కార్గిల్ టైంలో నచికేత.. నేడు అభినందన్

  • నాడు 8 రోజులకు వచ్చిన నచికేత.. మూడో రోజున వచ్చేస్తున్న అభినందన్

న్యూఢిల్లీ: భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. ఒక్క వ్యక్తి కోసం.. కాదు కాదు.. 130 కోట్ల మందికి హీరో అయిన ఆ వ్యక్తి కోసం రెండ్రోజుల నిరీక్షణ ముగిసింది. హమ్మయ్య.. వచ్చేస్తున్నాడు అని ఊపిరి పీల్చుకుంటోంది దేశం మొత్తం.

దేశ రక్షణ కోసం… శత్రువును తరిమికొట్టడానికి వెళ్లిన మన హీరో.. పాక్ చెర నుంచి వాయుసేన పైలట్, ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ రేపు భారత్ కు తిరిగి వచ్చేస్తున్నాడు. కార్గిల్ యుద్ధ సమయంలో పట్టుబడిన ఐఏఎఫ్ పైలట్ నచికేత 8 రోజుల్లో తిరగి వచ్చాడు. నేడు అభినందన్ ను మూడు రోజులకే తీసుకొస్తోంది భారత్. ఇది భారత దౌత్య విజయమేనని, పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేయడంలో మోడీ ప్రభుత్వం సక్సెస్ అయిందని ప్రశంసలు వస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం అభినందన్ విడుదల ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తోంది.

సరిగ్గా 20 ఏళ్ల క్రితం

20ఏళ్ల క్రితం కూడా యావద్దేశం ఇలాగే ఎదురుచూసింది. 1999 కార్గిల్ వార్ టైం అది. ఆ సమయంలో భారత ఆర్మీ పాక్ సైన్యంపై విరుచుకుపడేందుకు సాయంగా వాయుసేన రంగంలోకి దిగింది. కశ్మీర్లోని కార్గిల్ ప్రాంతంలో దాదాపు 17 వేల అడుగుల ఎత్తులో శత్రువులను అటాక్ చేయడానికి యుద్ధ విమానంలో 26 ఏళ్ల యువ పైలట్, లెఫ్టినెంట్ కంభంపాటి నచికేత దూసుకెళ్లారు. మిగ్-27లో ఆకాశంలోకి ఎగసిన నచికేతకు ఊహించని పరిణామం ఎదురైంది. జైట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. యుద్ధ విమానం కూలిపోతుండడంతో ముందు జాగ్రత్తగా కిందికి దూకేశాడు నచికేత. కానీ దురదృష్టవశాత్తు పాక్ భూభాగంలో పడ్డాడు. దీంతో పాక్ సైనికులు పరుగున వచ్చి లాక్కెళ్లారు. యుద్ధ ఖైదీ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే అంత కష్టంలోనూ భారత రక్షణ రహాస్యాలు భయటపడొద్దని.. తన వద్ద ఉన్న సీక్రెట్ మ్యాప్ లను వారు వచ్చేలోపే కాల్చి బూడిద చేశాడు.

దేశం కోసం..

కార్గిల్ యుద్ధం జరుగుతుండడంతో దేశ రహస్యాల కోసం పాక్ ఆర్మీ నచికేతను చిత్రహింసలు పెట్టింది. ఎంత వేధించినా.. భరత మాత రక్షణకు కట్టుబడిన నచికేత నోరు విప్పలేదు. నాటి భారత ప్రధాని వాజపేయి సహా అంతర్జాతీయ సమాజం పాక్ పై ఒత్తిడి చేయడంతో జెనీవా ఒప్పందం ప్రకారం ఎనిమిదో రోజు విడుదలయ్యాడు నచికేత. 1999 మే 27న యుద్ధ ఖైదీగా చెరలోకి తీసుకున్న పాక్ జూన్ 3న విడుదల చేశారు.

మూడో రోజున అభినందన్..

ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే ఉగ్ర సంస్థ దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దాని ప్రతీకారంగా భారత వాయుసేన 26న పాక్ లోని జైషే క్యాంపులపై బాంబుల వర్షం కురిపించి.. వాటిని నేలమట్టం చేసింది. దాదాపు 300 మంది ముష్కరులను మట్టుబెట్టింది.

ఫిబ్రవరి 27న ఉగ్రవాదుల తరఫున పాక్ ఆర్మీ… భారత్ పై దాడికి దిగింది. తన యుద్ధ విమానాలతో సరిహద్దుల వైపు వచ్చింది. దాన్ని పసిగట్టిన ఐఏఎఫ్ వెంటనే తిప్పికొట్టింది. కానీ ఆ ప్రయత్నంలో వాయుసేన యుద్ధ విమానం ఒకటి పాక్ లో కూలిపోయింది. దాని పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ ను పాక్ ఆర్మీ కస్టడీలోకి తీసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన భారత్ దౌత్య విజయం సాధించింది. రెండో రోజే అభినందన్ విడుదలపై పాక్ ప్రధాని ఇమ్రాన్ తమ పార్లమెంటులో ప్రకటన చేశారు. మార్చి 1న భారత్ కు అప్పగిస్తామని చెప్పారు.

దౌత్య విజయం

భారత ప్రభుత్వం, అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలతో పాటు ప్రపంచమంతా పాక్ పై ఒత్తిడి తేవడంతో ఇది సాధ్యమైంది. దౌత్య పరంగా పావులు కదిపి పాక్ ను ఒంటరిని చేసే ప్రయత్నం సక్సెస్ కావడంతో కదలిక వచ్చింది. పాక్ కు అనుకూలంగా ఉన్న చైనాతో కూడా పొరుగు దేశానికి హైచ్చరించేలా చేయడం విదేశాంగ శాఖ విజయమేనని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత కూడా పాక్ ఉగ్రవాదాన్ని వీడాలన్న హెచ్చరికలే ప్రపంచ దేశాలు చేస్తూ వచ్చాయి. ఈ రోజు ఎటువంటి షరతులు లేకుండా అభినందన్ ను తీసుకురావడం మోడీ ప్రభుత్వం, ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టిన తీరుకు నిదర్శనం.

Latest Updates