టిక్‌టాక్‌ యాప్ బ్యాన్‌‌పై లోక్‌సభలో కేంద్రం స్పందన

వీడియో షేరింగ్ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను భారత్‌లో బ్యాన్ చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని రాత పూర్వకంగా తెలియజేశారు.

‘టిక్‌టాక్ యాప్ ద్వారా దేశ భద్రతకు ఏదైనా ముప్పు ఉందా? శత్రు దేశాలు మన ఇంటెలిజెన్స్ ఆపరేషన్లపై ఈ యాప్ సాయంతో స్పై (నిఘా) చేసే అవకాశం ఉందా? టిక్‌‌టాక్‌ను దేశంలో బ్యాన్ చేసే ఆలోచన ఉందా?’ అని లోక్‌సభలో ఒక సభ్యుడు కేంద్ర హోం శాఖను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్రం… టిక్‌టాక్ వల్ల దేశ భద్రతకు ముప్పు ఉన్నట్లుగానీ, దీని ద్వారా నిఘా పెట్టే అవకాశం ఉన్నట్లుగానీ ఎటువంటి సమాచారం తమ దృష్టికి రాలేదని తెలిపింది. ఈ యాప్‌ను బ్యాన్ చేయాలన్న ప్రతిపాదనలు లేవని లిఖత పూర్వకంగా సభకు వెల్లడించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.

గతంలో బ్యాన్..

గతంలో టిక్ టాక్ యాప్‌ను భారత్‌లో కొన్నాళ్లపాటు బ్యాన్ చేశారు. చైనాకు చెందిన ఈ యాప్‌లో పిల్లలకు అడల్ట్ కంటెంట్ అందుబాటులోకి వస్తోందంటూ గత ఏడాది ఏప్రిల్‌లో మద్రాస్ హైకోర్టు టిక్‌టాక్‌పై నిషేధం విధించింది. పోర్నోగ్రఫీ, అడల్ట్ కంటెంట్ తొలగిస్తామని, అటువంటి వీడియోలు యాప్‌లో లేకుండా చూసుకుంటామని ఆ సంస్థ హామీ ఇవ్వడంతో నిషేధం తొలగించింది కోర్టు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఆ యాప్ అందుబాటులో లేని కొద్ది రోజుల్లోనే టిక్‌టాక్‌ యాజమాన్యానికి 33 శాతం ఆదాయం తగ్గిపోయింది. ఇండియాలో నిషేధం ఉన్న ఆ కొన్నాళ్లు ప్రతి రోజూ 3.5 కోట్లు నష్టం వచ్చిందని ఆ సంస్థ వెల్లడించింది.

More News:

కరోనా పేషెంట్‌పై వాట్సాప్‌లో రూమర్స్.. భువనగిరిలో ముగ్గురి అరెస్టు

రికార్డ్ బ్రేక్: టిక్‌టాక్‌లో ఇండియన్స్ ఎంత టైమ్ స్పెండ్ చేశారంటే?

కరోనా మృతుల కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.4 లక్షలు

Latest Updates