వరినాట్లకు కూలీలు దొర్కుతలేరు

  • రోజుకు రూ.600 కైకిలి ఇస్తమన్నా వస్తలేరు
  • కూలీలకు తీవ్రమైన కొరత.. వివిధ రాష్ట్రాల నుంచి రప్పిస్తున్న రైతులు 
  • జిల్లాల్లో వరినాట్లు ఆలస్యం.. నారు ముదిరితే బర్కత్ ఉండదని ఆవేదన

వెలుగు, నెట్వర్క్/వనపర్తి: ‘‘అక్కా నాటెయ్యత్తవా.. నారు ముదిరిపోతంది.. పెద్దవ్వా నువ్వన్న రారాదు.. ఐదు వందలిత్త.. ’’ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏ పల్లెల జూసినా గివ్వే మాటలు ఇనవడ్తున్నయ్. ఎగిలివారకముందే రైతులు కూలీల ఇండ్ల సుట్టూ తిరుగుతున్నరు. అయినా కూలీలు దొరక్కపోవడంతో నాట్లెట్ల ఏసుడని బాధపడుతున్నరు. నారు ముదిరిపోతే బర్కత్ ఉండదని తల్లడిల్లుతున్నరు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల కింద కాల్వ నీళ్లు విడుదల చేయడంతో వివిధ జిల్లాల్లో వరినాట్లు జోరందుకున్నాయి. ఇప్పటికే పొలాలను ఇరువాలు దున్ని పెట్టుకున్న రైతులు.. నాటేసేందుకు కూలీల కోసం తిరుగుతున్నరు. బోర్లు, బావుల కింద ముందుగానే నాట్లు వేసినప్పటికీ.. కూలీలు దొరక్క ఇప్పుడు పొలాల్లో కలుపుతీత పనులు కూడా ఆగుతున్నయి.నేటి తరం పొలం పనులకు ఇంట్రెస్ట్​ చూపకపోవడం, ఇప్పటికీ వరినాటు యంత్రాలు అంతగా అందుబాటులోకి రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

నాట్లు సగమన్నా కాలే…

పోయినేడాది భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాజెక్టులు, చెరువుల్లో నీళ్లు ఫుల్లుగా ఉన్నాయి. భూగర్భ జలాలు కూడా పెరగడంతో బోర్లు, వ్యవసాయ బావుల కింద కూడా రైతులు వరి సాగు చేస్తున్నారు. మొత్తంగా ఈ యాసంగి సీజన్​లో 50లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఖరీఫ్​లో సన్న రకాలు సాగుచేసి, నష్టపోయిన రైతులంతా ఈసారైనా మంచి దిగుబడి సాధించాలనే ఆశతో డిసెంబర్​లోనే నార్లు పోసుకున్నారు. చాలావరకు దొడ్డు రకాలనే తుకాలుగా పోసుకోవడంతో నెల రోజుల్లోపే నాటు వేయాలి. కానీ కూలీల కొరత వల్ల 40 రోజులు దాటిపోతున్నా ఇంకా వివిధ జిల్లాల్లో సగానికి పైగా నాట్లు పడలేదు. నారు ముదిరిపోతే సరిగా నాటుకోదని, ఈ ఎఫెక్ట్​ దిగుబడిపై పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎకరాకు రూ.6 వేల ఖర్చు..

ఊరూరా కూలీలు వందల్లో ఉండడం.. వారం, రెండు వారాల టైమ్ లోనే వేల ఎకరాల్లో నాట్లు వేయాల్సి రావడంతో కూలీలకు డిమాండ్​ ఒక్కసారిగా పెరిగింది. పోయినేడాది ఒక్కో మహిళా కూలీకి రూ.400 కైకిలి ఉండగా.. ఈసారి చాలా జిల్లాల్లో రూ.500 నుంచి రూ.600 దాకా ఇవ్వాల్సి వస్తోంది. ఒక్క ఎకరం నాటు వేయాలంటే నారు పీకే వారితో కలిపి కనీసం 10 మంది కూలీలు కావాలి. అంటే కేవలం కైకిళ్లకే ఎకరానికి రూ.6వేల దాకా అవుతోందని రైతులు అంటున్నారు. కొన్ని గ్రామాల్లో కూలీలు దొరక్క పక్క  గ్రామాల నుంచి, బార్డర్​లో ఉన్న పక్క రాష్ట్రాల కూలీలను సైతం రప్పించుకుంటున్నారు. ఇందుకోసం స్పెషల్​గా ఆటోలు, ఇతర వెహికల్స్​పెడుతున్నారు. వాటి కిరాయి కూడా రైతుల మీద పడుతోంది. చాలాచోట్ల కూలీలు గుత్త తీసుకొని నాట్లు వేస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం​లాంటి జిల్లాల్లో ఒక్కో ఎకరానికి రూ.5వేల నుంచి రూ.6వేల దాకా తీసుకుంటున్నారు. ఇంత మొత్తం కూలీగా చెల్లించే స్థోమత లేని చిన్న, సన్నకారు రైతులు బదళ్లు వెళ్తున్నారు. అంటే మూడు, నాలుగు రైతు కుటుంబాల్లోని మహిళలంతా కలిసి ఒకరి పొలం తర్వాత మరొకరి పొలం నాటేసుకుంటున్నారు. విత్తనాలు, ట్రాక్టర్ల కిరాయి, కైకిళ్లు, ఎరువులు, పురుగుల మందులు, చివర్లో హార్వెస్టర్​ కిరాయి కలుపుకుంటే ఎకరానికి రూ.20వేల దాకా ఖర్చవుతోందని.. తీరా వడ్లు అమ్మితే పది వేలు కూడా మిగుల్తలేవని రైతులు అంటున్నారు.

