రెవెన్యూ చట్టంలో పెద్ద మార్పుల్లేవ్

  • 1971 పట్టాదారు పాస్​బుక్​ చట్టానికే పదును
  • ఈజీ మ్యుటేషన్​పైనే దృష్టి.. ఎప్పట్లాగే ఇతర రెవెన్యూ చట్టాలు
  • తహసీల్దార్లకే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పవర్స్

హైదరాబాద్, వెలుగురెవెన్యూ చట్టాలన్నింటినీ చుట్టచుట్టి కొత్త రెవెన్యూ కోడ్ తీసుకొస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం.. చివరికి ఆ చిక్కుల్లోకి వెళ్లకుండా 1971 నాటి పట్టాదారు పాస్ బుక్స్ చట్టానికే పదును పెట్టింది. అమలులో ఉన్న రెవెన్యూ చట్టాలతోపాటు కాలం చెల్లిన చట్టాల జోలికి వెళ్లకుండా కేవలం పట్టాదార్ పాస్ బుక్స్ జారీకి సంబంధించిన ఒక్క చట్టంలోనే మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. 2017లో భూరికార్డుల ప్రక్షాళనకు ముందే ఈ చట్టంలో మార్పులు చేసిన ప్రభుత్వం.. ఇదే చట్టంలో పలు సెక్షన్లు మార్చి, చేర్చి ‘ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్-2020’గా అసెంబ్లీ ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిసింది.

మ్యుటేషన్ పైనే దృష్టంతా

రాష్ట్రంలో ఇప్పటికే భూరికార్డుల డిజిటలైజేషన్ పూర్తి కావొచ్చింది. భూముల గుర్తింపు పూర్తయ్యింది. పట్టాదారు పాస్ బుక్కుల జారీకి ముందే భూయజమానుల బయోమెట్రిక్ తీసుకుని ఆధార్ నంబర్ తో అనుసంధానం చేశారు. ఇకపై వాస్తవ భూయజమాని ప్రమేయం లేకుండా రికార్డుల్లో పేర్లు మార్చడం, ఇతరుల పేరిట మ్యుటేషన్ చేయడం వంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఇదే బయోమెట్రిక్ డేటాను వినియోగించుకోనున్నట్లు తెలిసింది. భూయజమాని సమ్మతితో నిమిషాల్లో మ్యుటేషన్ జరిగేలా సరికొత్త సాఫ్ట్ వేర్ కు రూపకల్పన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

కంక్లూజివ్ టైటిల్స్​పై వెనక్కి

భూముల క్రయవిక్రయాల్లో ప్రస్తుతం అమలులో ఉన్న సేల్‌ డీడ్‌, ఆర్వోఆర్‌ స్థానంలో కంక్లూజివ్‌ టైటిల్స్‌ తీసుకురావాలన్న ఆలోచన నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. భూవివాదాల శాశ్వత పరిష్కారం, ప్రజల భూమి హక్కులకు రక్షణ కల్పించేందుకు కంక్లూజివ్‌ టైటిల్‌ జారీ చేయాలని కొన్నాళ్లుగా రెవెన్యూ సంఘాల నాయకులు, న్యాయ నిపుణులు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా కంక్లూజివ్ టైటిల్‌ జారీ దిశగా అడుగులు పడింది కూడా మన రాష్ట్రంలోనే. ఉమ్మడి ఏపీలో నిజామాబాద్‌ జిల్లాలో  ‘భూభారతి’ పేరిట 2004లో పైలెట్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. సమగ్ర భూసర్వే చేపట్టినప్పటికీ కంక్లూజివ్‌ టైటిల్స్‌ దశకు రాకముందే ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైంది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కంక్లూజివ్ టైటిల్స్ ఇస్తామని సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు. అయితే ఇప్పటికే భూరికార్డుల ప్రక్షాళన పేరిట పాత పాస్‌ పుస్తకాలన్ని రద్దు చేసి కొత్తవి ఇవ్వడంతోపాటు కేవలం సాదాబైనామాతో భూములు కొనుగోలు చేసినవారికి కూడా పాస్‌ పుస్తకాలు జారీ చేశారు. వీటి ముద్రణ, సెక్యూరిటీ ఫీచర్స్‌ కోసం రూ.కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అందుకే కంక్లూజివ్‌ టైటిల్స్‌ ఇచ్చేందుకు మళ్లీ పాస్‌ పుస్తకాలు మార్చడం వ్యయ, ప్రయాసతో కూడిన వ్యవహారమని ప్రభుత్వం భావించినట్లు తెలిసింది.

తహసీల్దార్లకు అడిషనల్ పవర్స్

గతంలో తహసీల్దార్లకు ఉన్న పట్టాదారు పాసుబుక్కుల జారీ, మ్యుటేషన్ పవర్స్​కు తోడు కొత్త చట్టం ద్వారా అదనంగా రిజిస్ట్రేషన్ పవర్స్ కూడా ప్రభుత్వం అప్పగించబోతున్నట్లు తెలిసింది. చట్టం అమల్లోకి వస్తే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మినహా పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్లే చేయనున్నారు.

పెండింగ్ ఫైల్స్​ క్లియరెన్స్ పై గందరగోళం

భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా వివిధ కారణాలతో సుమారు 9 లక్షల ఎకరాల భూములకు సంబంధించిన 4 లక్షల ఖాతాలను పార్ట్ బీలో చేర్చారు. ఈ వివాదాలన్ని రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్​లో ఉన్నాయి. వీటితోపాటు తమకు భూమి అమ్మిన రైతుల పాస్ పుస్తకాలు రద్దు చేసి తమకు కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయాలంటూ కొందరు పెట్టుకున్న దరఖాస్తులు, పెండింగ్ మ్యుటేషన్లు, పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పులు సరిదిద్దాలని, పాస్ బుక్కులు రాలేదని సమర్పించిన అప్లికేషన్లు లక్షలాదిగా పెండింగ్ లో ఉన్నాయి. వాటి క్లియరెన్స్​పై గందరగోళం ఏర్పడింది.

అధికారుల అవినీతి సంగతేంటి?

రెవెన్యూ శాఖలో అవినీతికి వీఆర్వోలే మూలమని భావించిన ప్రభుత్వం ఏకంగా ఆ వ్యవస్థనే రద్దు చేస్తూ అసెంబ్లీలో బుధవారం బిల్లు ప్రవేశపెట్టబోతోంది. అయితే రెవెన్యూ శాఖలో ఒక్క వీఆర్వోలే అవినీతిపరులా? ఆ పై స్థాయి అధికారుల సంగతేంటనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఇటీవల లక్షలాది రూపాయల నోట్ల కట్టలతో ఏసీబీ అధికారులకు చిక్కిన తహసీల్దార్ల ఉదంతాలను వారు గుర్తు చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో వేళ్లూనుకున్న అవినీతిలో వీఆర్వోలు పాత్రధారులేనని, పై అధికారులు సూత్రధారులనే వాదనలు వినిపిస్తున్నాయి.

 

Latest Updates