తిండి లేదు,తాగేందుకు నీళ్లు లేవు.. ఇంకా వరద నీటిలోనే 400 కాలనీలు

  • 4 రోజులైనా వీడని కష్టాలు.. ఇంకా నీటిలోనే 400 కాలనీలు
  • వరద తగ్గినా.. బురదలోనే 250 బస్తీలు
  • సాయం కోసం జనం ఎదురుచూపులు
  • ముంపుపై ముందస్తుగా అలర్ట్​ కాని  జీహెచ్​ఎంసీ
  • నీళ్లను, బురదను తొలగించేందుకు సరిపోని మెషీన్లు, స్టాఫ్​

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర రాజధానిలో వందలాది బస్తీలు, కాలనీలు, అపార్టుమెంట్ల సెల్లార్లు బురదతో నిండిపోయాయి. మూసీ పరీవాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం కాస్త తగ్గడంతో ఇండ్లను శుభ్రం చేసుకునే పనిలో స్థానికులు నిమగ్నమయ్యారు. క్లీనింగ్​ను జీహెచ్​ఎంసీ పట్టించుకోకపోవడంతో ఎవరి కాలనీలను వారు శుభ్రం చేసుకుంటున్నారు. కష్టపడి సంపాదించుకున్న ఆహార పదార్థాలు, కిచెన్ సామన్లు, ఇంటి వస్తువులు అన్నీ నీటిలో మునిగిపోవడంతో జనం ఆందోళన చెందుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో సాయం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. మెడిసిన్స్​ అందకపోవడం, సమయానికి తిండిలేక పోవడంతో బీపీ, షుగర్​ పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రోజంతా కురిసిన కుండపోత వాన గురువారం కాస్త తెరిపిచ్చినప్పటికీ.. 400 కాలనీల్లో ఇంకా వరద నీరు నిలిచే ఉంది. సుమారు 250 కాలనీల్లో వరద నీరు తగ్గినప్పటికీ బురద తీవ్ర సమస్యగా మారింది. ఫలక్​నుమాలోని అల్​జుబైర్​ కాలనీ, బండ్లగూడలోని అలీకాలనీ, టోలీచౌకిలోని నదీంకాలనీ, జాంబాగ్‌​తో పాటు అనేక కాలనీలు నీటిలోనే ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చాలా ఏరియాల్లో నీరు పోయేందుకు దారి లేకపోవడంతో నీళ్లు మొత్తం పోయేందుకు మరో రెండు, మూడ్రోజులు పట్టే అవకాశం ఉంది.  డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో వాటిలోంచి వరద నీరు పోయే పరిస్థితి లేదు.  మూసీకి  ఆనుకొని ఉన్న మూసానగర్, వినాయక్​దిది, రసూల్ పురా, వాహెత్​నగర్, శంకర్​నగర్​, పద్మానగర్​, న్యూ పద్మానగర్​, ఓల్డ్​ మలక్​ పేట్​, చాందిని బ్రిడ్జి, మహారాజ్​ హోటల్​ ప్రాంతాల్లో బురద, ఇసుక మోకాళ్ల లోతు దాకా ఉంది. కొన్ని ప్రాంతాల్లో నడుములోతు వరకు కూడా ఉంది. ఈ ప్రాంతాల్లో నివసించేవారు ఎక్కువగా రోజువారీ కూలీలే. ఇక్కడ దాదాపు 4వేల ఇండ్లలోకి వరద నీరు వచ్చింది. వందల ఇండ్లు కూలిపోయాయి.

ముందుగా అలర్ట్​ చేయలే

వరద నీరు రావొచ్చని రాత్రి టైంలో చెప్పారని, అప్పటికే అందరూ నిద్రలో ఉన్నారని మూసీ పక్కన ఉండే కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు ముందే అలర్ట్​ చేసుంటే ఇంత డ్యామెజ్​ జరిగేది కాదంటున్నారు. చేసేదేంలేక కట్టుబట్టలతో బయటకు వచ్చామని, ఇప్పుడు ఇంట్లో బురద తప్ప ఏం మిగల్లేదని ఆందోళన చెందుతున్నారు. వరద నివారణ, నియంత్రణ, సహాయ చర్యల్లో జీహెచ్ఎంసీ, ప్రభుత్వం  పూర్తిగా ఫెయిలైందని బాధితులు మండిపడుతున్నారు. భారీ వర్షాలు వస్తాయని తెలిసినా.. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయలేదని విమర్శిస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఫిర్యాదులు వస్తున్నా.. దానికి తగ్గట్టు ఎక్విప్ మెంట్ లేకపోవడంతోపాటు, అరకొరగా  పనులు చేపట్టారు. ఫిర్యాదులు  పెరగడంతో  32 భారీ మోటార్లను అద్దెకు తెచ్చుకుంటున్నట్లు  బల్దియా వర్గాల సమాచారం.

