ఏసీ బిల్లు పెరగకుండా ఉండాలంటే.?

ఎండలు పెరుగుతున్నకొద్దీ జనం వేడి, చెమటతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బయటికి వెళ్లకపోయినా, ఇంట్లో వేడితోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దాంతో దాదాపు పగలు, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలూ ఏసీలు ఆన్​ చేస్తున్నారు. ఇంత వరకూ ఓకే. కానీ కరెంట్​ బిల్లు సంగతేంటి? ఒక్కసారిగా వేలల్లో వచ్చే బిల్లును చూస్తే, ఏసీలో కూడా చెమటలు పట్టడం ఖాయం. కొన్ని చిట్కాలు పాటిస్తే మాత్రం.. కరెంట్​ బిల్లు తక్కువ చేసుకోవచ్చు.

డీఫాల్ట్​ టెంపరేచర్​ : ఈ ఏడాది మొదట్లోనే బ్యూరో ఆఫ్​ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఏసీ కంపెనీలకు డీఫాల్ట్​ టెంపరేచర్​గా 24 డిగ్రీలను పెట్టమని సూచించింది. అంతకుముందు డీఫాల్ట్​ టెంపరేచర్​ 20 డిగ్రీలు ఉండేది. ఏసీ టెంపరేచర్​ ఒక్కో డిగ్రీ పెంచుతున్న కొద్దీ..  కరెంట్​ బిల్లు ఆరుశాతం తగ్గుతుందని కొన్ని స్టడీస్​ కూడా చెప్తున్నాయి. ఇలా టెంపరేచర్​ని పెంచి బిల్లు తగ్గించుకోవచ్చు.

18 డిగ్రీల నుంచి 24 డిగ్రీలు : పెద్దపెద్ద నగరాల్లో పగలు టెంపరేచర్​ మినిమం 34 డిగ్రీలు ఉంటోంది. సాధారణంగా మనుషుల బాడీ టెంపరేచర్​ కూడా సుమారు 36–37 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఏసీ టెంపరేచర్​ బయటి కంటే పది డిగ్రీలు తక్కువ ఉంటే సరిపోతుంది. అంటే, 23–24 డిగ్రీలు పెడితే రూమ్​ చల్లబడుతుంది. అందుకని 18 డిగ్రీల టెంపరేచర్​ పెట్టకుండా.. 23–24 డిగ్రీలు పెడితే చల్లగా ఉండొచ్చు. మరోవైపు కరెంట్​ బిల్లు ఆదా చేసుకోవచ్చు.

సీల్డ్​ రూమ్స్​ బెటర్​ : ఇంట్లోని ఏసీ గాలి బయటి పోకుండా.. తలుపులు, కిటికీల్లోంచి వేడి ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. ఇంట్లోని ఫ్రిజ్​, టీవీ, కంప్యూటర్​ వంటి ఎలక్ట్రానిక్​ పరికరాలు వేడిని విడుదల చేస్తాయి. అందుకని ఏసీ ఆన్​ చేసినప్పుడు బయటి వేడి లోపలికి రాకుండా రూమ్​ క్లోజ్డ్​గా ఉండాలి. అలాగే ఏసీ ఉన్న గదిలో ఎలక్ర్టానిక్​ గాడ్జెట్స్​ ఆన్​ చేసి ఉంటే వాటిని ఆపేయాలి.  రూమ్​ చల్లగయ్యాక వాటిని ఆన్​ చేసుకోవడం బెటర్​.

స్విచ్​ ఆన్​–స్విచ్​ ఆఫ్​ : పగలంతా రూమ్​లో ఏసీ ఆన్​ చేసినప్పుడు, ఎలాగూ చల్లగానే ఉంటుంది. కాబట్టి రాత్రిళ్లు ఏసీ ఆఫ్​ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా మధ్యలో చల్లగా అనిపిస్తే దుప్పటి కప్పుకుంటారే తప్ప, లేచి ఏసీ ఆఫ్​ చేసేంత మెలకువ, ఓపిక ఉండదు. అలా రాత్రంతా ఏసీ నడిచినప్పుడు కరెంట్​ బిల్లు ఎక్కువ రావచ్చు. అలాగే పగలైనా, రాత్రైనా.. ఏసీని రెండు గంటలు ఆన్​ చేసి మరో రెండు గంటలు​ ఆఫ్​ చేయాలి. అలా చేస్తే రూమ్​ చల్లగా ఉంటూనే కరెంట్​ వాడకం తగ్గుతుంది.

ఏసీతో పాటు ఫ్యాన్​ వేయాలి : ఇంట్లో ఏసీ నడుస్తున్నప్పుడు ఫ్యాన్​ కూడా వేయాలి. అప్పుడు ఏసీ ద్వారా వచ్చే చల్లదనాన్ని ఫ్యాన్​ గదంతా పరుస్తుంది. దాంతో వేడి త్వరగా పోయి గది చల్లబడుతుంది. అప్పుడు కొద్దిసేపు ఏసీ ఆపేయొచ్చు. కావాలంటే మళ్లీ వేడిగా అనిపించినప్పుడు ఆన్​ చేసుకోవాలి.

రెగ్యులర్​ సర్వీసింగ్​ : ఏసీ లోపల పేరుకుపోయే చెత్త, దుమ్ము వల్ల పనితీరు నెమ్మదిస్తుంది. దానివల్ల రూమ్​ చల్లబడే టైం పెరుగుతుంది. అంటే ఐదు నిమిషాలకు బదులు పది నిమిషాల టైం పడుతుంది. అందుకని ఫిల్టర్లలో ఉండే దుమ్మును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.  దానివల్ల 10–15శాతం కరెంట్​ బిల్లు ఆదా చేయొచ్చు. రెగ్యులర్​ సర్వీసింగ్​ ఏసీ పనితీరు మెరుగుపర్చడంతో పాటు పెద్దపెద్ద రిపేర్లను రాకుండా అరికడుతుంది. ఇలాంటి చిట్కాలను పాటిస్తే, చల్లగా ఉంటూనే కరెంట్​ బిల్లు తగ్గించుకోవచ్చు.

Latest Updates