోరాహోరీ ఫైట్‌‌లో తొలి రెండు సెట్లు కోల్పోయి వెనుకబడ్డా  అద్భుతంగా పుంజుకొని టైటిల్‌‌ నెగ్గి తన కల సాకారం చేసుకున్నాడు.

న్యూయార్క్‌‌:  యూఎస్‌‌ ఓపెన్‌‌ పురుషుల సింగిల్స్‌‌ టైటిల్‌‌ ఆస్ట్రియా పోరాట యోధుడు డొమినిక్‌‌ థీమ్‌‌నే వరించింది. ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌లో రెండు సార్లు (2018, 19), ఆస్ర్టేలియన్ ఓపెన్‌‌లో ఓసారి (2020) ఫైనల్‌‌ చేరినా అందని మేజర్​ టైటిల్‌‌ను థీమ్​ నాలుగో ప్రయత్నంలో సాధించాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన టైటిల్‌‌ ఫైట్‌‌లో సెకండ్ సీడ్‌‌ థీమ్‌‌ 2–6, 4–6, 6–4, 6–3, 7–6 (8/6)తో ఐదో సీడ్‌‌ జ్వెరెవ్‌‌ (జర్మనీ)పై చెమటోడ్చి విజయం సాధించాడు. ఫ్యాన్స్‌‌కు కిక్కిచ్చిన నాలుగు గంటల అల్టిమేట్‌‌ ఫైట్‌‌లో 27  ఏళ్ల థీమ్‌‌కు  జర్మన్‌‌ ప్లేయర్ తొలుత చుక్కలు​ చూపించాడు. అయితే లాస్ట్‌‌ సెట్  టై బ్రేక్‌‌లో 23 ఏళ్ల  జ్వెరెవ్​  ​ఆట కట్టించిన డొమినిక్‌‌ తనపై ఉన్న రన్నరప్‌‌ ట్యాగ్‌‌ను తొలగించుకున్నాడు. ఓపెన్‌‌ ఎరాలో యూఎస్‌‌ ఓపెన్‌‌ ఫైనల్లో ఫస్ట్ రెండు సెట్లు కోల్పోయి టైటిల్‌‌ నెగ్గిన తొలి ప్లేయర్​గా నిలిచాడు.

దడ పుట్టించిన జ్వెరెవ్

ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ ఫైనల్స్‌‌లో రఫెల్‌‌ నడాల్‌‌ అడ్డొచ్చాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌ తుదిపోరులో నొవాక్‌‌ జొకోవిచ్‌‌ చెక్‌‌ పెట్టాడు. తన నాలుగో గ్రాండ్‌‌స్లామ్‌‌ ఫైనల్లో ఈ ఇద్దరూ లేరు. ఎదురుగా కొత్త ప్రత్యర్థి, అంతగా ఎక్స్‌‌పీరియన్స్‌‌ లేని జ్వెరెవ్. టైటిల్‌‌ నెగ్గేందుకు తనకు లభించిన గోల్డెన్‌‌ చాన్స్‌‌ను థీమ్‌‌ సద్వినియోగం చేసుకున్నాడు. కానీ ఫస్ట్‌‌ టైమ్‌‌ మేజర్​ టోర్నీ ఫైనల్‌‌ ఆడుతున్న జ్వెరెవ్‌‌ అంత ఈజీగా తలొగ్గలేదు. టోర్నీలో ఒకే ఒక్క సెట్ కోల్పోయి ఫైనల్‌‌కు వచ్చిన థీమ్‌‌కు సవాల్ విసిరాడు. 140 మైల్స్‌‌ వేగంతో సర్వీస్‌‌లు,  పదునైన ఏస్‌‌లు, పర్​ఫెక్ట్‌‌ విన్నర్లతో  తొలి రెండు సెట్లు నెగ్గి 2–0తో లీడ్‌‌ సాధించాడు. మరోవైపు  సర్వీస్‌‌లో తడబడ్డ జ్వెరెవ్‌‌ వైడ్‌‌ షాట్లు, డబుల్‌‌ ఫాల్ట్స్‌‌తో ప్రత్యర్థి పని సులభం చేశాడు.

రేసులోకి థీమ్‌‌

థర్డ్‌‌ సెట్‌‌ ఆరంభంలోనే  బ్రేక్‌‌ పాయింట్‌‌ సాధించి 2–1తో నిలిచిన జ్వెరెవ్​ టైటిల్‌‌కు నాలుగు గేమ్‌‌ల దూరంలో నిలవడంతో  థీమ్‌‌ మళ్లీ రన్నరప్‌‌తో సరిపెట్టుకోవాల్సి వస్తుందనిపించింది. కానీ నరనరాన పోరాట స్ఫూర్తి నిండిన డొమినిక్‌‌ తనదైన శైలిలో పుంజుకున్నాడు. గత గ్రాండ్‌‌స్లామ్ ఫైనల్స్‌‌ అనుభవాన్ని రంగరించి ఆడాడు.  వెంటనే ప్రత్యర్థి సర్వీస్‌‌ బ్రేక్‌‌ చేసి పోటీలోకి వచ్చాడు. లాంగ్‌‌ ర్యాలీస్‌‌లో మెరుగ్గా ఆడిన థీమ్.. బ్రేక్‌‌ లైన్‌‌ నుంచి డ్రాప్‌‌ షాట్లతో అలరించాడు. ఈ  క్రమంలో జ్వెరెవ్‌‌ సర్వ్ చేసిన10వ గేమ్‌‌లో వరుసగా నాలుగు పాయింట్లతో సెట్‌‌ నెగ్గి మ్యాచ్‌‌లో నిలిచాడు. నాలుగో సెట్‌‌లో కూడా మొదట ఇద్దరూ ధాటిగా తలపడ్డారు. అయితే 3,7వ గేమ్స్‌‌లో బ్రేక్ పాయింట్లు సాధించిన థీమ్‌‌ ఈజీగా ఈ సెట్‌‌ గెలిచాడు. ఐదో సెట్‌‌లో ఆట మరింత రసవత్తరంగా సాగింది. ఏకంగా ఆరుసార్లు సర్వ్‌‌ బ్రేక్‌‌ అయిన ఈ సెట్‌‌లో జ్వెరెవ్‌‌ 5–3తో, థీమ్‌‌ 6–5తో చెరోసారి మ్యాచ్‌‌ కోసం సర్వ్‌‌ చేశారు. కానీ, రెండు ప్రయత్నాలూ సక్సెస్‌‌ కాకుండా మ్యాచ్‌‌ టై బ్రేక్‌‌కు దారితీసింది. ఐదో సెట్‌‌లో బేస్‌‌ లైన్‌‌ విన్నర్లతో ఆకట్టుకున్న థీమ్‌‌  క్లైమాక్స్‌‌లో మరింత మెరుగ్గా ఆడాడు. 6–4తో లీడ్‌‌లోకి వచ్చి సులభంగా నెగ్గేలా కనిపించినా..జ్వెరెవ్​ రెండు మ్యాచ్‌‌ పాయింట్లను కాపాడుకొని తొలి ఫైనల్లోనే గ్రాండ్‌‌స్లామ్‌‌ నెగ్గేలా కనిపించాడు. అయితే అతను వైడ్‌‌ షాట్‌‌ కొట్టడంతో మూడో ప్రయత్నంలో థీమ్‌‌ టైటిల్‌‌ నెగ్గాడు.

Latest Updates