లాక్ డౌన్ తప్ప వేరే మార్గం కనిపించడం లేదు

ఏప్రిల్ 14 త‌ర్వాత లాక్ డౌన్ ప‌రిస్థితి ఏంట‌న్న ప్ర‌శ్న‌ల‌కు తెర‌దించారు సీఎం కేసీఆర్. మ‌న దేశానికి లాక్ డౌన్ త‌ప్ప మ‌రో గత్యంత‌రం లేద‌ని, దీన్ని కొన‌సాగించ‌క త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఆయ‌న సోమ‌వారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటి వరకు 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ‌ని, అందులో 11 మంది మ‌ర‌ణించ‌గా.. 45 మంది డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపారు. ప్రస్తుతం 308 మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అందులో 172 మంది వ‌ర‌కు ఢిల్లీ నిజాముద్దీన్ నుంచి వ‌చ్చిన వాళ్లేన‌ని చెప్పారు.

25 వేల మంది క్వారంటైన్ పూర్తి

కరోనా మన దేశంలో పుట్టిన జబ్బు కాద‌ని, విదేశాల నుంచి వ‌చ్చింద‌ని అన్నారు సీఎం కేసీఆర్. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 25,937 మందిని చేశామ‌ని, అందులో 30 మందికి మాత్రమే పాజిటివ్ వ‌చ్చిందని చెప్పారు. ఆ విదేశాల నుంచి వ‌చ్చిన వారి కుటుంబ‌స‌భ్యుల‌కు మ‌రో 20 మందికి వైర‌స్ సోకింద‌ని తెలిపారు సీఎం. ఇందులో ఏ ఒక్క‌రూ మ‌ర‌ణించ‌లేద‌ని, ఈ 50 మందిలో 35 మంది ఇప్ప‌టికే డిశ్చార్జ్ అయ్యార‌ని, మ‌రో 15 మంది కూడా కోలుకున్నార‌ని, రెండు మూడ్ర‌జుల్లో ఇంటికి వెళ్తార‌ని చెప్పారు. ఇక విదేశాల నుంచి వ‌చ్చిన ఈ అంద‌రి క్వారంటైన్ గ‌డువు ర‌రేప‌టితో ముగుస్తుంద‌ని, వాళ్లు కూడా ఇళ్ల‌కు వెళ్లిపోతార‌ని చెప్పారు.

నిజాముద్దీన్ ఘ‌ట‌న‌తో కేసులు పెరిగిన‌య్..

ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ నుంచి వచ్చిన 1089 మందిలో 172 మందికి పాజిటివ్ వచ్చింద‌ని, వాళ్లు మ‌రో 93 మందికి అంటించార‌ని అన్నారు సీఎం కేసీఆర్. ఈ నిజాముద్దీన్ ఘ‌ట‌న‌తో భారీగా కేసులు పెరిగాయ‌ని అన్నారు. చ‌నిపోయిన 11 మంది కూడా ఈ బ్యాచ్ లోని వాళ్లేన‌ని చెప్పారు. ఆ ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన వాళ్లు, వాళ్ల‌తో కాంటాక్ట్ అయిన వాళ్ల‌ను మొత్తం 3 వేల మంది గుర్తించామ‌ని, వాళ్ల‌లో వెయ్యి మందికి పైగా టెస్టులు పూర్త‌య్యాయ‌ని చెప్పారుఉ. ఈ నిజాముద్దీన్ ఘ‌ట‌న లేకుంటే అంతా క్లియ‌ర్ అవుతుంద‌ని అనుకున్నామ‌ని, ఇప్పుడు మ‌రో 150 కేసుల వ‌ర‌కు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నామ‌ని తెలిపారు. అక్క‌డితో ఆగితే చాలా సంతోష‌మ‌ని, ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించి లాక్ డౌన్ మంచిగా పాటించాల‌ని కోరారు.

