అకౌంట్స్ ను​ బయటపెట్టని​ ఆర్​టీసీ మేనేజ్​మెంట్​

  • జమా ఖర్చుల వివరాలు కాగ్​కి ఇవ్వని మేనేజ్​మెంట్​
  • ఐదేండ్లుగా ఇంతే.. అసెంబ్లీ ముందుకు రాని యాన్యువల్ ఫైనాన్షియల్​​ రిపోర్టులు
  • కార్మికుల జీతాలకు డబ్బుల్లేవనటంతో పద్దులపై అనుమానాలు

ఐదేండ్లుగా ఆర్టీసీ రాబడి ఖర్చుల లెక్కా పత్రం లేదు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచీ ఇప్పటిదాకా.. ఆర్టీసీ మేనేజ్​మెంట్​ తమ వార్షిక ఆదాయ వ్యయాల నివేదికలను బయటపెట్టలె. ప్రజలకు, చట్టసభలకు, అకౌంటెంట్​​​ జనరల్​కు రిపోర్టులు ఇవ్వలేదు. స్వయంగా కాగ్ ఈ  నిర్వాకాన్ని నిరుడే ఎండగట్టింది. ఆర్టీసీ తమకు అకౌంట్లను సమర్పించలేదని గతేడాది అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్​ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. ఇప్పటికీ ఆర్టీసీ తమ అకౌంట్లను కాగ్​కు అందించకపోవటం అనుమానాలకు తావిస్తోంది. కార్మికులకు జీతాలిచ్చేందుకు డబ్బుల్లేవని ఆర్టీసీ మేనేజ్​మెంట్​ హైకోర్టుకు నివేదించిన నేపథ్యంలో ఈ విషయంపై ఆరా తీస్తే అకౌంట్ల గోప్యత వ్యవహారం బయటపడింది.

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో 28 ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. చట్ట ప్రకారం ఆయా సంస్థలన్నీ ఏ ఏడాదికాయేడు తమ ఆదాయ వ్యయాలను బహిరంగ పరచాలి. సంస్థ లాభాల్లో ఉన్నా.. నష్టాల్లో ఉన్నా కుల్లంకుల్లాగా బ్యాలెన్స్​షీట్​ను  వెల్లడించాలి.  కార్పొరేషన్లన్నీ తమ అకౌంట్ల వివరాలు, అంతకు ముందు ఏడాది ఆడిట్​ రిపోర్టుతో సహా వార్షిక నివేదికలను ప్రచురించి… ప్రతి ఏడాది అసెంబ్లీకి అందజేయాలి. సాధారణంగా బడ్జెట్​ సమావేశాల్లో వీటిని శాసనసభలో పెట్టే ఆనవాయితీ ఉంది. సింగరేణి, జెన్​కో, డిస్కమ్​లతో పాటు పలు కార్పొరేషన్లు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. రాష్ట్ర విభజనం అనంతరం ఏపీఎస్​ఆర్​టీసీ నుంచి విడివడ్డ టీఎస్​ఆర్​టీసీ ఇప్పటివరకు తమ ఆదాయ వ్యయాలను పెండింగ్​లో పెట్టింది. ఇప్పటికీ 2015–16 కు సంబంధించిన అకౌంట్లను ఆర్టీసీ తమకు అందించలేదని ఆటిట్​వర్గాలు ధ్రువీకరించాయి.  గత ఏడాది ఉన్న పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతోందని ఒక ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. చట్ట ప్రకారం కార్పొరేషన్లన్నీ తమ అకౌంట్లను ప్రతి ఏడాది కాగ్​కు అప్పగించి.. ఆడిట్​ చేయించుకోవాలి. ఆర్టీసీకి సంబంధించిన అకౌంట్ల పరిశీలనకు ప్రత్యేకంగా రెసిడెంట్​ ఆడిట్​ ఆఫీసర్​ ఒకరు​ బస్​ భవన్​లోనే అందుబాటులో ఉంటున్నారు. కానీ ఆర్టీసీ యాజమాన్యం అకౌంట్ల నిర్వహణను గాలికొదిలిసి.. ఆదాయ వ్యయాల వివరాలపై పట్టింపులేని ధోరణి ప్రదర్శించినట్లు అర్థమవుతోంది. ఉన్నఫళంగా కనీసం కార్మికుల జీతాలు చెల్లించేందుకు డబ్బుల్లేవని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టులో చేతులెత్తేసిన తీరు ఇప్పుడు చర్చకు తెరలేపింది.

అడిగిందెంత.. ఇచ్చిందెంత..?

