రాష్ట్రంలో సీఎం కుర్చీ కోసం పంచాయితీ నడుస్తోంది

తెలంగాణలో సీఎం కుర్చీ కోసం పంచాయతీ నడుస్తోందని ఆరోపించారు ఎంపీ అరవింద్. రాష్ట్రంలో ఐదుగురు ముఖ్యమంతులున్నారన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన… గత ఏడేళ్ల  TRS పాలనలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన నియోజక వర్గం బోధన్ అన్నారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి ఇక్కడి ప్రజలను మోసం చేశారని తెలిపారు. అంతేకాదు తెలంగాణ వర్శిటీనీ గాలికొదిలేశారని ఆరోపించారు. తెలంగాణ యూనివర్శిటీలో జరిగిన అక్రమాలపై విచారణ కమిటీ వేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

నిజామాబాద్ జిల్లాలో 10 లక్షల మంది గల్ఫ్ కార్మికులున్నారని తెలిపిన అరవింద్…. కేసీఆర్ సీఎం అయిన తర్వాత గల్ఫ్ బాధితుల సంఖ్య రెట్టింపు అయ్యిందన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని TRS ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి జిల్లా అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. జిల్లా ఆస్పత్రిలో స్టాఫ్ కొరత ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. కరోనా సమయంలో జిల్లాలోని ఆస్పత్రులకు వెంటిలేటర్స్ ఇచ్చామని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టంపై సీఎం కేసీఆర్, TRS నేతలతో డిబేట్ కి తాను సిద్ధంగా ఉన్నానన్నారు ఎంపీ అరవింద్.  పసుపు బోర్డు కన్నా మంచి వ్యవస్థ తెచ్చామని.. దీనిపై రైతులను TRS తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు అరవింద్. పసుపు రైతులకు అన్ని రకాలుగా న్యాయం చేసేందుకు బీజేపీ, కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. స్పైస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఏర్పడ్డ తర్వాత విదేశాల నుండి పసుపు దిగుమతిని నిషేదించామన్నారు. మన పసుపుని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. పసుపుకి మద్దతు ధర ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాయమంటే రాయటం చేతకాని సీఎం కేసీఆర్ అని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఉద్యోగాల పేరుతో కొత్త నాటకానికి తెరలేపారన్న అరవింద్…టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా చైనీస్ వస్తువుల్లా మారిపోయారని చెప్పారు.

Latest Updates