అమెరికాలోనే శ‌వాల గుట్ట‌లు.. మ‌న‌కు మ‌రో మార్గం లేదు

మ‌న దేశంలో క‌రోనా విష‌యంలో చాలా ముందుగా అప్ర‌మ‌త్త‌మ‌య్యామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ఒక రోజు జనతా కర్ఫ్యూ పెట్టుకుని ఆ తర్వాత లాక్ డౌన్ పాటిస్తున్నామ‌ని అన్నారు. దీని వ‌ల్లే దేశంలో క‌రోనా కేసుల సంఖ్య నాలుగు వేల ద‌గ్గ‌రే ఉంద‌ని చెప్పారాయ‌న‌. భార‌త్ లాక్ డౌన్ తో బాగా అప్రమ‌త్తంగా వ్య‌వ‌హ‌రించింద‌ని చాలా అంత‌ర్జాతీయ జ‌ర్న‌ల్స్ కూడా ప్ర‌శంసించాయ‌న్నారు. అమెరికా లాంటి అగ్ర‌రాజ్యంలోనే క‌రోనా వ‌ల్ల శ‌వాలు గుట్ట‌లుగా ప‌డుతున్నాయ‌ని, ఆ వార్త‌లు చూస్తుంటే చాలా హృద‌య విదార‌కంగా ఉంద‌ని అన్నారు సీఎం. మ‌న దేశంలో ఆ ప‌రిస్థితి వ‌స్తే కోట్ల‌లో చ‌నిపోతార‌ని, మ‌న‌కు లాక్ డౌన్ త‌ప్ప మ‌రో గ‌త్యంత‌రం లేద‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఎవ‌రూ త‌మ‌ని ఎవ‌రో ఇంట్లోనే బంధించేస్తున్నార‌ని అనుకోవ‌ద్ద‌ని, మ‌న‌కు మ‌రో దారిలేద‌ని, ప్ర‌ధాని మోడీ అడిగిన సంద‌ర్భంలోనూ లాక్ డౌన్ కొన‌సాగించాల్సిందేన‌ని చెప్పాన‌ని తెలిపారు సీఎం కేసీఆర్.

ఇండియాలో జూన్ 3 వ‌ర‌కు లాక్ డౌన్…

ఇది మాన‌వ జాతి మొత్తం ఎదుర్కొంటున్న సంక్షోభం అని, ప్ర‌పంచంలో 22 దేశాలు కంప్లీట్ లాక్ డౌన్ లో ఉన్నాయ‌ని, మ‌రో 90 దేశాలు పాక్షికంగా లాక్ డౌన్ అమ‌లు చేస్తున్నాయ‌ని అన్నారు. లాక్ డౌన్ వ‌ల్ల ఎకాన‌మీ కుప్ప‌కూలిపోతుంద‌ని కొంద‌రంటున్నార‌ని, కానీ ముందు మ‌నుషులు బ‌తికుంటే బ‌లిచాకైనా తినొచ్చు అని చెప్పారు సీఎం. రోగులు అత్యంత దయనీయంగా చనిపోతున్నారని, శరీరంలో తక్కువ వైరస్ సోకిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నార‌ని అన్నారు. మ‌న‌ దేశంలో ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి జూన్ 3 వ‌ర‌కు లాక్ డౌన్ ఉండాల‌ని బోస్ట‌న్ క‌న్సెల్టింగ్ గ్రూప్ సూచిస్తోంద‌ని అన్నారు.

ప్ర‌జ‌లు బాగా స‌హ‌క‌రిస్తున్నారు..

మ‌న‌కు లాక్ డౌన్ త‌ప్ప మ‌రో మార్గం లేదు.. ప్ర‌జ‌ల్ని బ‌తికించుకోవాలంటే అదొక్క‌టే మార్గ‌మ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ఎకాన‌మీ కూలిపోతే ఎలాగోలా రివైవ్ చేసుకోవ‌చ్చు కానీ, ప్రాణం పోయాక రివైవ్ చేసుకోలేమ‌ని చెప్పారాయ‌న‌. లాక్ డౌన్ విష‌యంలో ప్ర‌జ‌లు కొత్త‌లో ఇబ్బంది పెట్టినా ఇప్పుడు బాగా స‌హ‌క‌రిస్తున్నార‌ని, ఇలాగే కొన‌సాగాల‌ని అన్నారు.

Latest Updates