టెన్షన్ వద్దు: తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవు

హైదరాబాద్: రాష్ట్రంలో బర్డ్ ప్లూ ఆనవాళ్లు లేవని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బర్డ్ ప్లూ వైరస్ నివారణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై బుధవారం ఉన్నతస్థాయి అధికారులతో మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని.. ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ తీసుకున్న ముందస్థు జాగ్రత్తలతో రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తికి అవకాశం లేదన్నారు.

బర్డ్ ఫ్లూపై రాష్ట్రంలో 1300 అధికారుల టీమ్ లు నిరంతరం వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. కోళ్ళ పరిశ్రమలో దేశంలో తెలంగాణ రాష్ట్రం ౩వ స్థానంలో ఉందని.. బర్డ్ ఫ్లూపై అన్ని స్థాయిల అధికారులను అప్రమత్తం చేశామన్నారు.  రాజస్తాన్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే బర్డ్ ఫ్లూను గుర్తించారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, వీబీఆర్ఐ అధికారులు, పౌల్ట్రీ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest Updates