ఫారిన్‌ బ్రాండ్సే కిక్కంట!

  • మస్తుగ తాగుతున్న మందుబాబులు
  • రాష్ట్రంలో 30 శాతం పెరిగిన సేల్స్
  • రేటు ఎక్కువైనా పెరుగుతున్న మోజు
  • మొత్తంగా లిక్కర్ అమ్మకాల్లోనూ జోష్

హైదరాబాద్‌, వెలుగురాష్ట్రంలో విదేశీ బ్రాండ్ల మద్యానికి డిమాండ్​ పెరుగుతోంది. ధరలు ఎక్కువగా ఉన్నా కూడా ఏటేటా ఐఎంఎఫ్ఎల్​ (ఇండియన్ మేడ్​ ఫారిన్​ లిక్కర్) అమ్మకాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత మూడేళ్లుగా మందుబాబులు ఫారిన్​ లిక్కర్​ ఎక్కువగా కొంటున్నారని ఎక్సైజ్​శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో 27,43,915 బాక్సుల ఐఎంఎఫ్‌ఎల్‌ సేల్‌ అయింది. గతేడాది ఏప్రిల్​లో ఇది 20,56,065 బాక్సులు మాత్రమే కావడం విశేషం. అంటే అమ్మకాల్లో 30 శాతం పెరుగుదల నమోదైంది. మే నెలను పరిశీలించినా గతేడాది కంటే 30 శాతం అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు 14,82,567 బాక్సుల ఐఎంఎఫ్ఎల్​ అమ్ముడవగా.. గతేడాది ఇదే సమయంలో 12,72,276 కేసులు వినియోగమయ్యాయి. రాష్ట్రంలో మొత్తంగా లిక్కర్​ అమ్మకాలను పరిశీలిస్తే.. ఈ నెల ఒకటి నుంచి 16వ తేదీ వరకు రూ. 907 కోట్లుకాగా.. గతేడాది ఇదే సమయంలో (మొదటిపేజీ తరువాయి)

రూ. 744 కోట్లు మాత్రమే. అంటే 22 శాతం పెరుగుదల నమోదైంది

ఎక్కువ శాతం హైదరాబాద్​లోనే..

గతంలో ఫారిన్‌ లిక్కర్‌ సేల్స్‌ చాలా తక్కువగా ఉండేవి. కొంతకాలంగా అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సంపన్న వర్గాలు, ఎగువ మధ్యతరగతి వాళ్లు ఫారిన్​ లిక్కర్​ వైపు ఆకర్షితులవుతున్నారు. మొత్తంగా చూస్తే ఫారిన్​ లిక్కర్​ సేల్స్​లో 90 శాతం వరకు హైదరాబాద్​లోనే ఉన్నట్టు అంచనా. హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌ వంటి ఐటీ కారిడార్​ ప్రాంతాలు, సంపన్నులు ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, అమీర్‌పేట, కూకట్​పల్లి ప్రాంతాల్లో ఫారిన్​ లిక్కర్​ అమ్మే షాపులు వెలిశాయి. ఆయా చోట్ల ఉన్న రెస్టారెంట్లలోనూ జోరుగా అమ్మకాలు సాగుతున్నయి. గ్లోబల్‌సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరానికి విదేశీయుల రాక కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతోనూ ఫారిన్​ లిక్కర్​ సేల్స్​ ఉంటున్నాయి. సాధారణ వైన్స్​ షాపుల్లోనూ విక్రయాలను అనుమతి ఇవ్వడంతో జిల్లాల్లోనూ ఫారిన్​ లిక్కర్​ అందుబాటులో ఉంటోంది. అయితే జిల్లాల్లో కొంత ధర తక్కువగా ఉండే బ్రాండ్లే అమ్ముడవుతున్నాయని చెబుతున్నారు.

Latest Updates