చిన్నారులపై కరోనా పంజా..వైరస్ వచ్చిన వారిలో 300 మంది పిల్లలే

హైదరాబాద్​, వెలుగురాష్ట్రంలో కరోనా వైరస్​ బారినపడ్డ వారిలో పెద్ద సంఖ్యలో చిన్న పిల్లలూ ఉంటున్నారు. ఫంక్షన్లు, హాస్పిటళ్లకు వెళ్లడంతో కొందరికి.. ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా బయటికెళ్లొచ్చిన పెద్దల నుంచి మరికొందరికి వైరస్​ సోకుతోంది. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వారిని దగ్గరికి తీసుకోవడమే సమస్యగా మారుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,256 మందికి కరోనా పాజిటివ్​రాగా.. అందులో 300 మందికిపైగా 15 ఏళ్లలోపు పిల్లలే. ఈ నెల 18న హెల్త్​ డిపార్ట్​మెంట్​ విడుదల చేసిన బులెటిన్​ ప్రకారమే డిశ్చార్జయిన వారిలో పదేళ్లలోపు పిల్లలు 85 మంది, 11 నుంచి 15 ఏళ్లలోపువాళ్లు 75 మంది ఉన్నారు. మరో 140 మంది ట్రీట్​మెంట్​పొందుతున్నట్టు తెలిసింది.

ఐదుగురు చిన్నారులు కన్నుమూశారు

రాష్ట్రంలో ఐదుగురు చిన్నారులను కరోనా బలిగొంది. నారాయణపేట జిల్లా రెనిపట్లకు చెందిన 2 నెలల బాబుకు ఏప్రిల్​ 17న కరోనా నిర్ధారణకాగా.. రెండు రోజులకే గాంధీ హాస్పిటల్​లో కన్నుమూశాడు. హైదరాబాద్ లోని​ఆసిఫ్​నగర్ కు చెందిన 11 నెలల బాలుడు ఏప్రిల్​ 19న చనిపోయాడు. అనుమానంతో టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్‌‌లోని దావూద్ బస్తీలో 10 రోజుల పాప ఈ నెల 26న, సూర్యాపేట సమీపంలోని కాసరబాదకు చెందిన 4 నెలల బాబు 27న మృతిచెందారు. హైదరాబాద్​ కుత్బుల్లాపూర్​లో ఉండే బీహార్​ వలస కూలీ ఈ నెల 18న నీలోఫర్​ హాస్పిటల్​లో చిన్నారికి జన్మనివ్వగా.. పుట్టిన ఎనిమిదో రోజే ఆ పసికందు కరోనాతో చనిపోయింది.

Latest Updates