సెప్టెంబర్​లో జీతాలకు రూ.240 కోట్లు కావాలని, తమ దగ్గర రూ.8 కోట్లే ఉన్నాయని హైకోర్టుకు సర్కారు నివేదించింది. ఆదాయ వ్యయాలను వెల్లడించకుండా, ఆర్టీసీ తమ అకౌంట్లను గోప్యంగా ఉంచటం.. తమ చేతిలో చిల్లిగవ్వ లేదని చెప్పుకునేందుకు ప్రాధాన్యమిచ్చిన తీరు ఆడిట్​ విభాగాన్ని సైతం విస్మయానికి గురి చేసింది. రాష్ట్రంలోని 11 రీజియన్లలో 93 బస్​ డిపోలున్నాయి. ఏ డిపో పరిధిలో ఎక్కువ నష్టాలు వస్తున్నాయి.. ఎక్కడ ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి.. ఎక్కడ లాభాల బాట పట్టాయి.. ఎక్కడికక్కడే లాభనష్టాలను బేరీజు వేసుకొని, అక్కడున్న అవరోధాలను అధిగమించే దిశగా  ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికీ పట్టించుకోకపోవటం శాపంగా మారిందని విమర్శలున్నాయి. కాగ్​ నివేదికల ప్రకారం.. 2018 మార్చి నాటికి ఆర్టీసీకి ప్రభుత్వం అడ్వాన్సులు, లోన్ల రూపంలో రూ.870 కోట్లు చెల్లించింది. 2019 మార్చి నాటికి  పూచీకత్తుపై రూ.850 కోట్ల రుణాలు ఇప్పించినట్లు బడ్జెట్ నివేదికల్లో సీఎం వెల్లడించారు. ఇప్పటికీ పాసులు, సబ్సిడీల రూపంలో ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని ఆర్టీసీ క్లెయిమ్​ చేస్తున్న నిధులకు, ఇచ్చే డబ్బులకు పొంతన లేదు. ప్రభుత్వం ఏటేటా బడ్జెట్​లో ఇచ్చినట్లు చెబుతున్న నిధుల్లో మూడో వంతు పాత అప్పుల వడ్డీలకే సరిపోతోంది. వీటని దాచిపెట్టేందుకే ఆర్టీసీ అకౌంట్లను సమర్పించటం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

లెక్కలేనన్ని లొసుగులు

ఆర్టీసీలో  కాలం చెల్లిన బస్సులు, గ్రామీణ రూట్లలో ఉన్న ఆక్యుపెన్సీ రేషియో కారణంగా రోజుకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల నష్టం తప్పటం లేదనేది అధికారుల అంచనా.  కానీ.. ప్రతి ఏడాది ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీలను విడుదల చేసి.. నిబద్ధత ఉన్న ఎండీని, బోర్డును నియమిస్తే ఈ నష్టాలను తగ్గించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలున్నాయి. నిర్వహణ వ్యయాల మోత మోగటం, పాత అప్పులకు వడ్డీల భారం పెరిగినప్పటికీ.. ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని నిరుడే కాగ్​ వేలెత్తిచూపింది. అయిదు రీజియన్లలో 33 బస్​ స్టేషన్లలో స్టాళ్లు ఖాళీగా ఉన్నాయని, వాటి ద్వారా ఏటా  రావాల్సిన  రూ.3.95 కోట్ల రెవిన్యూను సంస్థ నష్టపోయిందని ప్రస్తావించింది. సర్వీసు టాక్స్​ చెల్లించాలని సర్క్యులర్​ జారీ చేయటంలో రెండేళ్లు ఆలస్యం చేసిందని.. దీంతో లైసెన్స్​ దారులు చెల్లించాల్సిన రూ.5.95 కోట్లు సంస్థ బకాయి పడిందని, సంస్థ సొంత ఖాతా నుంచి చెల్లించాల్సి వచ్చిందని కాగ్​ ఎండగట్టింది. గ్రేటర్​ సిటీలో కూకట్​పల్లి, కోఠి బస్​ టెర్మినల్స్​లో కమర్షియల్​ స్పేస్​ను సద్వినియోగం చేసుకోవటంతో రూ. కోట్ల ఆదాయం కోల్పోయిందని ప్రస్తావించింది. అద్దె బస్సులు, అడ్వర్టయిజ్​మెంట్​ కాంట్రాక్టర్ల నుంచి రూల్స్‌ ప్రకారం రావాల్సిన డబ్బులు వసూలు చేయలేకపోయిందని, నిబంధనలను పట్టించుకోకపోవటంతో  రూ.2.62 కోట్లు నష్టపోయిందని, కొత్త బస్సులపై ప్రకటనలిచ్చే అవకాశమున్నా నిర్లక్ష్యంతో మరింత కోల్పోయిందని పేర్కొంది.

There is no RTC revenue expenditure account for five years

Latest Updates