సొంతూళ్లకు వచ్చిన్రు ఉపాధి పనులు చేస్తున్రు

సొంతూళ్లకు వచ్చిన్రు
ఉపాధి పనులు చేస్తున్రు
లాక్ డౌన్ తొ పట్నంనుంచి

తిరిగి వచ్చిన కార్మికులు
ఆదుకుంటున్న ఉపాధి హామీపథకం

కామారెడ్డి, వెలుగు: ఇన్నాళ్లు పట్నంలో ఏదో ఒక పని చేసుకుంటూ బతికి, లాక్ డౌన్ తొ సొంత ఊళ్లకు వచ్చిన వారిని ఇప్పుడు ఉపాధి హామీ పనులు ఆదుకుంటున్నాయి. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తోంది. అత్యవసర, నిత్యావసర వస్తువుల ఇండస్ట్రీస్, షాపులు మినహా మిగిలినవన్నీ మూతపడ్డాయి. పల్లెల నుంచి పట్టణాలకు వలస వెళ్లి కంపెనీలు, నిర్మాణ రంగ సంస్థలు, మార్కెటింగ్ లో పనిచేస్తూ, డ్రైవర్లుగా, ఆటోలు నడుపుతూ, హోటళ్లు, వివిధ షాపుల్లో పని చేస్తున్న వాళ్ల పరిస్థితి ఆగమైంది. ఇంటి కిరాయిల చెల్లింపు, పొట్టనింపుకోవటం కష్టమని భావించి అనేకమంది తిరిగి హైదరాబాద్, ఇతర సిటీల నుంచి సొంతూళ్లకు చేరారు. ఇదే టైమ్లో ఊర్ల‌లో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఉపాధి హామీ పథకం పనులు కలిసి వచ్చాయి. రోజూ ఉపాధి పనులకు పోతూ జీవనోపాధి పొందుతున్నారు.

జోరుగా ఉపాధి పనులు
ఊళ్ల‌లో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయ పనులు లేకపోవడంతో స్థానికులు ఉపాధి పనులు చేస్తున్నారు. వారితోపాటు పట్నం నుంచి తిరిగి వచ్చిన వలస కార్మికులు కూడా వెళ్తున్నారు. కరోనా నేపథ్యంతో సోషల్ డిస్టెన్స్ తో ఉపాధి హామీ స్కీమ్ ద్వారా కూలీలకు పనులు కల్పించవచ్చని కేంద్రం ఆదేశించింది. దీంతో జిల్లాలో ఆఫీసర్లు పనులు మొదలుపెట్టారు. వారం రోజులుగా పనులు జోరందుకున్నాయి. ఇంటి యజమానితో పాటు, కుటుంబీకుల పేర్లు జాబ్ కార్డులో ఉంటాయి. దీంతో కుటుంబ సభ్యులందరూ వెళ్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం కోసం గ్రామాల్లోని ప్రతి ఒక కుటుంబం జాబ్కార్డు పొందింది. ఇప్పుడు ఆ కార్డులు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

కామారెడ్డిజిల్లా లో ఎక్కడెక్కడ?

జిల్లాలోని పలు మండలాల్లో కూలీలు ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి, లింగంపేట, ఎల్లారెడ్డి , భిక్కనూరు, దోమకొండ, రాజంపేట, సదాశివనగర్, రామారెడ్డి, నాగిరెడ్డిపేట, తాడ్వాయి, బీబీపేట తదితర మండలాల్లోని గ్రామాల్లో ఉపాధి పనులు చేస్తున్నారు. కామారెడ్డిమండలం ఉగ్రవాయి గ్రామంలో 410 జాబ్ కార్డులు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం 335 మంది ఉపాధి హామీ పనులకు పోతున్నారు. హైదరాబాద్, ఇతర పట్టణాల నుంచి ఇక్కడకు 20 మంది వరకు తిరిగి వచ్చారు. వీరిలో 14 మంది ఉపాధి పనులు చేస్తున్నారు. లింగంపేట మండలం మెంగారంలో 314 జాబ్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం 245 మంది ఉపాధి పనులకు పోతున్నారు. ఈ గ్రామం నుంచి రాజధానికి 25 మంది బతుకుదెరువు కోసం వెళ్లారు. లాక్ డౌన్తో వీరంతా తిరిగి సొంతూరికి చేరుకుని ఉపాధి పనులకు వెళ్తున్నారు. రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో 280 జాబ్ కార్డులు ఉన్నాయి. పది మంది హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. వీరంతా ఉపాధి పనులు చేస్తున్నారు. చాలా గ్రామాల్లో 15 నుంచి 30 కుటుంబాల వరకు తిరిగి వచ్చారు. వీరిలో 80 శాతం వరకు కూలీ పనులకు హాజరవుతున్నారు.

Latest Updates