విద్యాశాఖలో ఇన్ చార్జుల పాలన.. 33 జిల్లాలకు ఏడుగురే డీఈవోలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాఠశాల విద్యా శాఖ గాడి తప్పుతోంది. పర్యవేక్షణాధికారులు లేక పాలన అస్తవ్యస్తమవుతోంది. ఏండ్లుగా పర్యవేక్షణ స్థాయి పోస్టులను భర్తీ చేయక ఎఫ్ఏసీ, ఇన్‌‌చార్జుల పాలనే సాగుతోంది. రాష్ట్రంలో 33 జిల్లాల పరిధిలో మొత్తం 41,135 స్కూళ్లుండగా వాటిల్లో మూడున్నర లక్షల మంది సర్కారు, ప్రైవేటు టీచర్లు పని చేస్తున్నారు. వీటన్నింటిలో సుమారు 59 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. సర్కారు స్కూళ్లతో పాటు ప్రైవేటు స్కూళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో ఎంఈవోలు, జిల్లా స్థాయిలో డీఈవోలది కీలక పాత్ర. కానీ ఆ పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ భారమైంది. ఒక్కో డీఈవో రెండేసి జిల్లాలు చూడటం ఇబ్బందిగా మారింది. ఎఫ్‌‌ఏసీ ఎంఈవోలు కూడా 3, 4 మండలాలను పర్యవేక్షించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఐదుగురు డీఈవోలకు రెండు జిల్లాల బాధ్యతలు

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 7 జిల్లాల్లోనే రెగ్యులర్ డీఈవోలు పని చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌‌నగర్, మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఇన్‌‌చార్జులే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఐదుగురు డీఈవోలు రెండు జిల్లాల బాధ్యతలు చూస్తుండగా ఐదుగురు ఏడీలు, 8 మంది డిప్యూటీ డీఈవోలు, జీహెచ్ఎంలు, డీడీలు ఇన్ చార్జుల బాధ్యతల్లో కొనసాగుతున్నారు. 12 మంది డైట్, బీఈడీ కాలేజీ లెక్చరర్లు, ప్రొఫెసర్లు డీఈవోలుగా పనిచేస్తున్నారు.

6 మండలాలకు ఒక్కరే ఎంఈవో

ఎంఈవోల పోస్టులు దాదాపు ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం 591 మండలాలుండగా 21 మందే రెగ్యులర్ ఎంఈవోలు పని చేస్తున్నారు. కొత్త మండలాల్లో 85 మండలాలకు ఎంఈవో పోస్టులు శాంక్షన్ అవగా భర్తీ చేయలేదు. మిగిలిన మండలాలకూ పోస్టులు శాంక్షన్ చేయాల్సి ఉంది. 20 జిల్లాల్లో ఒక్క రెగ్యులర్ ఎంఈవో కూడా లేరు. 8 జిల్లాల్లో ఒక్కొక్కరే ఉన్నారు. 246 మంది జీహెచ్‌‌ఎంలు, ఏడుగురు స్కూల్ అసిస్టెంట్లు, ఇద్దరు ఏడీలు ఇన్‌‌చార్జ్‌‌ ఎంవోఈలుగా కొనసాగుతున్నారు. డివిజన్ స్థాయిలో హైస్కూళ్ల పర్యవేక్షణకు గతంలో డిప్యూటీ డీఈవోలు ఉండేవారు. ఆ పోస్టులు 66 ఉండగా ప్రస్తుతం ఆరుగురే ఉన్నారు. వీరు కూడా ఇన్‌‌చార్జ్‌‌ డీఈవోలుగా పనిచేస్తున్నారు. ఇదే క్యాడర్‌‌లోని జీహెచ్‌‌ఎం–1 పోస్టులు18 ఉండగా 17 ఖాళీగానే ఉన్నాయి.

సర్వీస్ రూల్స్ పేరుతో లేట్‌‌

ఉమ్మడి సర్వీస్ రూల్స్ పేరుతో టీచర్ల ప్రమోషన్లకు బ్రేకులు పడ్డాయి. ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్, హెచ్ఎం స్థాయి వరకే ప్రమోషన్లు ఇస్తుండటంతో పై పోస్టుల గురించి సర్కారు ఆలోచన చేయట్లేదు.

Latest Updates