ఇప్పటోళ్లు బురద పనులు చేస్తలేరు…

కూలీల కొరతకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. గతంలో వ్యవసాయ కూలీలకు వేసవిలో ఒకట్రెండు నెలలు తప్ప మిగిలిన రోజుల్లో చేతినిండా పని ఉండేది. వివిధ యంత్రాల కారణంగా కూలీలకు పని దినాలు తగ్గిపోయాయి. ట్రాక్టర్ల రాకతో దున్నడం, హార్వెస్టర్ల వల్ల పంట కోతలు, నూర్పిళ్లు బంద్​ అయ్యాయి. వరి, పత్తి, కంది తదితర మెట్ట పంటల్లో కలుపు నివారణ మందుల వాడకం, వివిధ వీవర్ యంత్రాల వినియోగం వల్ల కలుపుతీత పనులు కూడా తగ్గిపోతున్నాయి. దీంతో భూమి లేని పేదలు పూర్తిగా వ్యవసాయ రంగంపై ఆధారపడి బతికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో చాలామంది పట్టణాలు, నగరాల్లో నిర్మాణ రంగం పనులకు వెళ్లిపోతున్నారు. ఇక నేటితరం పొలం పనులు, ముఖ్యంగా బురద పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు.

వరినాటు యంత్రాలపై ఫోకస్ పెట్టని సర్కార్..

కొందరు రైతులు వరినాటు యంత్రాలు తెప్పిస్తున్నా సక్సెస్ ​రేటు చాలా తక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో వినియోగిస్తున్న యంత్రాలను ప్రత్యేకంగా యూట్యూబ్ లో చూసి బుక్ చేసుకున్నప్పటికీ.. వాటి వినియోగం తెలియకపోవడంతో ఫాయిదా ఉండడం లేదు.  రైతులకు అవగాహన కల్పించేందుకు, యంత్రాలు కొనుగోలు చేసేవారికి సబ్సిడీ ఇప్పించేందుకు సర్కారు ముందుకురావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లుగా నయాపైసా ఫండ్స్ ఇవ్వకుండా యంత్రలక్ష్మి పథకాన్ని పూర్తిగా పక్కనపెట్టేసింది.  నాట్లు వేయడంతో పని లేకుండా డైరెక్ట్​దుక్కిలో విత్తనాలను వెదజల్లే విధానంపై రైతులు మొగ్గు చూపుతున్నా, ఆఫీసర్లు ఇంట్రెస్ట్​ చూపడం లేదనే విమర్శలున్నాయి.

బీహార్ నుంచి కూలీలు

రాష్ట్రంలో వరినాట్లకు డిమాండ్ ఉండడంతో మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఉత్తరాంచల్​నుంచి పెద్ద సంఖ్యలో కూలీలు వచ్చి పలు జిల్లాల్లో నాట్లు వేస్తున్నారు. ఇటీవల కరీంనగర్​జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట లోని రైతులు బీహార్, జార్ఖండ్​కు చెందిన వలస కూలీలతో నాట్లు వేయించారు. ఒక్కో బ్యాచ్ లో 15 మంది దాకా ఉండే యువకులు రోజుకు నాలుగు ఎకరాల్లో నాట్లు వేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇందుకోసం ఎకరానికి రూ.5వేలు తీసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం లో  కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో మహారాష్ట్ర నుంచి ఆటోల్లో రప్పిస్తున్నారు. వీళ్లకు రోజుకు రూ.300 కూలి, ఉండటానికి రూమ్, వండుకోడానికి కట్టెలను రైతులే ఇస్తున్నారు. ఇక వరంగల్ రూరల్​జిల్లా భీమదేవరపల్లి మండలంలోని మల్లారం, కొత్తకొండ, రసూల్​పల్లి గ్రామాల్లోని రైతులు ఉత్తరాంచల్ నుంచి  వచ్చిన కూలీలతో నాట్లు వేయిస్తున్నారు.

కూలీల కోసం రోజూ తిరుగుతున్న..

నాకు రెండెకరాల పొలం ఉంది. నారు ఎదిగింది. వారంలోపు ఎయ్యకపోతే ఎందుకూ పనికి రాదు. పొలం కూడా దున్ని పెట్టుకొని  కూలీల కోసం రోజూ తిరుగుతున్న. ఎవరూ వస్తలేరు. ఎక్కువ పైసలకు బయట ఊళ్లకు పోతున్నరు. మేము రూ.500 ఇస్తమంటే కూడా వస్తలేరు. ఇగ ఒకరిద్దరు దొరికినా రోజుకు కొంచెం వేద్దమనుకుంటున్నం.

– దొంతి కొమురయ్య, రైతు, కూరెళ్ల, సిద్దిపేట జిల్లా

Latest Updates