పెట్రోల్‌‌, డీజిల్‌‌ కార్లు ఉంటాయ్​ : గడ్కరీ

ఆటో ఇండస్ట్రీని ఆదుకుంటాం ..వెహికిల్స్‌‌పై జీఎస్టీ
తగ్గించాలని కోరుతాం .. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన

న్యూఢిల్లీ: కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోల్‌‌, డీజిల్‌‌ వెహికిల్స్‌‌ను పూర్తిగా నిషేధిస్తామని రెండేళ్ల క్రితం ప్రకటించిన కేంద్రమంత్రి నితిన్‌‌ గడ్కరీ ఇప్పుడు యూటర్న్‌‌ తీసుకున్నారు. సంప్రదాయ ఇంధన వాహనాలను తిరగనీయబోమని 2017లో సియామ్‌‌ వేదికపై ప్రకటించిన ఆయన గురువారం మళ్లీ ఇదే సంఘం సమావేశంలో స్వరం మార్చారు. వీటిని నిషేధించే ప్రతిపాదన ఏమీ లేదని కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్‌‌, ఎంఎస్‌‌ఎంఈల మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. గత నెల దాదాపు అన్ని ఆటోమొబైల్‌‌ కంపెనీల అమ్మకాలు పడిపోవడంతో ఆయన ఈ మాటలు అన్నారు. పెట్రోల్‌‌, డీజిల్‌‌ వాహనాలపై జీఎస్టీని తగ్గించి ఆటో ఇండస్ట్రీని ఆదుకోవాలన్న కంపెనీల వినతిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కొంతకాలంపాటు జీఎస్టీ తగ్గించినా కంపెనీలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

రూ.ఐదు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడతాం

కమర్షియల్‌‌ వెహికిల్స్‌‌కు డిమాండ్‌‌ పెంచడానికి రాబోయే మూడు నెలల్లో రూ.ఐదు లక్షల విలువైన 68 రోడ్‌‌ ప్రాజెక్టులను చేపడతామని ప్రకటించారు. వీటికోసం ఇప్పటికే 80 శాతం భూమిని సేకరించాం.  అమ్మకాలు పెరగాలంటే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్పనిసరని అన్నారు. ‘‘  ఎలక్ట్రిక్‌‌ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి ఐదుశాతానికి తగ్గించారు. డీజిల్‌‌, పెట్రోల్‌‌ వాహనాలపైనా ఐదుశాతం జీఎస్టీనే వసూలు చేయాలని నేను సూచిస్తాను. హైబ్రిడ్‌‌ వెహికిల్స్‌‌పైనా పన్ను తక్కువ వేయాలని ప్రతిపాదిస్తాను. చక్కెర పరిశ్రమలకు ఎన్నో రాయితీలు ఇచ్చినట్టే ఆటో పరిశ్రమకూ ఇవ్వాలని కోరతాను. ఈ విషయాలన్నింటినీ ఆర్థికమంత్రితో చర్చిస్తాను’’ అని గడ్కరీ వివరించారు. ఎలక్ట్రిక్‌‌ వాహనాల తయారీ ప్రారంభించకుంటే ఆటోపరిశ్రమ కుప్పకూలుతుందని 2017లో మంత్రి హెచ్చరించడం గమనార్హం.

ఆటో సెక్టార్‌‌ డీలాపడింది. ప్రభుత్వం తప్పక ఆదుకోవాలి. కనీసం స్వల్పకాలానికి అయినా మినహాయింపు ఇవ్వాలి. జీఎస్టీ తగ్గింపు అడగడం నాకు నచ్చదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదు. కస్టమర్లు ‘ఇంకొంతకాలం ఆగుదాం’ అనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు జీఎస్టీ తగ్గిస్తే వాళ్లంతా షోరూమ్‌‌లకు వస్తారు. పైగా ఇది పండగల సీజన్‌‌ కూడా కాబట్టి అమ్మకాలు పెరుగుతాయి.

పవన్‌‌ గోయెంకా,                                                                                                                                                               మహీంద్రా అండ్‌‌ మహీంద్రా ఎండీ

Latest Updates