3 వారాలన్నారు..4 నెలలైనా కొత్త వీసీలు రాలే

హైదరాబాద్, వెలుగు: ‘‘యూనివర్సిటీల వైస్​ చాన్స్​లర్ల నియామకానికి సెర్చ్ కమిటీల నుంచి పేర్లు తెప్పించుకోండి. ముందుగా ఈసీలను నియమించండి. వీటిద్వారా వీసీల నియామకం మరింత ఈజీ అవుతుంది. ఇదంతా రెండు, మూడు వారాల్లోనే ముగించాలి..” ఇదీ ఫిబ్రవరి 19న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన. రెండు, మూడు వారాల్లో ప్రక్రియంతా ముగించాలని సీఎం చెప్పి కూడా నాలుగు నెలలు దాటింది. అయినా సర్కారీ యూనివర్సిటీల్లో వైస్ చాన్స్​లర్ల రిక్రూట్​మెంట్​ మాత్రం జరగలేదు. దీంతో విద్యాశాఖ పరిధిలోని 11 యూనివర్సిటీలకు11 వర్సిటీల్లోనూ ఇన్​చార్జి వీసీల పాలనే కొనసాగుతోంది.

ఏండ్లుగా ఇన్​చార్జుల పాలనే

రాష్ట్రంలో 15 స్టేట్ యూనివర్సిటీలుండగా, వాటిలో 11 విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్నాయి. ఈ 11 వర్సిటీల్లో ఆర్జీయూకేటీ( బాసర ట్రిబుల్ఐటీ) తెలంగాణ వచ్చినప్పటి నుంచి, శాతవాహన వర్సిటీ మూడేండ్ల నుంచి ఇన్​చార్జి వీసీల పాలనలో కొనసాగుతున్నాయి. మహాత్మాగాంధీ వర్సిటీకి గతేడాది జూన్30 నుంచి, మిగిలిన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, జేఎన్టీయూ, పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ, డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు గతేడాది జులై 24 నుంచి ఇన్​చార్జి వీసీలతో నడుస్తున్నాయి. జేఎన్​ఏఎఫ్​ఏయూ వీసీ పోస్టు ఈ ఏడాది జనవరి 17 నుంచి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో జేఎన్​ఏఎఫ్​ఏయూ, ఆర్జీయూకేటీ మినహా మిగిలిన 9 వర్సిటీల వీసీల నియామకం కోసం గతేడాది జులై 23న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. 9 వర్సిటీలకు 984 దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ లో గవర్నర్ తమిళిసై సమీక్ష నిర్వహించారు. గవర్నర్​ నుంచి ఒత్తిడి వచ్చే చాన్స్ ఉందని భావించిన సర్కార్​.. అదే నెలలో వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను నియమించింది. ఆ తర్వాత వీసీల గురించి పట్టించుకోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రం రెండు, వారాల్లోనే వీసీల ప్రక్రియంతా పూర్తిచేయాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు.

సెర్చ్ కమిటీలు భేటీ లేదు

యూనివర్సిటీ వీసీల ఎంపిక కోసం గతేడాది సెప్టెంబర్​లో ప్రభుత్వం సెర్చ్ కమిటీలు వేసింది. ఈ కమిటీలు ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. అయితే ఒక్కో వర్సిటీకి ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్​ కమిటీలుండగా.. అన్ని వర్సిటీలకు సర్కారు నామినీగా ప్రస్తుత సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నారు. దీంట్లో వర్సిటీ నామినీలుగా దాదాపు అందరూ తెలంగాణ వాళ్లే ఉండగా.. యూజీసీ నామినీలు కూడా ఎక్కువ మంది ఇక్కడి వాళ్లే ఉన్నారు. అయినా 9 నెలలుగా సెర్చ్ కమిటీలు భేటీ కాకపోవడంతో పలు విమర్శలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేసి ఉంటే.. ఇప్పటికే సెర్చ్ కమిటీల సమావేశాలు పూర్తయ్యేవి. కానీ ఆ ప్రయత్నం విద్యాశాఖ చేయలేదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్​తో సమావేశాలు జరిగే పరిస్థితి లేదని ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ టెక్నాలజీని ఉపయోగించుకుని, వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కూడా సెర్చ్ కమిటీలు భేటీ కావొచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. రెగ్యులర్ వీసీలు లేకపోవడంతో వర్సిటీల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. పలు అభివృద్ధి పనులు, కీలకమైన పనులు పెండింగ్​లో పడిపోతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీలకు ప్రభుత్వం పర్మిషన్​ ఇవ్వడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.

అప్లయ్​ చేసుకునేందుకు మళ్లీ చాన్స్​ ఇస్తరా?

గతేడాది జులైలో వీసీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ టైంలో పదేండ్ల అర్హత లేని చాలామంది ప్రొఫెసర్లు అప్లయ్​ చేసుకోలేకపోయారు. ఇందులో నెలరోజుల తక్కువకాలం ఉన్నవారూ ఉన్నారు. నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది గడుస్తుండటంతో, ప్రస్తుతం తమకూ అప్లయ్​ చేసుకునే అవకాశమివ్వాలని మిగతా ప్రొఫెసర్లు కోరుతున్నారు. గతంలో అప్లయ్​ చేసుకున్న వారికీ మెరిట్స్​ పెరిగాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రొఫెసర్ల నుంచి అప్లికేషన్స్​ తీసుకుంటారా..? ఇప్పటికే అప్లై చేసిన వారికి అప్ డేట్ చేసుకునేందుకు చాన్స్ ఇస్తారా..? అనే చర్చ కూడా జరుగుతోంది.

Latest Updates