పని కోసం వచ్చి..ఇల్లు దోచేస్తారు

they-are-coming-to-work-and-stealing-homes-in-hydrebad

గచ్చిబౌలి, వెలుగు:ఇతర రాష్ట్రాల నుంచి పని పేరుతో సిటీకి వస్తున్న కొందరు చోరీలే లక్ష్యంగా ఖరీదైన కాలనీల్లో ఇండ్లను టార్గెట్ చేస్తున్నారు. మారుపేర్లతో ఇంటి ఓనర్లకు పరిచయం చేసుకుంటున్నారు. ఎలాంటి పనైనా చేస్తామని వారిని నమ్మిస్తున్నారు. ఇలాంటి వారిపై జాలిపడిన కొందరు ఇంటి ఓనర్లు పనిమనుషులుగా పెట్టుకుంటున్నారు. ఈ పనివాళ్లు అవకాశం దొరగ్గానే పక్కా స్కెచ్ వేసి ఇంట్లో ఉన్నదంతా దోచేస్తున్నారు. ఇలాంటి పనివాళ్లపై అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. ఎవరినైనా పనిలో పెట్టుకునే ముందు వారి వివరాలు తెలుసుకోవాలంటున్నారు.

ఇలాంటి ఇండ్లే టార్గెట్

భార్యభర్తలు ఇద్దరు జాబ్ చేస్తుండటం, సీనియర్ సిటీజన్స్ ఉండే ఇండ్లు, వ్యాపారుల ఇండ్లను టార్గెట్ చేసుకుని అక్కడ ఈ దొంగలు పనిలో చేరుతారు. ఇండ్లల్లో పనికి కుదిరాక ఓనర్లకు నమ్మకం వచ్చే వరకు బాగానే పనిచేస్తారు. ఇంట్లోకి విలువైన వస్తువులను, బంగారం, డబ్బు ఎక్కడున్నాయో గుర్తిస్తారు. ఇంటి ఓనర్ కదలికలను గమనిస్తారు. సరైన అవకాశం కోసం ఎదరుచూస్తారు. ప్లాన్ ప్రకారం టైం రాగానే ఇంట్లోని బంగారం, డబ్బు దోచుకుని అక్కడి నుంచి పారిపోతారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుండటంతో పోలీసులు ఇంటి ఓనర్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

కేపీహెచ్ బీలో

విశాఖపట్నం గాజువాక ప్రాంతానికి చెందిన ఎం.అనీషా(38) బతుకుదెరువు కోసం గతేడాది సిటీకి వచ్చింది. కూకట్ పల్లి ప్రాంతంలో పలు ఇండ్లకు వెళ్లి పని అడిగింది. చివరిగా కేపీహెచ్ బీలోని లోధా అపార్ట్ మెంట్ లోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో అనీషా పనిమనిషిగా చేరింది.  కొన్ని రోజుల పాటు పనిచేసి యజమానికి తనపై నమ్మకం వచ్చేలా చూసింది. ఇంట్లోని విలువైన వస్తువులు ఎక్కడెక్కడ పెడుతున్నారో..డబ్బులు ఎక్కడ దాస్తున్నారో మనీషా గమనించింది. అవకాశం రాగానే  వ్యాపారి ఇంట్లో ఉన్న రూ.4.50 లక్షల విలువైన డైమండ్​ఇయర్​ రింగ్స్​తో ఉడాయించింది. ఇంటి ఓనర్ కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగతనం చేసిన మనీషాను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన 2018 అక్టోబర్ లో కేపీహెచ్​బీ పీఎస్ పరిధిలో జరిగింది.

ప్లాన్ ప్రకారం దొంగతనం

చోరీలే లక్ష్యంగా- ఇండ్లల్లో పనికి చేరేవారు ముందు ఇంటి ఓనర్ల మనస్తత్వాన్ని గమనిస్తారని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.
భార్యభర్తల మధ్య విభేదాలుంటే వారి వీక్ నెస్ తెలుసుకుని ఒకరికి తెలియకుండా మరొకరిని నమ్మిస్తుంటారు. , డబ్బు, బంగారాన్ని ఎక్కడ పెడుతున్నారో తెలుసుకుంటారు. డబ్బు బ్యాంకులో ఉంచితే ఏ సమయంలో వాటిని ఇంటికి తెస్తున్నారో గమనిస్తారు. ఇలా అన్నీ తెలుసుకున్నాక అదును చూసి దొంగతనం చేసి పారిపోతారని పోలీసులు చెబుతున్నారు.

సైబరాబాద్ పోలీసులు చెబుతున్న జాగ్రత్తలు

  •     కొత్తవారిని పనిలో పెట్టుకునేప్పుడు వారి గుర్తింపు కార్డులైన ఆధార్, రేషన్, ఓటర్ ఐడీని చూపించమనాలి.
  •     సైబరాబాద్ పోలీసుల ‘హాక్-ఐ’ యాప్ లో పనిమనుషుల  వివరాలు రిజిస్టర్ చేయించాలి.
  •     ఇంట్లో సీసీ కెమెరాలను  ఏర్పాటు చేసుకోవాలి
  •     పనివాళ్ల విషయంలో ఇంటి ఓనర్లు జాగ్రత్తగా ఉండాలి. వారి ముందు ఆర్థిక లావాదేవిలకు సంబంధించిన విషయాలు మాట్లాడకూడదు.
  •     ఇంటికి సంబంధించిన అన్ని విషయాల్లో పని చేసే వారికి మితిమీరిన  స్వేచ్ఛను ఇవ్వకూడదు.
  •     ఇంట్లో కొత్తగా పనిలో చేరిన వారు గతంలో ఎక్కడ పనిచేశారో పూర్తి వివరాలు తెలుసుకోవాలి
  •     ఇంటి ‘కీ’ పనివారికి ఇవ్వకూడదు. ఆఫీసులకు వెళ్ళేవారు బీరువా, లాకర్లు ‘కీ’ తమ వెంట తీసుకువెళ్లడం ఉత్తమం.

అనుమానం వస్తే పోలీసులకు చెప్పాలి

ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చే వారిని ఇంట్లో పనికి పెట్టుకునే ఓనర్లు పూర్తి వివరాలతో పాటు గతంలో ఎక్కడ పనిచేశారో తెలుసుకుని గుర్తింపు కార్డులను పరిశీలించాలి. పనివారికి కనిపించే విధంగా విలువైన వస్తువులు, తాళాలు ఉంచరాదు. వ్యాపారులు, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటిజన్స్ ఈ విషయాల్లో తగిన జాగ్రతలు తీసుకున్న తర్వాతే వాళ్లను పనిలో పెట్టుకోవాలి. పనివాళ్లపై ఎలాంటి అనుమానాలు వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి

– రోహిణి ప్రియదర్శిని, సైబర్​ క్రైమ్స్​ డీసీపీ

Latest Updates