ఇక్కడే డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టియ్యాలి

రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇక్కడే డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టియ్యాలి. మా కాలనీలో అందరూ డైలీ లేబర్లే. వరద తగ్గింది కానీ బురద క్లీన్​ చేసుకోవడానికి మస్తు ఇబ్బందైతున్నది.

– పర్వత్​బేగం,    ముసారంనగర్​ వాసి, హైదరాబాద్​

అన్నీ కొట్టుకపోయినయ్

అప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం తో కట్టు బట్టలతో ఇండ్లలోంచి వెళ్లిపోయినం. వెహికల్స్, ఎలక్ట్రానిక్​ సామన్లు, బట్టలు ఏం లేకుండా అన్నీ కొట్టుకపోయినయ్. కట్టుకునేందుకు బట్టలు లేవు, రాత్రికి నిద్రించేందుకు దుప్పట్లు కూడా లేవు. వెంటనే  ప్రభుత్వం ఆదుకోవాలి.

– ఎం.ఖాజా, ముసారం నగర్​ వాసి, హైదరాబాద్​

ఇంకా చీకట్లోనే 66 వేల కుటుంబాలు

హైదరాబాద్‌‌, వెలుగు: వర్ష బీభత్సం నుంచి పవర్ సిస్టమ్ ఇంకా కోలుకోలేదు. ఒక్క హైదరాబాద్‌‌ నగరంలోనే 222 ట్రాన్స్ ఫార్మర్ల పరిధిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. కాలనీలు, అపార్ట్​మెంట్ల సెల్లార్లలో, బస్తీల్లో వరద నీరు అలాగే ఉండటంతో అధికారులు కరెంటు సప్లై స్టార్ట్ చేయలేదు. ఒక్కో ట్రాన్స్‌‌ఫార్మర్‌‌ పరిధిలో 300 వరకు విద్యుత్‌‌ కనెక్షన్లు ఉంటాయి. ఇలా 222 ట్రాన్స్‌‌ ఫార్మర్ల పరిధిలో దాదాపు 66 వేలకు పైగా కనెక్షన్లు ఉంటాయి. దీంతో 66 వేలకు పైగా కుటుంబాలు 4 రోజులుగా చీకట్లోనే గడపాల్సిన దుస్థితి. రాత్రిళ్లు అటు వరద, ఇటు చీకటిలో వర్ష బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.సరూర్ నగర్ విద్యుత్‌‌ డివిజన్ పరిధిలో అపార్ట్‌‌ మెంట్‌‌లోని సెల్లార్లన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. చార్మినార్ విద్యుత్‌‌ డివిజన్ పరిధిలోని కాలనీల్లో వరద నీరు కారణంగా 28 ట్రాన్స్ ఫార్మర్లకు సరఫరా పునరుద్ధరించలేదు. హబ్సీగూడ సర్కిల్‌‌ లోని సాయిచిత్రా నగర్‌‌, రామంతాపూర్‌‌, బేగంపేట్‌‌ పరిధిలోని బ్రాహ్మణవాడి, పిర్జాదిగూడ మళ్లికార్జున్‌‌ నగర్‌‌, రాజ్‌‌నగర్‌‌ మక్తా, ఖైరతాబాద్ లోని సీఐబీ క్వార్టర్‌‌ క్వార్టర్స్ లలో నీళ్లు చేరాయి. ఆయా ప్రాంతాల్లో పవర్ సప్లై స్టార్ట్ కాక పోవడంతో ప్రజలు చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి. నాంపల్లి, సోమాజిగూడ, ఆనంద్‌‌నగర్‌‌, వెంకట్‌‌రమణ కాలనీ, ఎర్రమంజిల్‌‌ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఇంకా నీరు నిలిచి ఉన్నా కరెంటు సరఫరా చేస్తున్నట్లు విద్యుత్‌‌ వర్గాలు వెల్లడించాయి.

పరిశీలించాకే సరఫరా: సీఎండీ రఘుమారెడ్డి

క్షేత్రస్థాయి అధికారులు పరిసరాలను పూర్తిగా పరిశీలించాకే సప్లై పునరుద్ధరించాలని టీఎస్‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌ సీఎండీ రఘుమారెడ్డి ఆదేశించారు. మూడు రోజులుగా విద్యుత్ అధికారులు, సిబ్బంది కరెంట్ సప్లై చేసేందుకు పని చేస్తున్నారన్నారు. శుక్రవారం అధికారులతో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

Latest Updates